Boora Narsaiah Goud: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ నాయకులు మండిపడ్డారు. భువనగిరి బీజేపీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం విమర్శలు సంధించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఆరు గ్యారంటీలని ప్రకటించిందని, ఆ తర్వాత వాటిని ఆరు మోసాలుగా మార్చిందని విమర్శించారు. అవి ఆరు గ్యారెంటీలు కాదని, ఆరు మోసాలని అన్నారు. ప్రజలను రేవంత్ రెడ్డి చీట్ చేశాడని ఆరోపించారు. కార్పొరేషన్ పేరు మీద రైతులను మరోసారి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రైతు రుణ మాఫీ చేస్తారా? లేదా? అనేది రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. క్వింటాకు రూ. 500 బోనస్ దేవుడెరుగు.. కనీసం పంట కొనడానికి కాంటా వేసే దిక్కులేదని సెటైర్ వేశారు.
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి రియాక్ట్ అవుతూ.. ప్రభుత్వ బాధ్యతరాహిత్యంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. ఆరు గ్యారెంటీలు అసాధ్యమైన హామీలను, రైతుల రుణ మాఫీకి రూ. 32 వేల కోట్లు కావాలని, అది సాధ్యమవుతందా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో నిధులు లేవని అన్నారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే ఐదు కేజీల బియ్యం కాదు.. పది కేజీలు ఇస్తామని మల్లికార్జున్ ఖర్గే చెబుతున్నారని, కనీస ఆలోచన లేకుండా ఖర్గే మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ హయాంలోనే రైతు సమస్యలు మొదలయ్యాయని అన్నారు. ఈ రెండు ప్రభుత్వ తప్పిదాలతో రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు.
Also Read: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు ఆర్టీసీ షాక్.. మాల్ అండ్ మల్టిప్లెక్స్ భవనం స్వాధీనం
కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని కేఎస్ రత్నం అన్నారు. ఉచితాల పేరుతో ప్రజలను మోసం చేశారని, ఎన్నికల కోడ్ అని చెప్పి కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ఇచ్చిన హామీల అమలుకు నిధులను ఎక్కడి నుంచి సమకూరుస్తారో సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని అన్నారు. ఈ లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి మెజార్టీ స్థానాలు బీజేపీకే వస్తాయని తెలిపారు.