- కేసీఆర్ నోట పదే పదే హంగ్ మాట
- హంగ్ వస్తే చక్రం తిప్పుదామనే ఆలోచన
- ఖమ్మం ప్రచార సభలో నామాకు కేంద్ర మంత్రి పదవి వ్యాఖ్యలు
- టీవీ ఇంటర్వ్యూలో బీఆర్ ఎస్ పేరు మార్చబోమని స్పష్టీకరణ
- జాతీయ రాజకీయాలపై ఇంకా హోప్స్ పెట్టుకున్న గులాబీ బాస్
- పది నుంచి పన్నెండు సీట్లు వస్తే కేంద్రంలో చక్రం తిప్పుతామంటూ మాటలు
- కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ కలలపై విమర్శలు గుప్పిస్తున్న విపక్షాలు
- థర్డ్ ఫ్రంట్ పై మోజు తీరలేదని అంటున్న విమర్శలు
Kcr Third Front Craze In Lok sabha elections:
కలలు కనడంలో తప్పేమీ లేదు. కానీ కలలు కాస్ట్ లీగా ఉండకూడదని ఓ సినిమాలో డైలాగ్ ఉంటుంది. ప్రస్తుతం గులాబీ దళపతి కేసీఆర్ కలలు చూస్తే అలాగే అనిపిస్తుంది. కొత్తగా ఆశలు చిగురిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఓటమి భారం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుని…ఒక్కసారిగా స్వరం పెంచేశారు కేసీఆర్. ఎక్కవగా అధికార పార్టీ కాంగ్రెస్ నే టార్గెట్ చేస్తూ వస్తున్నారే తప్ప బీజేపీపై అంతగా దూకుడు తగ్గించారనిపిస్తోంది. ఆయన ఇటీవల ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ ఈ సారి బీజేపీకి కేంద్రంలో వచ్చేవి 200 సీట్లే అం టూ జోస్యం చెబుతున్నారు. పైగా హంగ్ వస్తుందని అప్పడు తామే కింగ్ అంటూ కలలు కంటున్నారు. ఆయన ఆశలు నిజమవుతాయా లేదో చెప్పలేం. కానీ ఆశలు పెట్టుకోవడంలో తప్పులేదు కదా. వాటికి డబ్బు ఖర్చు పెట్టనక్కరలేదు కదా. కేసీఆర్ ఒక్కడే కాదు, ఎన్నికల సమయంలో ప్రతి పార్టీ కలలు కంటుంది. ప్రతి నాయకుడు ఆశలు పెట్టుకుంటాడు. సామాన్యులనైనా, రాజకీయ నాయకులనైనా ముందుకు నడిపించేది ఆశే కదా అంటున్నారు రాజకీయ పండితులు.
బీజేపీతో బీఆర్ఎస్ టై అప్
ఇటీవల రామగుండంలో రోడ్‌షోను కేసీఆర్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోవని అంటున్నారు. అయితే, బీజేపీతో బీఆర్ఎస్‌కు ఓ అండర్ స్టాండింగ్ ఉన్నదనే సంకేతాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. వీటిని కౌంటర్ చేయడానికే సీఎం కేసీఆర్ ఈ సంకీర్ణ ప్రభుత్వం అనే టాపిక్‌ను ముందుకు తెచ్చినట్టు విశ్లేషిస్తున్నారు. అయితే, కేసీఆర్ కామెంట్‌తో మరోసారి థర్డ్ ఫ్రంట్ అంశం ముందుకు వచ్చింది. థర్డ్ ఫ్రంట్ అంటూ కేసీఆర్ హడావిడి చేసి వదిలిపెట్టారు. మమతా బెనర్జీ, ఉద్దవ్ ఠాక్రే, అఖిలేశ్ యాదవ్, కేజ్రీవాల్‌లతో ఆయన చర్చలు జరిపారు. బీజేపీయేతర, కాంగ్రెస్సేతర కూటమిని ప్రాంతీయ పార్టీలతో ఏర్పాటు చేయాలని అనుకున్నారు. ఆ రెండు జాతీయ పార్టీలకు సవాల్ విసరాలని సూచించారు. కానీ, ఆ థర్డ్ ఫ్రంట్ కార్యరూపం దాల్చలేదు. ఇటీవల ఓ టీవీ ఇంటర్వ్యూలో కేసీఆర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పేరును మార్చే ప్రసక్తే లేదని అనడం చూస్తుంటే కేసీఆర్ జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలనే ఆలోచన నుండి ఇంకా బయటపడలేదనిపిప్తోంది. పైగా ఖమ్మం ప్రచారసభలో ప్రసంగిస్తూ నామా నాగేశ్వరరావును గెలిపిస్తే కేంద్రంలో మంత్రి పదవి వస్తుందని అంటున్నారు. అంటే బీజేపీతో ఏదైనా ఒప్పందం చేసుకన్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయంటున్నారు రాజకీయ విమర్శకులు.
