- దక్షిణ తెలంగాణపై మూడు పార్టీల హోరాహోరీ
- త్రిముఖ పోటీలో గెలిచేది, నిలిచేది ఎవరు?
- గత పార్లమెంట్ ఎన్నికలలో 4 స్థానాలు దక్కించుకున్న బీజేపీ
- రెండు స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్
- ఈ సారి బీజేపీ, బీఆర్ఎస్ కు గట్టిపోటీ ఇస్తున్న కాంగ్రెస్
- మరో సారి అసెంబ్లీ ఫలితాన్ని రిపీట్ చేయాలని చూస్తున్న కాంగ్రెస్
- పార్టీల అగ్రనేతల ప్రచారంతో హోరెత్తిన దక్షిణ తెలంగాణ
- మరోసారి సంక్షేమ పథకాలపైనే ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్
Three parties special focus on South Telangana success in Lok Sabha:
గత అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణలో అధికార పీఠం చేజిక్కించుకున్న కాంగ్రెస్ ఈ సారి పార్లమెంట్ ఎన్నికలలోనూ అదే దూకుడు ప్రదర్శిస్తోందని..ప్రచార వ్యాహాలలోనూ వినూత్నంగా వ్యవహరిస్తూ జాతీయ స్థాయిలో బీజేపీ వైఫల్యాలను ఎండగడుతూ మరో పక్క రాష్ట్రంలో గత పాలకులైన బీఆర్ఎస్ అవినీతిని తూర్పారబడుతూ ఎన్నికలలో సమరశంఖం పూరిస్తూ..మరో సారి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరేసేందుకు తన సర్వశక్తులూ ఒడ్డుతోందని రాజకీయ పండితులు అంటున్నారు. అందుకే ఈ సారి విజయావకాశాన్ని కాంగ్రెస్ అందుకోనుందని చెబుతున్నారు. అయితే ఉత్తరాది తెలంగానలో కన్నా ఈ సారి దక్షిణాది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ త్రిముఖ పోటీని ఎదుర్కోబోతోంది. గత ఎన్నికలలో ఉత్తరాది తెలంగాణలో 3 పార్లమెంట్ స్థానాలు దక్కించుకున్న బీజేపీ ఈ సారి దక్షిణాది తెలంగాణ పై కన్నేసింది.
దక్షిణ తెలంగాణలో ఖమ్మం, నల్గొండ, భువనగిరి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, మెదక్ స్థానాలున్నాయి. గత పార్లమెంట్ ఎన్నికలలో ఖమ్మం, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, మెదక్ సీట్లు బీజేపీ గెలుచుకుంది. అయితే నల్గొండ, భువనగిరి పార్లమెంట్ సీట్లు కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. ప్రస్తుతం దక్షిణాదిలో పట్టున్న ఈ ప్రాంతాలను మరోసారి కైవసం చేసుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా తలపడనున్నాయి.
ఖమ్మం, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్
2019 పార్లమెంట్ ఎన్నికలలో నాటి అధికార బీఆర్ఎస్ కు చెందిన నామా నాగేశ్వరరావు ఖమ్మం నుంచి గెలిచారు. ప్రస్తుతం అదే పార్టీ నుంచి మరో సారి నామా తన పట్టు నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. రామసహాయం రఘురాంరెడ్డి కాంగ్రెస్ తరపున అభ్యర్థిగా బరిలో దిగారు. ఇక్కడ ప్రధాన పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ఉంటుందంటున్నారు. నాగర్ కర్నూల్ లో మాత్రం ఈ సారి పోరు త్రిముఖంగా కనిపిస్తోంది. గత ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థి పోతుగంటి రాములు ఎంపీగా గెలిచారు. అంతకు ముందు రెండు సార్లు ఎంపీగా గెలిచిన మల్లు రవి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నారు. బీజేపీ అభ్యర్థిగా పోతుగంటి భరత్ ప్రసాద్ బరిలో ఉన్నారు. బీఆర్ఎస్ తరపున ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బరిలో ఉన్నారు. దీనితో ఈ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారో అనే అంశం ఉత్కంఠగా మారింది. మహబూబ్ నగర్ లో గత పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస రెడ్డి గెలుపొందారు. ఈ సారి కూడా బీఆర్ఎస్ తరపున పోటీచేస్తున్నారు. కాంగ్రెస్ తరపున వంశీచంద్ రెడ్డి పోటీచేస్తుండగా సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజక వర్గం కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బీజేపీ తరపున డీకే అరుణ బరిలో ఉన్నారు. మెదక్ నియోజకవర్గంలో ఈ సారి త్రిముఖ పోటీ తప్పేలా లేదు.
