CM Revanth: రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీల మధ్య రాజకీయ వైరం ఎన్నికల వేళ పతాకస్థాయికి చేరుకుంది. లోక్ సభ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ నెలకొనడంతో ఈ రెండు పార్టీలు ఉప్పు నిప్పుగా మెలిగాయి. బీజేపీ ఎమ్మెల్యేలు వీలు చిక్కినప్పుడల్లా కాంగ్రెస్ ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఇదంతా ఒకవైపు ఉండగా.. ఈ రోజు కీలక పరిణామం జరిగింది. బీజేపీ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. నిన్నా మొన్నటి వరకు విమర్శల పర్వం సాగించిన బీజేపీ ఎమ్మెల్యేలు హఠాత్తుగా సీఎం రేవంత్ రెడ్డిని సచివాలయంలో కలవడం చర్చనీయాంశమైంది. ఇంతకీ బీజేపీ ఎమ్మెల్యేలు ఎందుకు కలిశారు? రైతు సమస్యలు, పంట కొనుగోలు, చర్యలు తీసుకోవాలని సీఎంను కోరినట్టు బీజేపీ ఎమ్మెల్యేలు చెప్పారు. ఇక లోపలి గుట్టు ఏమిటన్నది ఆ దేవుడికి ఎరుక. ఎందుకంటే బీజేపీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌లో చేరుతారని ఇప్పటికే పలుమార్లు కాంగ్రెస్ అగ్రనేతలు అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. వడ్ల కొనుగోలు వేగవంతం చేయాలని, తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పినా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని అన్నారు. తడిసిన ధాన్యం ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే.. కాంగ్రెస్ హామీ ఇచ్చినట్టు రైతు బోనస్ అమలు చేయాలని, రైతు రుణమాఫీ చేయాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు రసీదులు ఇవ్వడం లేదని సీఎం రేవంత్‌కు చెప్పామని, ఆయన అధికారులను పిలిచి ఆదేశాలు ఇచ్చారని వివరించారు. మిగిలిన రైతు బంధుతోపాటు రైతు భరోసా నిధులు విడుదల చేయాలని సీఎంకు లేఖ అందించి విజ్ఞప్తి చేశామని తెలిపారు.
తాము చేసిన విజ్ఞప్తులపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి అమలు చేయకుంటే బీజేపీ ఉద్యమ కార్యచరణ తీసుకుంటుందని హెచ్చరించారు. దొడ్డు వడ్లపైనే కాదు.. అన్ని రకాల వడ్లపై బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే.. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 9 నుంచి 10 సీట్లు గెలిచి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. గెలిచే స్థానాల్లో ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, చేవెళ్ల, మహబూబ్‌నగర్, మల్కాజిగిరి ,సికింద్రాబాద్, జహీరాబాద్‌లుగా భావిస్తున్నారు. ఇవికాక భువనగిరి, వరంగల్ స్థానాల్లోనూ టఫ్ ఫైట్ ఉన్నదని, నాగర్ కర్నూలులో కూడా బీజేపీ గెలిచే చాన్స్ ఉన్నదని వివరించారు. అది కూడా వస్తే బీజేపీ 11 స్థానాలు గెలుచుకుంటుందని చెప్పారు. రాష్ట్రంలో మోదీ ఛరిష్మా పని చేసిందని, కాంగ్రెస్ డబ్బులు పంచిందని, అదే వారికి మైనస్ అయిందని పేర్కొన్నారు. కానీ, తాము అక్షింతలు వేశామని, జై శ్రీరాం అన్నామని తెలిపారు. త్వరలో తెలంగాణలో కచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుందని అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ.. అందులో పరిస్థితులు తనకు తెలియంది కావని చెప్పారు. కోమటిరెడ్డితో తనకు 15 ఏళ్లుగా మాటలు లేవని తెలిపారు.