The Trap Of Phone Tapping That Is Tightening : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తవ్వే కొద్దీ ఈ కేసులో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటికే ‘స్వేచ్ఛ’ ఇన్వెస్టిగేషన్ లో సంచలన నిజాలు బయటపడ్డాయి. జూబ్లీహిల్స్ కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా నడిచిందనీ, ‘నేను’ న్యూస్ ఓనర్, తెలంగాణ గుండెచప్పుడు అని చెప్పుకునే ఛానల్‌లోని కీలక వ్యక్తుల కనుసన్నల్లోనే ఇదంతా నడిచిందని ‘స్వేచ్ఛ’ కథనాలు ఇచ్చింది. వీరిద్దరూ రోజువారీగా తమపై ఉన్న పెద్దల నుంచి ఆదేశాలు అందుకొన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ వ్యవహారంపై విచారణ కోసం జూబ్లీహిల్స్ పోలీసులతో కలిసి ప్రత్యేక టీమ్ ఏర్పాటు అయింది. ఇప్పటికే ప్రణీత్ రావును కస్టడీకి తీసుకున్న బృందం ఆయనను వారం పాటు విచారించి కీలక సమాచారం రాబడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరికొన్ని కొత్త విషయాలు బయటకు వచ్చే ఛాన్స్ ఉంది.
ఎర్రబెల్లికి బిగుసుకుంటున్న ఉచ్చు
తాజా సమాచారం మేరకు.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మెడకు చుట్టుకుంటోంది. పర్వతగిరిలో ఉంటున్న తన మేనమామ సంపత్ రావు ఇంటిలోనే ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ వార్ రూం ఏర్పాటు చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. కాగా.. ప్రణీత్ రావు మరో మేనమామ జూలపల్లి రామారావు విజిలెన్స్‌లో అడిషనల్ ఎస్పీగా పనిచేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే తపనతోనే దయాకర్ రావు కొన్ని ఫోన్లను ట్యాపింగ్ చేయించినట్లు సమాచారం. దీనికి సంబంధించి వరంగల్‌లో ప్రణీత్ రావుకు అత్యంత దగ్గర సంబంధం ఉన్న ఇద్దరు సీఐలను విచారించాలని సిట్ భావిస్తోంది. దీనిపై ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
Read More: శనీశ్వరంగా మారిన కాళేశ్వరం..!
ధనుంజయ్ ధనదాహం.. పోలీసుల ఆరా!
నాయకులు చెప్పింది చెప్పినట్లు చేసిన ఇంటెలిజెన్స్ పోలీసుల్లో ధనుంజయ్ మొదటి స్థానంలో ఉన్నారు. ప్రభుత్వం మారగానే దేవరకొండ నియోజకవర్గంలోని కొండమల్లేపల్లి సీఐగా ఈయన వెళ్లిపోయారు. ఇతడు ఎస్ఐబీలో ఉండగా, ఒక కీలక కాంగ్రెస్ నేత ఫోన్ రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్‌కు పాల్పడి పోస్టింగ్ తెప్పించుకున్నట్టు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్స్‌లో ఫోన్ ట్యాపింగ్‌ని దుర్వినియోగం చేసి, తమను బెదిరించాడని, పలువురు బాధితులు ఇప్పుడు బయటపడుతున్నారు. పోలీసులు ధైర్యం ఇస్తే ఫిర్యాదు చేసేందుకూ తాము రెడీగా ఉన్నట్లు వారు చెబుతున్నారు. కాగా, ధనుంజయ్ మీద ప్రత్యేక బృందం ఇప్పటికే నిఘా పెట్టింది.
‘నేను’ న్యూస్ ఓనర్ దేశం దాటాడా?
బీఆర్ఎస్ పార్టీకి బీ టీంగా పనిచేసిన ‘నేను’ న్యూస్ ఓనర్ బండారాన్ని ‘స్వేచ్ఛ’ బయటపెట్టింది. ఈ క్రమంలో అతను పోలీసుల కళ్లుగప్పి బెంగుళూరు నుంచి విదేశాలకు పరారయ్యాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విచారణ పూర్తయ్యాకే తిరిగొచ్చేందుకు ఆయన ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ప్రణీత్ రావుని వారం రోజుల కస్టడీకి తీసుకోవటంతో విచారణలో చాలా విషయాలు బయటపెట్టే అవకాశం ఉంది.
-దేవేందర్ రెడ్డి (సీనియర్ జర్నలిస్ట్)