The Issue Of Two States Which Has Not Been Broken For Ten Years: మరో వారం రోజులకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తవుతోంది. అయితే నేటికీ పునర్విభజన చట్టంలోని అనేక అస్తుల, అప్పుల పంపకాల మీద మాత్రం క్లారిటీ రాలేదు. గత పదేళ్ల కాలంలో ఈ అంశం మీద బీఆర్ఎస్సర్కారు పెద్దగా శ్రద్ధ చూపకపోగా, కేంద్రం ఏర్పాటు చేసిన దక్షిణాది రాష్ట్రాల భేటీలకు అనేక పర్యాయాలు నాటి సీఎం గైర్హాజరు కావటంతో ఈ ఆస్తుల పంపకం పీటముడిగా మారింది. అయితే, గత డిసెంబరులో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం షెడ్యూల్ 9, 10లో ఉన్న ప్రభుత్వ సంస్థల ఆస్తుల పంపిణీ, నెలకొన్న న్యాయ వివాదాల మీద దృష్టి పెట్టటం ముదావహం. ఈ ఆస్తుల పంపకం విషయంలో నాటి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్మధ్యవర్తిత్వం వహించి ఏపీ ఆధీనంలోని కొన్ని భవనాలను తెలంగాణకు అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. తర్వాత ఈ పదేళ్ల కాలంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ 32 సార్లు, రెండు రాష్ట్రాల అధికారులు అనేకసార్లు చర్చించినా ఫలితం లేకపోయింది. దీంతో వాటాలు తేలని సంస్థల భవనాల్లో అనేకం నిరుపయోగంగా ఉండిపోయాయి. అయితే, లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత రెండు రాష్ట్రాలు దీనిపై చర్చించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో పేచీలేని ఆస్తులను జూన్ 2 తర్వాత తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది. మిగతా వాటిపై ఏపీ, కేంద్ర హోం శాఖతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
విభజన చట్టం ప్రకారం షెడ్యూల్ 9లో మొత్తం 91 సంస్థలు, షెడ్యూల్ 10 లో 142 సంస్థలున్నాయి. ఇవిగాక ఏ షెడ్యూల్‌లోనూ లేని మరో 32 సంస్థలున్నాయి. వీటిలో షెడ్యూల్ 9 సంస్థల విభజనపై షీలా భిడే కమిటీ అధ్యయనం చేసి సంస్థ కేంద్ర కార్యాలయం ఆధారంగా ఆస్తుల విభజన జరగాలని ప్రతిపాదించింది. ఐతే, షీలా భిడే కమిటీ సిఫారసుల్లో 23 సంస్థల విభజనపై తెలంగాణా అభ్యంతరం తెలిపింది. దీంతో పేచీలేని 68 సంస్థలను ఏకాభిప్రాయంతో ఉభయులూ పంచుకోవాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సూచించగా, దీనికి తెలంగాణ ప్రభుత్వం సరేనన్నప్పటికీ, ఏపీ కొన్ని అభ్యంతరాలు లేవనెత్తింది. ఈ క్రమంలో ఆస్తుల పంపకాలకై మధ్యవర్తిని నియమించాలని కోరుతూ ఏపీ సర్కారు సుప్రీంకోర్టునూ ఆశ్రయించింది. దీనిపై ఇటు తెలంగాణ సర్కారు, కేంద్ర హోంమంత్రిత్వ శాఖలు కౌంటర్ దాఖలు చేస్తూ, మధ్యవర్తిత్వం అవసరం లేదని పేర్కొన్నాయి. ఇవిగాక.. షీలా భిడే కమిటీ పక్కనబెట్టిన మరో 23 సంస్థల విషయంలోనూ స్పష్టత రావాల్సి ఉంది.
Also Read: మండలి ఎన్నికల్లో సంప్రదాయం పాటిస్తున్నారా?
