– అసెంబ్లీ గెలుపు ఊపును కొనసాగిస్తున్న కాంగ్రెస్
– కావ్య పేరును ప్రకటించిన కాంగ్రెస్
– వలస నేత రమేష్ మీదనే బీజేపీ ఆశలు
– అభ్యర్థి అన్వేషణలో బీఆర్ఎస్
There Planning Of Parties Eight Parliament Constituencies In Warangal: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో బరిలో దిగే అభ్యర్థులెవరో దాదాపు ఖరారైంది. ఉద్యమాల పురిటిగడ్డగా, తెలంగాణ సాంస్కృతిక రాజధానిగా పేరొందిన ఈ స్థానంపై పట్టుసాధించి, గెలుపొందేందుకు ఇప్పుడు తెలంగాణలోని ప్రధాన పార్టీలన్నీ రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలో ఈ స్థానానికి కడియం కావ్య పేరును కాంగ్రెస్ పార్టీ ప్రకటించగా, బీజేపీ ఇటీవలే బీఆర్ఎస్ నుంచి పార్టీలో చేరిన ఆరూరి రమేష్‌ను బరిలో దింపింది. బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరో త్వరలో తేలనుంది. రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరుగా, తెలంగాణ సాంస్కృతిక రాజధానిగా పేరున్న వరంగల్ లోక్‌సభ స్థానం ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.వరంగల్ పార్లమెంటరీ నియోజకవర్గంలో స్టేషన్ ఘన్‌పూర్, పాలకుర్తి, పరకాల, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, వర్థన్నపేట, భూపాలపల్లి శాసససభ నియోజకవర్గాలున్నాయి. పార్లమెంట్ నియోజకవర్గంలో జనాభా 15 లక్షల 37 వేల 781 ఉంది. ఇందులో 59.99% శాతం గ్రామీణ ఓటర్లు కాగా మిగిలిన 40.01% పట్టణ ప్రాంతాల ఓటర్లు.
వరంగల్ ఎంపీ స్థానానికి 1952లో జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్టులు గెలుపొందగా, 1957,1962,1967లో కాంగ్రెస్ అభ్యర్థులే గెలుపొందారు. 1971లో కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లిన చెన్నారెడ్డి ప్రారంభించిన తెలంగాణ ప్రజాసమితి పార్టీ అభ్యర్థి గెలుపొందారు. మళ్లీ 1977,1980 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులే ఇక్కడ పాగా వేశారు. 1984లో టీడీపీ, 1989, 1991లో మళ్లీ కాంగ్రెస్ ఇక్కడ జెండా ఎగరవేయగా, 1996,1998, 1999 ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ వశమైనా, 2009లో మళ్లీ ఈ సీటు కాంగ్రెస్ వశమైంది.
తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఈ స్థానం బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా మారింది. 2014, 2015 ఉపఎన్నిక, 2019 ఎన్నికల్లో ఈ స్థానాన్ని గులాబీ పార్టీ గెలుచుకోగా, 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ స్థానంలో రాజకీయ సమీకరణాలు మరోసారి పూర్తిగా మారిపోయాయి. ఈ స్థానంలోని మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో వీటిలో స్టేషన్ ఘన్‌పూర్‌లో బీఆర్ఎస్ తరపున కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా ఎన్నిక కాగా, మినహా మిగిలిన అన్ని స్థానాలూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలుపొందారు.
Read Also:పరువున్నోడు పరువునష్టం గురించి మాట్లాడాలి.. కేటీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యే కౌంటర్
ఇక.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డా. కడియం కావ్యను తన అభ్యర్థిగా ప్రకటించింది. మాజీ మంత్రి కడియం శ్రీహరి కుమార్తె అయిన కావ్య ప్రస్తుతం కాకతీయ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్, దొమ్మాటి సాంబయ్య, ఇందిర వంటి నేతల పేర్లను పరిశీలించిన పార్టీ అధిష్ఠానం అంతిమంగా చివరి నిమిషంలో పార్టీలో చేరిన కావ్య పేరునే ఫైనల్ చేసింది. ఈ పార్లమెంటు స్థానం పరిధిలోని ఏకైక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయిన కడియం శ్రీహరి కాంగ్రెస్‌లో చేరటం, మిగిలిన ఆరు స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉండటం, కడియం సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం, కాంగ్రెస్ పార్టీ పథకాలు కావ్యకు గెలుపు తీరాలకు చేరుస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఎంపీ స్థానం పరిధిలోని 7 స్థానాల్లో వచ్చిన మెజారిటీ ప్రకారం మిగిలిన పార్టీల కంటే కాంగ్రెస్ 1.6 లక్షల పైచిలుకు ఓట్ల ముందంజలో ఉండటమూ కాంగ్రెస్‌కు మరో సానుకూల అంశం.