మెదక్, నల్గొండ, భువనగిరి
మెదక్ నియోజకవర్గంలో ఈ సారి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ.. మూడు పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. గతంలో ఇక్కడ 2019లో బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి గెలిచారు. ఆ పార్టీ ఇప్పుడు వెంకట్రామిరెడ్డిని బరిలోకి దించింది. మాజీ సీఎం కేసీఆర్, హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాలు మెదక్ పరిధిలోనే ఉన్నాయి. కాంగ్రెస్ నుంచి నీలం మధు పోటీ చేస్తున్న ఈ స్థానంపై సీఎం రేవంత్‌రెడ్డి దృష్టి సారించారు.బీజేపీ తరపున మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు పోటీచేస్తున్నారు.. బీజేపీ తరపున ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోవడం ఆ పార్టీకి ఇక్కడ ప్రతికూలమైన అంశంగా మారింది. ఇక నల్గొండ స్థానంలో 2019లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్ ఎంపీగా గెలిచారు. ఇప్పుడు ప్రధాన పార్టీల నుంచి ముగ్గురు అభ్యర్థులూ ఎంపీగా తొలిసారి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి పోటీచేస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా కంచర్ల కృష్ణారెడ్డి పోటీచేస్తున్నారు. బీజేపీ తరపున మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి పోటీచేస్తున్నారు. భువనగిరి లో గత పార్లమెంట్ ఎన్నికలలో కోమటిరరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం కాంగ్రెస్ తరపున చామల కిరణ్ కుమార్ రెడ్డి పోటీచేస్తున్నారు. బీఆర్ఎస్ తరపున కొత్త అభ్యర్థి బరిలో ఉన్నారు. క్యామ మల్లేష్ ఎంపీగా బీఆర్ఎస్ తరపున పోటీచేస్తున్నారు. బీజేపీ తరపున మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పోటీచేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక మేనిఫెస్టో
తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక మేనిఫెస్టో ప్రకటించింది. అందులో ప్రత్యేక హామీలు ఇచ్చింది. ఐటీఐఆర్ ప్రాజెక్ట్ పునర్ ప్రారంభం, రాష్ట్ర విభజన చట్టంలో చెప్పినట్లుగా ఖాజీపేట లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, భయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పాలమూరు రంగారెడ్డి కి జాతీయ హోదా, హైదరాబాద్ లో ఐఐఎం, నీతి అయోగ్ కార్యాలయం ఏర్పాటు, నూతన ఎయిర్ పోర్టుల నిర్మాణం, మణుగూరు, రామగుండం నూతన రైల్వే లైన్ నిర్మాణం, నాలుగు సైనిక స్కూళ్లు, నబోదయ విద్యాలయాల సంఖ్య రెట్టింపు, జాతీయ క్రీడల యూనివర్సిటీ ఏర్పాటు చేయడం వంటి అంశాలు ఉన్నాయి. భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ఏర్పాటు, నేషనల్ ఎవియేషన్ యూనివర్శిటి ఏర్పాటు, 73, 74 రాజ్యంగా సవరణ క్రింద కేంద్ర ప్రభుత్వ నిధులు నేరుగా పంచాయతీలకు బదిలీ చేయడం, ప్రతి ఇంటికి సౌర శక్తి సరఫరా, హైదరాబాద్‌లో సుప్రీం కోర్టు బెంచ్ ఏర్పాటు, హైదరాబాద్ బెంగుళూరు కారిడార్, హైదరాబాద్ నాగపూర్ ఇండస్ట్రీయల్ కారిడార్, సింగరేణి కారిడార్ ఏర్పాటు, మేడారం సమ్మక్క సారలక్క జాతరలకు జాతీయ హోదా కల్పిస్తామని ప్రత్యేక హామీలను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంతానికి కురిపించింది. మరి అటు జాతీయ స్థాయిలో గ్యారెంటీలను, ఇటు రాష్ట్రానికి ఇచ్చిన హామీల విషయంలో ఓటర్లు, సానుకూలంగా స్పందించి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారా? అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలతోపాటు ఇతర హమీలను ఓటర్లకు వివరిస్తూ, ఆకట్టుకునే ప్రయత్నంలో విజయం సాధించిందా లేదా అనేది జూన్ 4 దాకా ఆగాల్సిందే. కాంగ్రెస్ పార్టీ హామీలు ఏ మేరకు ప్రభావం చూపాయన్న సంగతి తేలేది ఆనాడే.