మరోవైపు షెడ్యూల్ 9 సంస్థల్లో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విషయంలో ఏర్పడిన గందరగోళం నేటికీ అలాగే ఉంది. దీని పంపకాలకు కేంద్రం అనుమతి అవసరం తప్పనిసరి. కాగా, 2014 జూన్ 2 నాటికి ఈ సంస్థ పాలకమండలిలో అత్యధిక సభ్యులు ఏపీ వారే ఉన్నందున దీనిలో తమకూ సమాన ప్రాతినిధ్యం కావాలని తెలంగాణ అభిప్రాయపడింది. కానీ, సమాన ప్రాతినిధ్యం దక్కకపోగా, షీలా భిడే కమిటీ సిఫార్సులకు భిన్నంగా ఆ సంస్థ చరాస్తులు కూడా పంచాలని కార్పొరేషన్ మెంబర్లు తీర్మానం చేసి కేంద్రానికి లేఖ పంపగా, దీనిపై తెలంగాణ అభ్యంతరాలు తెలుపుతూ కేంద్రానికి లేఖ రాసింది. ఈ సంస్థకు హైదరాబాద్ నానక్ రాం గూడా, గాజులరామారం గ్రామంలో ఉన్న 500 ఎకరాల ఆస్తి ఉందనీ, దీనిలో ఏపీకి వాటా ఇవ్వలేమని తెలంగాణా తేల్చి చెప్పింది.
ఇక, షెడ్యూల్ 10లోని ఆస్తుల్లో ఏపీకి వాటా ఇవ్వాలని చట్టంలో లేకపోయినా, ఈ కేటగిరీలోని సంస్థల వద్ద ఉన్న నగదు నిల్వల్లో ఏపీకి వాటా ఇవ్వాలని ఉంది. అయితే, షెడ్యూల్ 10లోని ఆస్తుల్లోనూ తనకు వాటా ఇవ్వాల్సిందేనని ఏపీ పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో మొత్తం 142 సంస్థల ఆస్తులు ఎక్కడివి అక్కడే ఉండాలని నిర్ణయిస్తూ 2017 మే నెలలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలిచ్చింది. దీనిపై ఏపీ సర్కారు కోర్టును ఆశ్రయించటంతో షెడ్యూల్ 10 ఆస్తుల విభజన కూడా వివాదంగా మారింది.
ఇవిగాక.. సింగరేణి కాలరీస్ విభజన, దీనికి అనుబంధంగా ఏపీలో ఉన్న హెవీ మెషినరీ ఇంజినీరింగ్ లిమిటెడ్ (అప్మెల్), చట్టంలోని, రెండు రాష్ట్రాల ఉమ్మడి ఆస్తులు, ఉమ్మడి రాష్ట్రపు అప్పుల్లో వాటా, సంక్షేమ పథకాలకు ఉమ్మడి రాష్ట్రంలో కేంద్రం విడుదల చేసిన నిధులు, అయిన ఖర్చులు, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య ఉన్న విద్యుత్ బకాయిలు, చెల్లింపులు, వడ్డీ లెక్కల్లోనూ గందరగోళం నెలకొంది. ఇవిగాక హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ, తెలుగు అకాడమీ, ఫైన్ ఆర్ట్స్యూనివర్సిటీ, హైకోర్టు, రాజ్ భవన్, ఇతర ఉమ్మడి సంస్థలపై రూ.315 కోట్ల వరకు ఖర్చు చేసిన సొమ్ముపై ఏపీ చెల్లించాల్సిన బకాయిలు, నిర్మాణంలో ఉన్న భవనాల వాటా, తెలుగు అకాడమీ, ఫిల్మ్ డెవలప్ మెంట్, టీఎస్ఎంఎస్ఐడీసీ, మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వంటి సంస్థల విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. గత పదేళ్లుగా ఈ కార్పొరేషన్లలో ఎలాంటి నియామకాలు జరగనందున, ఈ పంపకాలు పూర్తయి, వీటిలో నియామకాలు చేపడితే, అనేకమంది తెలంగాణ నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని యువత కోరుకుంటోంది. ఈ విషయంలో తర్వలోనే ముందడుగు పడుతుందని ఆశిద్దాం.
-గోరంట్ల శివరామకృష్ణ (సీనియర్ జర్నలిస్ట్)