KCR: మాజీ సీఎం కేసీఆర్ కరీంనగర్ పర్యటన చేసిన సందర్భంలో విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపైనా కామెంట్లు చేశారు. కాంగ్రెస్ బూటకపు హామీలతో ప్రజలను మోసం చేసిందని, రైతుల ఆత్మహత్యలకు బాధ్యత వహించాలని విరుచుకుపడ్డారు. తాజాగా కేసీఆర్ పై మంత్రులు కౌంటర్ ఎటాక్ చేశారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్‌లు విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్ పై నిప్పులు చెరిగారు.
కేసీఆర్ ఓడిపోయిన బాధతతో అవాకులు చెవాకులు పేలుతున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కొడుకు మంత్రి పదవి, తన సీఎం పదవి పోయినందున ఇష్టారీతిన ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నట్టుగా ఉన్నదని పేర్కొన్నారు. తొక్కుకుంటూ పోతామని, చవటలు, దద్దమ్మలు అని కేసీఆర్ మాట్లాడుతున్నారని, ఆయన భాష సరి చేసుకోవడం మంచిదని హితవు పలికారు. తెలంగాణ ప్రజలే కేసీఆర్‌ను పాతిపెడతారని అన్నారు.
Also Read: కంట్మోన్మెంట్ ఉపఎన్నిక బరిలో కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీగణేశ్
కేసీఆరే చవట, దద్దమ్మ అని మంత్రి జూపల్లి విమర్శించారు. లేకుంటే ధనిక రాష్ట్రమైన తెలంగాణను రూ. 8 లక్షల అప్పుల కుప్పగా ఎలా మారుస్తారని అన్నారు. ఫామ్ హౌజ్ నుంచి ప్రభుత్వాన్ని నడిపారని విమర్శలు చేశారు. సొంత ప్రభుత్వంలోని మంత్రులనూ ఆయన కలిసేవాడు కాదని అన్నారు. తలకిందులు తపస్సు చేసినా ఈ లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోదని జోస్యం చెప్పారు.
Also Read: కాంగ్రెస్‌లో మంచి మార్పే జరుగుతున్నట్టుంది.. : కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా మాజీ సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. కేసీఆర్ భాష మార్చుకోవాలని, తాము యువకులం మాట్లాడితే మరి తట్టుకోలేరని హెచ్చరించారు. తాము అధికారంలోకి వచ్చేనాటికి కరువు పరిస్థితులు ఉన్నాయని అన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు కోట్లు ఖర్చు పెట్టారని, మరి ఇప్పుడు ఎందుకు నీరు లేదని ఎదురుదాడికి దిగారు. కాకతీయ గొలుసు చెరువులతో రాష్ట్రమంతటా నీరు ఉంటదని ఊదరగొట్టారు కదా.. మరి నీరు ఎందుకు లేదని నిలదీశారు. బీఆర్ఎస్ హాయంలో ఒక్క రైతుకు అయినా నష్టపరిహారం ఇచ్చారా? అని ప్రశ్నించారు. చేనేత కార్మికులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా కేసీఆర్ నెరవేర్చలేదని అన్నారు.