– బడా పోలీసులకు బిగుసుకుంటున్న ఉచ్చు
– ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త దారులు
– వరుసబెట్టి ఖాకీల అరెస్టులు..?
– లుకౌట్ నోటీసు, ఓ వర్గం ఎమ్మెల్యేల హామీతో..
– నగరానికొచ్చిన రాధా కిషన్ రావు
– సిట్ అదుపులో సీఐ గట్టుమల్లుతో పాటు ప్రణీత్ రావు డ్రైవర్
– టెన్షన్‌లో మరో ఇద్దరు మాజీ డీసీపీలు
– ప్రభాకర్ రావు కుమారుడికి ఊడిగం చేసిన అప్పటి శంషాబాద్ డీసీపీ
– పైసలు లేనిదే ఫైల్ ముట్టని సైబరాబాద్ ఎస్వోటీ మాజీ చీఫ్ ఆగడాలెన్నో
– భుజంగరావు, తిరుపతన్నకి 5 రోజుల పోలీస్ కస్టడీ
– మరో 11 మంది పోలీసులని విచారించేలా సిట్ ప్లాన్
– ఇంకా స్పష్టతరాని పొలిటికల్ లీడర్స్ పాత్ర
– శ్రవణ్ రావు, ప్రభాకర్ రావులు ఎప్పుడొస్తారో?
– కేసీఆర్ ఫాంహౌస్‌లో వార్ రూం.. డీజీపీకి ఫిర్యాదు
– ట్యాపింగ్ బాగోతాన్ని ముందే పసిగట్టిన ‘స్వేచ్ఛ’
The Tapping Effect Of The Khakis Is Arresting : ఎప్పుడొచ్చామన్నది కాదు.. నిజాన్ని నిర్భయంగా, నిజాయితీగా బయటపెట్టామా లేదా? అనేదే ముఖ్యం. తెలుగు జర్నలిజంలో సంచలనాలకు వేదికైంది ‘స్వేచ్ఛ’ డిజిటల్ డైలీ. వచ్చింది కొద్ది రోజుల క్రితమే అయినా, తెలంగాణలో జరిగిన ఎన్నో స్కాముల్ని బయటపెట్టింది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన లోగుట్టునంతా కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. ఈ కేసులో ‘స్వేచ్ఛ’ ముందు నుంచి చెబుతున్నట్టే జరుగుతోంది. ‘నేను’ న్యూస్ అంటూ ఐ న్యూస్ యజమాని వ్యవహారాన్ని ఎక్స్‌క్లూజివ్‌గా సాక్ష్యాధారాలతో సహా బట్టబయలు చేసింది ‘స్వేచ్ఛ’. ప్రణీత్ రావు సస్పెండ్ కాగానే ట్యాపింగ్ కేసు ఎంత సిరియస్‌గా ఉంటుందో పసిగట్టి ప్రజల ముందు ఉంచింది. ‘స్వేచ్ఛ’ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఎప్పటికప్పుడు ఎక్స్‌క్లూజివ్ సమాచారం అందిస్తూ ఇచ్చిన కథనాలే తర్వాత మెయిన్ స్ట్రీమ్ మీడియాకు వార్తలయ్యాయి. ఇన్వెస్టిగేషన్ జర్నలిజం పవర్ ఏంటో ఈ కేసుకు సంబంధించి గత పది రోజుల ‘స్వేచ్ఛ’ పేపర్ చూస్తే మీకే అర్థం అవుతుంది.
ఉస్కో అంటే ఊళ్లు తగులబెట్టిన రాధా కిషన్ రావు
హైదరాబాద్ టాస్క్‌ఫోర్క్ ఉద్దేశం వేరు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ టీం చేసిన పనులు వేరు. ఎస్ఐబీలో ఫోన్ ట్యాపింగ్ చేసి డేటా టాస్క్‌ఫోర్స్‌కి ఇస్తే వీరంతా వసూళ్ల పర్వం మొదలు పెట్టారు. బెదిరించి, దోపిడీ దొంగల్లా వ్యవహరించారని తెలుస్తోంది. కాంట్రాక్టర్స్‌ని, పబ్ యజమానులను, బంగారం, హవాలా బిజినెస్ మెన్స్‌తో పాటు సినీ ప్రముఖులను బెదిరించి కోట్లాది రూపాయలు సంపాదించారు. రాధా కిషన్ రావు స్టేషన్ ఘన్‌పూర్‌లోని తన 8 ఎకరాల వ్యవసాయ భూమిలో 50 లక్షల విలువ చేసే మట్టి పోయించారంటే ఎంతలా అక్రమంగా సంపాదించారో అర్థం చేసుకోవచ్చు. ఇలా దొచుకున్న సొమ్ముతో తలా ఇంతా పంచుకున్నారని సమాచారం. అందుకు ఇప్పుడిప్పుడే ఫిర్యాదులు అందుతున్నాయి. రాధా కిషన్ రావు వద్ద వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్‌లో సీఐ గట్టుమల్లు పని చేశాడు. ఇప్పుడు అతనికి కూడా ఉచ్చు బిగుసుకుంటోంది. బంజారాహిల్స్ పోలీసులు వీరిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
ఆ ఎమ్మెల్యేలు చెబితేనే వచ్చారా..?
