JC Prabhaka and Madhavi Latha
ఎంటర్‌టైన్మెంట్

Madhavi Latha: జేసీని వదలని మాధవీ లత.. ఈ సారి ఏం చేసిందంటే?

హైదరాబాద్, స్వేచ్ఛ: తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి- నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత మధ్య వివాదం రోజురోజుకూ ముదురుతోంది. తాను తప్పుగా మాట్లాడానని, క్షమించాలి అంటూ ఇప్పటికే జేసీ వివరణ కూడా ఇచ్చారు. అయినా సరే జేసీని వదిలే ప్రసక్తే లేదని, ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఇప్పటికే ఆయనపై ‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌) లో ఫిర్యాదు చేసిన మాధవీ మంగళవారం సైబరాబాద్ సీపీకి రాతపూర్వక ఫిర్యాదు చేశారు. అనంతరం స్వేచ్ఛ-బిగ్ టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన మాధవీ.. ప్రభాకర్ రెడ్డి మాట్లాడిన మాటలు సభ్య సమాజం, మహిళలు తలదించుకునే విధంగా ఉన్నాయని, ఇప్పటికే తాను లీగల్ నోటీసులు పంపినట్లు తెలిపారు. సినిమాలో నటిస్తున్న మహిళలపై అసభ్యంగా ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు.

సీఎం, డిప్యూటీ సీఎం హామీ
‘ జేసీ వ్యాఖ్యలతో నాతో పాటు నా కుటుంబ సభ్యులు ఇబ్బంది పడ్డారు. ఇష్టానుసారంగా బూతులు మాట్టాడేసి, ఆపై సారీ చెబితే సరిపోతుందా? 15 రోజులుగా నేను సరిగ్గా నిద్రపోలేదు. నాకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరాను. నిన్న మొన్నటి వరకు జేసీ ప్రభాకర్ రెడ్డి అంటే ఎవరో కూడా నాకు తెలియదు. ఆయనపై ఫిర్యాదును వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు. నేను ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాను. అందుకే ఆయన క్షమాపణలు చెప్పారు. నాకు నా బీజేపీ అండగా ఉంటుంది. న్యాయం చేస్తామని పోలీసులు నాకు హామీ ఇచ్చారు. మహిళలను కించే పరిచే విధంగా ఎవరైనా మాట్లాడితే వారిని వదిలిపెట్టమని సీఎం, డిప్యూటీ సీఎం, హోం మంత్రి మాటిచ్చారు. ఆ మాటకు వాళ్లు కట్టుబడి ఉండాలి’ అని మాధవీ లత గుర్తు చేశారు.