Sajjanar: తెలంగాణ ప్రభుత్వం టీఎస్ స్థానంలో టీజీని తెస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరిస్తూ గెజిట్ విడుదల చేసింది. దీంతో అధికారికంగా ఉన్న అన్ని చోట్ల టీఎస్‌కు బదిలు టీజీ రాబోతున్నది. ఇందులో భాగంగానే టీఎస్ఆర్టీసీ పేరు టీజీఎస్ఆర్టీసీగా మారిపోయింది. ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. అయితే.. లోగో పై ఆయన ప్రకటన చేయలేదు. కానీ, సోషల్ మీడియాలో ఓ లోగో ప్రచారంలోకి వచ్చింది.
గతంలో ఏపీఎస్ఆర్టీసీకి ఉన్న లోగోను పోలిన టీజీఎస్ఆర్టీసీ అనే లోగో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఇది అధికారిక లోగో కాదు. కానీ, ఈ లోగోను ప్రస్తావిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై కొందరు విమర్శలు చేశారు. ఈ లోగో గతంలోని ఏపీఎస్ఆర్టీసీ లోగోలా ఉన్నదని, ప్రగతి రథాలు తిరోగమనం వైపు వెళ్లుతున్నాయని ఆరోపణలు చేశారు. అసలు ఇది పచ్చరంగు జెండాలో లోగో డిసైడ్ చేసినట్టు ఉన్నదని మరికొందరు తీవ్రంగా ఆరోపించారు. దీంతో ఈ లోగో అధికారిక లోగో కాదని, అసలు లోగోను ఇంకా ఫైనల్ చేయలేదనీ ఎండీ సజ్జనార్ స్పష్టత ఇవ్వాల్సి వచ్చింది.
ఎండీ సజ్జనార్ ట్విట్టర్‌లో విషయాన్ని స్పష్టం చేశారు. కొత్త లోగో విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని తెలిపారు. అధికారికంగా ఇప్పటి వరకు కొత్త లోగోను సంస్థ విడుదల చేయలేదని స్పష్టం చేశారు. టీజీఎస్ఆర్టీసీ కొత్త లోగో అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న లోగో అని ఈ సందర్భంగా వివరించారు. ఈ లోగోతో సంస్థకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. సంస్థ కొత్త లోగోను రూపొందిస్తున్నదని తెలిపిన ఆయన కొత్త లోగోను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఇంకా ఫైనల్ చేయలేదని వివరించారు.