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పొక్కడంతో అమెరికాకు పారిపోయిన రాధా కిషన్ రావు, కాంగ్రెస్‌లోని ఆయన వర్గానికి చెందిన ఒక మాజీ, తాజా ఎమ్మెల్యేలు హామీ ఇవ్వడంతో ఇక్కడకు వచ్చినట్లు తెలుస్తోంది. విచారణలో తానెంతో నిజాయితీ గల అధికారినని, అప్పటి సీపీ చెబితేనే తాను చేశానని తప్పించుకుంటున్నట్లు సమాచారం. కింది సిబ్బంది సంపాదించిన సొమ్ముతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి రాధా కిషన్ రావుని అరెస్ట్ చేయాలంటే ఆధారాలు బలంగా కావాల్సి ఉంటుంది. ఇవన్నీ సంపాదిస్తారా లేదా వచ్చిన ఫిర్యాదులకు సీఐలనే బలి చేస్తారా అనేది మరికొద్ది గంటల్లోనే తేలిపోనుంది.
ఆ అధికారులపైనే నిఘా!
గత పదేళ్లు కల్వకుంట్ల ఫ్యామిలీకి పోలీస్ వ్యవస్థను దాసోహంగా చేశారు. అందుకు వారిని కే టీంగా ఇప్పుడు పోలీస్ అధికారులు పిలుస్తున్నారు. కే టీంలో ఎవరెవరు ఉన్నారనేది అసక్తికరంగా మారింది. ఇప్పటికే ఎఫ్‌ఐఆర్‌లో ఉన్న ప్రభాకర్ రావు, రాధా కిషన్ రావు, భుజంగరావుతో పాటు మాజీ మంత్రి దయాకర్ రావు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉమామహేశ్వర్ రావు, అలాగే రా.. రావు, రాఘ.. రావు, రమ.. రావు, సు.. రావు. సం.. రావు, వే.. రావులు ఉన్నారు. పోలీస్ అకాడమీలో అడిషనల్ ఎస్పీగా 2009లో రిటైర్డ్ అయిన రాఘ..రావు వద్దే ఈ గ్యాంగ్ అంతా కలుసుకునే వారని అధికారుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరితో పాటు ప్రభాకర్ రావుకి అత్యంత సన్నిహితంగా ఇంటెలిజెన్స్‌లో ఉండి శంషాబాద్ ఏరియాలో డీసీపీగా పనిచేసిన ఆఫీసర్ ప్రభాకర్ రావు చిన్న కుమారుడు ఏది అడిగితే అదే చేసి పెట్టేవారని తెలుస్తోంది. వీరిద్దరు ప్రభాకర్ రావు బావమరిది అశ్విన్ రావుతో కలిసి రియల్ ఎస్టేట్ దందాలు ఎన్నో చేశారని స్థానికంగా వినికిడి. రహస్యంగా పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నట్లు సమాచారం. వరంగల్‌కి చెందిన ఇద్దరు సీఐలు, నల్గొండలో ఒక న్యూస్ రిపోర్టర్‌తో పాటు, ఒక సీఐ, ఒక ఏసీపీలు ఉన్నారని అనుమానాలు ఉన్నాయి.
కస్టడీలో ఏం చెబుతారో..!
ప్రణీత్ రావు కస్టడీ సమయంలో మాదాపూర్ డీసీపీ గొనే సందీప్ రావు పేరును ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఇటు, గురువారం తిరపతన్న, భుజంగరావులను 5 రోజుల కస్టడీకి అనుమతించారు. వీరందరినీ కలిపి విచారిస్తే ‘స్వేచ్ఛ’ ఇన్వెస్టిగేషన్ బ్యూరో చెప్పిన కొత్త పేర్లు బయటపడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు, ఈ వ్యవహారంలో కేసీఆర్ పాత్ర ఉందని, ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో వార్ రూం ఉందని, పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో ఈ వ్యవహారం మరింత హీటెక్కింది.
దేవేందర్ రెడ్డి (సీనియర్ జర్నలిస్ట్)