– లిక్కర్ కేసులో కవితకు మరో షాక్
– సీబీఐ కస్టడీకి కోర్టు పర్మిషన్
– మూడు రోజులపాటు కొనసాగనున్న విచారణ
– కస్టడీ పిటిషన్‌లో సంచలన విషయాలు పొందుపరిచిన సీబీఐ
– కవిత, శరత్ చంద్రారెడ్డి లావాదేవీల ప్రస్తావన
– సౌత్ గ్రూప్ ముడుపుల అంశాన్ని వివరించిన అధికారులు
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. మధ్యంతర బెయిల్ దక్కలేదు. సీబీఐ విచారణను సవాల్ చేస్తూ ఓ పిటిషన్ దాఖలు చేశారు. తర్వాత అరెస్టును వ్యతిరేకిస్తూ మరో పిటిషన్ వేశారు. ఈ రెండిటిని రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది. సీబీఐ కస్టడీ కోసం వేసిన పిటిషన్‌లోనూ కవితకు ఎదురుదెబ్బే తగిలింది. మూడు రోజుల కస్టడీకి కోర్టు అంగీకరించింది. ఈనెల 15వ తేదీన ఉదయం కవితను తిరిగి కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది. కస్టడీలో ఆమెను కలిసేందుకు కేటీఆర్, సంతోష్, భర్త అనిల్, పిల్లలు, తల్లి, పీఏలకు అనుమతి ఇచ్చింది.
Also Read: ధాన్యం కొనుగోళ్లపై సీఎం స్పెషల్ ఫోకస్.. నేడు సమీక్ష
కస్టడీ పిటిషన్‌లో కీలక అంశాలు
కోర్టులో సీబీఐ వాదనలు వినిపిస్తూ కవితపై కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఈ మొత్తం ఎపిసోడ్‌లో కవిత కీలక పాత్రధారి, సూత్రధారి. విజయ్ నాయర్, తదితరులతో కలిసి స్కెచ్ వేశారు. ఆమె ఆడిటర్ బుచ్చిబాబు వాంగ్మూలంతో ఈ కేసులో కవిత పాత్ర స్పష్టమవుతుంది. రూ.100 కోట్లు సౌత్ గ్రూప్ నుంచి సమీకరించి ఆప్ నేతలకు అందించడంలో ఆమె కీలకంగా వ్యవహరించినట్టు ఈ స్టేట్మెంట్‌లో బయటపడింది. కవిత సూచన మేరకు మాగుంట శ్రీనివాసులు రెడ్డి రెండు దఫాలుగా రూ. 25 కోట్లు (రూ. 15 కోట్లు, రూ. 10 కోట్లు) అందించారు. ఈ విషయాన్ని ఆయన తన స్టేట్మెంట్‌లో తెలిపారు. వాట్సాప్ చాట్ కూడా ఈ విషయాలను కన్ఫామ్ చేస్తున్నాయి. ఈ ఆధారాలను కోర్టుకు సమర్పించాం’ అని సీబీఐ పేర్కొంది. ‘అభిషేక్ బోయినపల్లి సూచన మేరకు పెద్ద మొత్తంలో డబ్బు ఆప్ నేతలకు అందించినట్టు కవిత పీఏ అశోక్ కౌశిక్ తన వాంగ్మూలంలో అంగీకరించారు. హవాలా మార్గంలో గోవాకు డబ్బు చేరిందని తెలిపారు. బుచ్చిబాబు స్టేట్మెంట్ ప్రకారం కవితకు ఇండో స్పిరిట్స్‌లో 33 శాతం వాటా ఉన్నది. వీటికి సంబంధించిన ఆధారాలు ఇది వరకే చార్జిషీట్లలో పొందుపరిచాం. ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో రిటైల్ జోన్లలో రెండు జోన్లకు అవకాశం ఉండగా, శరత్ చద్రారెడ్డికి ఐదు దక్కాయి. శరత్ చంద్రారెడ్డికి కేటాయించిన 5 జోన్లకు ప్రతిఫలంగా జోన్‌కు రూ.5 కోట్ల చొప్పున రూ.25 కోట్లు ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. కానీ, శరత్ చంద్రారెడ్డి తిరస్కరించడంతో కవిత బెదిరించారు. హైదరాబాద్‌లో ఆయన ఏ వ్యాపారమూ సాగనివ్వనని హెచ్చరించారు. కవిత, శరత్ చంద్రారెడ్డి మధ్య రూ.14 కోట్ల లావాదేవీలకు సంబంధించి బ్యాంక్ రికార్డులు ఉన్నాయి. కవిత తెలంగాణ జాగృతికి శరత్ చంద్రారెడ్డి రూ.80 లక్షలు అందించారు. మహబూబ్‌నగర్‌లో ఓ సాగు భూమి కొనుగోలుకు సంబంధించి శరత్ చంద్రారెడ్డిపై కవిత ఒత్తిడి తెచ్చారు. అరబిందో అనుబంధ కంపెనీ మహిరా వెంచర్స్ ద్వారా ఈ కొనుగోలు ఒప్పందం జరిగేలా ఆ కంపెనీ నుంచి రూ.14 కోట్లు చెల్లించేలా ఒత్తిడి చేశారు’ అని సీబీఐ తన కస్టడీ పిటిషన్‌లో పేర్కొంది.