మరో ప్రధాన పక్షమైన బీజేపీ, ఇక్కడ వర్థన్నపేట తాజా మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ను బరిలో దించింది. గతంలో ఎన్నడూ ఇక్కడ గెలిచిన చరిత్ర బీజేపీకి లేకున్నా.. తాజా ఎన్నికల్లో తన సత్తా చాటాలని తపిస్తోంది. ఈ సీటుకోసం మాజీ డిజిపి కృష్ణ ప్రసాద్, చింతా సాంబమూర్తి పేర్లను పరిశీలించిన బీజేపీ, చివరి నిమిషంలో పార్టీలో చేరిన ఆరూరి రమేష్ పేరును ఫైనల్ చేసింది. కాంట్రాక్టర్ నుండి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన రమేష్ 2018లో వర్థన్నపేట అసెంబ్లీ సీటు నుంచి బరిలో దిగి 90 వేల మెజారిటీతో గెలిచారు. అప్పట్లో 90 హరీష్ రావు తర్వాత అంత పెద్ద మెజారిటీతో గెలిచిన అభ్యర్థిగా జనం దృష్టిని ఆకర్షించారు. ఆరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ద్వారా యువతకు ఉచిత శిక్షణా కార్యక్రమాలు చేయటం, ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకోవడంతో బాటు మోదీ ప్రభుత్వ విజయాలను ఆయన జనంలోకి తీసుకుపోతున్నారు. అయితే, వర్థన్నపేట బయటి నియోజక వర్గాల్లో ఈయనకు పెద్ద పట్టులేకపోవటంతో బాటు స్థానికంగానూ ఆ స్థానాల్లో బీజేపీ నామమాత్రంగా ఉండటం బీజేపీకి ప్రతికూల అంశాలుగా మారే అవకాశం కనిపిస్తోంది.
Read Also:ఆ ఇద్దరికి రిమాండ్.. నెక్స్ట్ వాళ్లేనా..?
2014 నుంచి వరుసగా మూడుసార్లు (2015 నాటి ఉపఎన్నికతో కలిపి) ఈ సీటులో విజయ పతాకం ఎగరవేసిన బీఆర్ఎస్ ఈ సీటుకు అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. తొలుత ప్రకటించిన అభ్యర్థి కడియం కావ్య పోటీ నుంచి తప్పుకోవటమే గాక ఆమె తండ్రి శ్రీహరితో కలిసి కాంగ్రెస్‌లో చేరటంతో మరో అభ్యర్థిని వెతికే ప్రయత్నంలో గులాబీ పార్టీ ఉంది. వరంగల్ ఎంపీ సీటు దక్కక ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన మాజీమంత్రి రాజయ్యను తిరిగి పార్టీలో చేర్చుకుని అభ్యర్థిగా ప్రకటించాలని ప్రయత్నించినా, తాజాగా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య, నల్లబెల్లి నుంచి జెడ్పీటీసీగా ఉన్న స్వప్నకు ఆ సీటు కేటాయిస్తారని, తెలంగాణ ఉద్యమంలోనూ ఆమె పాల్గొన్నందుకు కొంత సానుకూల వాతావరణం ఉంటుందనే కోణంలో ఆ పార్టీ అధిష్ఠానం ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే, తనను పిలిచి, ఈ సీటును ఆఫర్ చేస్తే బరిలో నిలిచేందుకు సినీ నటుడు, మాజీ మంత్రి బాబూ మోహన్ కూడా ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం.