– ప్రగతి నగర్‌లో చిత్రవిచిత్రం
– ఫైనల్ లే అవుట్ అడ్డుకుని అప్పట్లో భూ దందా?
– ఓపెన్ స్పేస్‌లో అడ్డగోలు నిర్మాణాలు
– వ్యక్తిగత కక్ష సాధింపులో భాగంగా హిందూ ఆలయంపై పగ?
– 15 ఏండ్లుగా లేని అభ్యంతరాలపై కోర్టుకు వెళ్లిన వైనం
– రామాలయంలో అన్నదానం, పార్కింగ్ ఏరియా లేకుండా కుట్ర?
– గుడి, ఖాళీ ప్రదేశం జోలికి వస్తే ఊరుకోబోమంటున్న భక్తులు
– ఇప్పటికే 27 వేల గజాల ఓపెన్ స్పేస్ మాయం
– 50 వేల గజాల పార్కింగ్ ప్లేస్‌లో అన్నీ అక్రమ నిర్మాణాలే
– మత విధ్వేషాలు రెచ్చగొట్టే కుట్రలు జరుగుతున్నాయా?
– ప్రగతి నగర్ పంచాయతీపై ‘స్వేచ్ఛ’ స్పెషల్
దేవేందర్ రెడ్డి, 9848070809
Temple land dispute in Pragati Nagar: ‘స్వేచ్ఛ’ ఇన్వెస్టిగేషన్ టీం: ప్రగతి నగర్.. మధ్య తరగతి జనానికి వరంగా ఉండే ప్రాంతం. సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు ఎక్కువమంది ఈ ఏరియానే ఎంపిక చేసుకుంటారు. చాలా తక్కువ కాలంలోనే ఈ ఏరియా డెవలప్ అయింది. పాతికేళ్ల క్రితం అయితే, ఇక్కడ ఏమీలేదు. బాచుపల్లి నుంచి విడిపోయినప్పుడు 850 ఎకరాలతో ప్రగతి నగర్ గ్రామ పంచాయతీ ఏర్పడింది. ఆల్విన్ ఉద్యోగులందరూ కలిసి మంచి కాలనీ ఏర్పాటు చేసుకోవాలని అనుకున్నారు. ఇదే అదునుగా కొలను సీతారామిరెడ్డి, హరిబాబు దగ్గర్నుంచి భూములను కొనుగోలు చేశారు. 1991లో ఫైనల్ లే అవుట్ రాకుండానే మొదటిది అమ్మేశారు. పట్టాదారుల దగ్గర నుంచి ఓపెన్ స్పేస్‌లు కొనుగోలు చేసుకొని ట్రస్టుల పేరుతో భారీగా సంపాదించారు. సేవ ముసుగులో అంతా ఊడ్చేశారు. 5 దశలుగా 160 ఎకరాలు ప్రగతి నగర్‌ని డెవలప్మెంట్ కమిటీల పేర్లతో దొచేశారు.
సకల సౌకర్యాలంటూ నమ్మబలికి..!
ఆల్విన్ ఉద్యోగులకు సకల సౌకర్యాలతో కాలనీ ఉంటుందని నమ్మబలికారు కొంతమంది పెద్దలు. స్కూల్స్, కాలేజీలు, హాస్పిటల్స్, కమ్మూనిటీ హాల్స్, ఓపెన్ స్సేస్‌తో పాటు ప్రత్యేక గుర్తింపు పొందేలా మద్యం, పొగాకు విక్రయించకుండా నిర్ణయాలు తీసుకున్నారు. 25 ఏండ్లపాటు కమ్యూనిస్టుల చేతిలో నిర్మాణాలు, పక్కా పద్దతిగా కొనసాగాయి. కానీ, పేరుకు మంచి చేస్తున్నామని చెప్పుకున్నా.. కొంత మంది లీడర్స్ దీన్ని ఓ అద్భుతమైన బిజినెస్‌గా మార్చుకున్నారు. కోట్ల రూపాయలు గడించారు. పీపుల్స్ ప్రోగ్రెస్ ట్రస్ట్ పేరుతో స్కూల్స్, హాస్పిటల్స్, అనాధాశ్రమం అంటూ ఏర్పాటు చేసినా ఇప్పుడు ఓ కమ్యూనిస్టు నేత సొంత ప్రయోజనాలకు మాత్రమే అవి పనికొస్తున్నాయనే ఆరోపణలున్నాయి. ఆల్విన్ ఉద్యోగులకు ఎక్కడా నామినల్ ఫీజుతో సేవలు అందడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
పార్కింగ్ ప్లేస్‌లో భవంతులు
రోజురోజుకీ ధరలు పెరుగుతుండటంతో స్కూల్ ప్లేస్, సోషల్ ఇన్ఫ్రా భూముల్లో ట్రస్ట్ ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి డబ్బులు పోగు చేసుకున్నారు కమ్యూనిస్ట్ పెద్దలు. అలా ఆదాయ మార్గాన్ని పెంచారు. అయితే, ఓపెన్ స్పేస్‌లో అధికారిక భవనాలు నిర్మించారు. గుడి, బడి, ప్లే ఏరియా, చర్చి, మసీద్, స్కేటింగ్ గ్రౌండ్, ఫంక్షన్ హాల్, క్రికెట్ గ్రౌండ్, చివరికి నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం కూడా 4044 గజాల పార్కింగ్ ప్లేస్‌ని కబ్జా చేసి నిర్మించారు. 5 లే అవుట్స్ కలిపి 77 వేల గజాల పార్కింగ్ ప్లేస్ ఉండాలి. కానీ, ఇప్పుడు 50 వేల గజాలు మాత్రమే తాము గుర్తించినట్లు ఆర్టీఐ యాక్ట్ ద్వారా తెలిపారు మున్సిపల్ అధికారులు. అందులోనూ అంగన్ వాడీ స్కూల్ నుంచి మొదలుకొని పుచ్చలపల్లి సుందరయ్య ఫంక్షన్ హాల్ వరకు నిర్మాణాలు ఉన్నాయి. గుడి, మసీదు, చర్చిలకు స్థలాలు కేటాయించారు.
గుడిపైనే కన్నేశారా?
ఈ ఏరియాలో పలు ఆలయాల కోసం 2 ఎకరాల ప్రదేశాన్ని అప్పగించారు. కానీ, అందులోనే 1500 గజాలు సుందరయ్య ఫంక్షన్ హాల్ నిర్మించారు. ఇప్పుడు పొచమ్మ దేవాలయంతో పాటు, సీతారామాంజనేయ స్వామి, శివుడు, గణపతి, సాయిబాబాతో పాటు వారానికి ఒక రోజు వెయ్యి మందికి ఉచిత అన్నదానం జరిగేలా ఏర్పాట్లు ఉన్నాయి. ప్రతి పండగకు ఇక్కడ ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిస్తుంటుంది. ఆలయం వెనుక ఉన్న ఖాళీ ప్రదేశంలో గుడి కార్యాలయాలతో పాటు సిబ్బంది షెడ్స్, గోశాల, నిత్య అన్నదానం షెడ్స్ 2011లో నిర్మించారు. అప్పటి నుంచి ట్యాక్స్‌తో పాటు ఎల్ఆర్ఎస్ అప్లయ్ చేసింది టెంపుల్ డెవలప్మెంట్ కమిటీ. మధ్యలో పార్కింగ్ కోసం అంటూ ప్లేస్ వదిలారు. ఇప్పుడు ఆ ప్లేస్ మీదనే కన్ను పడింది ఆ పెద్దలకు. మొత్తంగా పార్కింగ్ లేకుండా చేసే కుట్రలు జరుగుతున్నాయని సమాచారం. గుడి ముందు 20 ఫీట్ల దారిని కబ్జా చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యక్తితోనే.. వెనుక ఖాళీ పార్కింగ్ ప్లేస్ అంటూ హైకోర్టులో కేసు వేయించారు. ఎంతో సెన్సిటివ్ ఇష్యూ కావడంతో కలెక్టర్ స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చి చర్యలు తీసుకోలేదు. కానీ, ఇప్పుడు ఆ స్పీకింగ్ ఆర్డర్‌ని అమలు చేయాలని పార్కింగ్ ప్లేస్ అంటూ హైకోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకురావడాన్ని భక్తులు తప్పుబడుతున్నారు.
హిందూ మనోభావాలు దెబ్బ తీస్తే ఊరుకోం- వెంకట్ రెడ్డి, భక్తుడు
కూకట్ పల్లి, నిజాంపేట్, ప్రగతి నగర్‌లో గోశాల ఎక్కడా లేదు. మేము నిత్యం ఇక్కడికి వచ్చి గోపూజ చేసుకుంటాం. వాటి పెంపకం కోసం గుడి వాళ్లు ఎంతో ఖర్చు చేస్తున్నారు. పాత షెడ్ కాకుండా కొత్తగా వేయించాలని అనుకుంటే హిందూ వ్యతిరేకులు కోర్టుకు వెళ్తున్నారు. మేము ఎప్పుడైనా వారి ఆలయాల స్థలంలోకి వెళ్లామా? ప్రశాతంగా ఉండే ప్రగతి నగర్‌లో మత విద్వేశాలు రెచ్చగొట్టేలా చేస్తున్నారు.
పండుగ వస్తే స్థలం సరిపోదు- సాయిబాబు, భక్తుడు
నెలకు కనీసం రెండు పండుగలైనా ఇక్కడ ఘనంగా జరుగుతాయి. శ్రీరామనవమి కన్నుల పండుగగా ఉంటుంది. గుడి కోసం ఇంకా ప్లేస్ ఏర్పాటు చేయాల్సింది పోయి, ఉన్న స్థలాన్ని లాక్కోవాలని చూస్తున్నారు. ఇదెక్కడి రాజకీయం.
అన్నదానం ఆదర్శం- డాక్టర్ రాజు, భక్తుడు
ఇక్కడ సేవా మార్గంలో ఏదో ఒక రూపంలో అన్నదానం జరుగుతుంది. ప్రతి గురువారం గుడి మేమేజ్మెంట్ 1000 మందికి ఉచితంగా భోజనాలు ఏర్పాటు చేస్తుంది. ఇలా చేయడం కొంత మందికి నచ్చడం లేదు. మా గుడి ప్రాంతంలో అడుగు పెడితే మేము ఏంటో చూపిస్తాం.
రోజూ గుడికి వస్తాను, ఎంతో బాగుంటుంది- శ్యామల దేవి, భక్తురాలు
ప్రగతి నగర్‌లో ప్రశాంతత కోసం గుడి, దీని చుట్టూ ఉన్న ప్రాంతం ఎంతో బాగుంటుంది. ఇప్పుడేమో ఫంక్షన్ హాల్‌కి పార్కింగ్ ప్లేస్ కావాలని గుడి ప్లేస్‌ని అడగడం ఏంటి? ప్రభుత్వం, అధికారులు ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూని తెగే వరకు లాగొద్దు. భక్తులకు ఆగ్రహం వ్యక్తం చేస్తే ఏం అవుతుందో ఒక్కసారి ఊహించుకోవాలి.