Also Read: ఆరూరి V/s కడియం.. మాటల తూటాలు
కవితే ప్రధాన కుట్రదారు!
ఇండో స్పిరిట్ కంపెనీలో కవిత బినామీగా అరుణ్ రామచంద్ర పిళ్లై ఉన్నారని పేర్కొంది సీబీఐ. ‘తన రిటైల్ జోన్స్‌కు ఇండో స్పిరిట్ నుంచి రావాల్సిన రూ.60 కోట్లు ఇవ్వొద్దని పిళ్లైకి కవిత చెప్పారని శరత్ చంద్రారెడ్డి వెల్లడించారు. శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట రాఘవ ఇచ్చిన స్టేట్మెంట్ల ప్రకారం ఈ కేసులో కవితే ప్రధాన కుట్రదారు. వారు వెల్లడించిన అనేక విషయాలపై కవితను మరింతగా ప్రశ్నించాల్సి ఉన్నది. ఈ కేసులో కవిత పాత్ర చాలా కీలకంగా కనిపిస్తున్నది. అందుకే ఆమెను కస్టడీకి ఇవ్వాలని కోరుతున్నాం’ అని సీబీఐ కోర్టుకు విన్నవించింది. ఈ కేసులో కవితను తొలుత విట్నెస్‌గా చూశామని, కానీ, దర్యాప్తులో సేకరించిన ఆధారాలను దృష్టిలో ఉంచుకుని ఎక్సైజ్ పాలసీలో కీలక కుట్రదారుల్లో ఆమె ఒకరని తేలిందని సీబీఐ పేర్కొంది. ఆది నుంచి కవిత విచారణకు అనవసర కారణాలు చూపుతూ దాటవేస్తూ వచ్చారని, అందువల్ల విచారించలేకపోయామని తెలిపింది. ఆమెను తిహార్ జైలులో ప్రశ్నించినా సంతృప్తికర సమాధానాలు ఇవ్వలేదని, స్వాధీనం చేసుకున్న పత్రాలకు విరుద్ధంగా ఆమె సమాధానాలు చెబుతున్నారని వివరించింది. ఆమెకు తెలిసిన వాస్తవాలను దాచి పెడుతున్నారని, మద్యం పాలసీకి సంబంధించిన పెద్ద కుట్రను వెలికితీయడానికి కవితను సాక్ష్యాలతో విచారించాల్సి ఉన్నదని తెలిపింది. ఈ కేసులో కవిత కుట్రదారుగా ఉన్నారని, తీహార్ జైలులో విచారిస్తే సహకరించలేదని, కాబట్టి, తమకు ఐదు రోజుల కస్టడీ కావాలని కోర్టును విజ్ఞప్తి చేసింది. అయితే, కోర్టు మూడు రోజులకు ఓకే చెప్పింది.
ఇన్నాళ్లూ లేనిది ఇప్పుడెందుకు?
కవిత తరఫున కోర్టులో న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. సీబీఐ తన రిపోర్టులో పేర్కొన్న అంశాలు చాలా పాతవి అని అన్నారు. వాటి ఆధారం చేసుకుని అరెస్టు చేయాల్సిన అవసరం లేదని వాదించారు. అవి చాలా పాత అంశాలు. ఇన్ని నెలలుగా ఆమెను అరెస్టు చేయకుండా అవసరమైనప్పుడు కవితను ప్రశ్నించాలని అనుకుందని గుర్తు చేశారు. ఇన్ని రోజులుగా అరెస్ట్ చేయకుండా దర్యాప్తు చేసిన అధికారులకు ఇప్పుడు అరెస్టు చేయాల్సిన అవసరం ఏం వచ్చిందని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ కవిత మాస్ లీడర్ అని, తెలంగాణ ఎన్నికల్లో ఆమెను పార్టీకి సహకరించకుండా క్యాంపెయినింగ్‌కు దూరంగా ఉంచేలా ఇదంతా జరుగుతున్నట్టు అనుమానించారు.