హంగ్ వస్తేనే తెలంగాణకు ప్రయజనమా?
కేసీఆర్ పార్టీ పోటీ చేస్తున్నది పార్లమెంటు ఎన్నికల్లో కాబట్టి ఆయనకు ఆశలు నేషనల్ లెవెల్లో ఉన్నాయి. బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చే అవకాశం లేదని ఆయన గట్టిగా అభిప్రాయపడుతున్నారు. బీజేపీకి 200 సీట్లకు మించి రావని అంచనా వేస్తున్నారు. కేంద్రంలో హంగ్ వస్తుందని నమ్ముతున్నారు. హంగ్ వస్తే గులాబీ పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని చెబుతున్నారు. హంగ్ వస్తే బీఆర్ఎస్ కీలక పాత్ర ఎలా పోషిస్తుందంటే.. రాష్ట్రంలో ఆ పార్టీకి 14 లేదా 15 ఎంపీ స్థానాలు గెలవాలి. కేంద్రంలో హంగ్ రావాలి. అప్పుడు మనం కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని కేసీఆర్ చెబుతున్నారు. గోదావరి, కృష్ణా నదులు కాపాడుకోవాలన్న, ఇరిగేషన్ ప్రాజెక్టులకు జాతీయ హోదా సాధించాలన్నా, కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవాలన్నా, మన బతుకులు బాగుపడాలన్నా గులాబీ పార్టీ ఎక్కువ సీట్లు సాధించాలని కేసీఆర్ అంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తన పార్టీకి 15 సీట్లు ఇస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏడాదిలో కూలిపోతుందని, తానే మళ్ళీ అధికారంలో వస్తానని చెబుతున్నారు. అంటే… పార్లమెంటు ఎన్నికల్లో 15 సీట్లు గెలుచుకుంటే రెండు ప్రయోజనాలు కలుగుతాయని కేసీఆర్ చెబుతున్నాడన్న మాట. మొదటిది కేంద్రంలో చక్రం తిప్పొచ్చు. రెండోది రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి రావచ్చు. ఇలాంటి ఆశలతోనే గత అసెంబ్లీ ఎన్నికలకు దూరమైన సంగతి ఇంకా కేసీఆర్ గ్రహించడం లేదని రాజకీయ పండితులు విమర్శిస్తున్నారు.
ఇదంతా కేసీఆర్ కాకి లెక్కలు.. చెప్పినంత సులభం కాదు. కేసీఆర్ చెప్పినదాన్నిబట్టి అర్ధమయ్యేది ఏమిటంటే …ఆయనకు జాతీయ రాజకీయాల పట్ల ఆశ చావలేదు. రాష్ట్రంలో మళ్ళీ తానే అధికారంలో రావాలనే యావ తగ్గలేదు. మరి ఆయన అంచనాలు నిజమవుతాయో, తప్పుతాయో దేశవ్యాప్తంగా ప్రజలు ఇచ్చే సీట్ల పైన ఆధారపడి ఉంటుందని రాజకీయ పండితులు భావిస్తున్నారు.