– తెలంగాణ ఎంసెట్ ఫలితాల వెల్లడి
– ఇంజనీరింగ్‌లో తొలి 9 ర్యాంకులు అబ్బాయిలకే
– గత ఏడాది కంటే తగ్గిన ఉత్తీర్ణత
The Telangana EAMCET Results Boys Are Excited: తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీ సెట్ ఫలితాలు శనివారం ఉదయం విడుదలయ్యాయి. ఈ ఫలితాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేశారు. ఇంజినీరింగ్ విభాగంలో 2,40, 618 మంది విద్యార్థులు, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో 91,633 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, వీరిలో అగ్రికల్చర్, ఫార్మసీలో 89 శాతం మంది, ఇంజినీరింగ్ విభాగంలో 74.98 శాతం మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు.
గత ఏడాది కంటే ఈ ఏడాది ఇంజనీరింగ్‌లో తక్కువమంది అర్హత సాధించగా, అగ్రికల్చర్, ఫార్మా విభాగంలో మాత్రం నిరుటి కంటే ఈ ఏడాది ఎక్కువ మంది క్వాలిఫై అయ్యారు. గతంలో ఎంసెట్ పేరుతో పిలిచిన ఈ పరీక్షను ఈ ఏడాది నుంచి తెలంగాణ ఈఏపీ సెట్ పేరుతో నిర్వహించారు. విద్యార్థులు తమ ఫలితాలకు సంబంధించిన ర్యాంక్ కార్డులను టీఎస్‌ఎప్‌సెట్ అధికారిక వెబ్‌సైట్(eapcet.tsche.ac.in) నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Also Read: విశ్వనగరం.. వానొస్తే నరకం
ఈసారి ఇంజినీరింగ్‌లో తొలి ర్యాంకు శ్రీకాకుళం జిల్లా పాలకొండకు చెందిన ఎస్.జ్యోతిరాదిత్యకు, రెండవ ర్యాంకు కర్నూలు జిల్లా పంచలింగాలకు చెందిన హర్షకు, మూడవ ర్యాంకు సికింద్రాబాద్‌కు చెందిన రిషి శేఖర్‌కు దక్కాయి. అగ్రికల్చర్, ఫార్మసీలో తొలి ర్యాంకు మదనపల్లె్కు చెందిన ప్రణీత దక్కించుకోగా, రెండవ ర్యాంక్ విజయనగరానికి చెందిన రాథాకృష్ణ సాధించారు. ఇంజనీరింగ్ తొలి పది ర్యాంకుల్లో 4, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో తొలి పది ర్యాంకుల్లో 5 సీమాంధ్ర విద్యార్థులకు దక్కటం విశేషం. మరోవైపు ఇంజినీరింగ్ విభాగంలో టాప్ 10లో ఒక అమ్మాయి మాత్రమే నిలవగా, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో తొలి, మూడవ, పదవ ర్యాంకులు అమ్మాయిలకే దక్కాయి.