– 45 డిగ్రీలు దాటిన పగటి ఉష్ణోగ్రతలు
– భానుడి ప్రతాపంతో జనం ఆగచాట్లు
– ఉదయం నుంచే మొదలవుతున్న భగభగలు
– మండుతున్న ఉత్తర తెలంగాణ
– జాగ్రత్తలు పాటించాలంటూ వాతారణ శాఖ హెచ్చరిక
హైదరాబాద్, స్వేచ్ఛ: తెలంగాణలో రాగల ఐదురోజుల పాటు వడగాలులతో బాటు 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుకానున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. భానుడి ప్రతాపం రోజురోజుకూ తీవ్రమవటంతో పగలు తీవ్రమైన ఎండ, రాత్రి వరకు ఉక్కపోతలతో జనం సతమతమవుతున్నారు. ఏప్రిల్ దాటకముందే పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటటం, తీవ్రమైన వడగాలులు వీచటంతో మధ్యాహ్నానికి వీధులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. రానున్న 5 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని, వడగాలుల తీవ్రత మరింత పెరగనుంది.
రాజధాని భగభగ
నిన్న (శుక్రవారం) రాజధానిలో హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 9 గంటల నుంచే ఎండ మండిపోవటంతో బాటు మధ్యాహ్నానికి నగరం నిప్పుల కొలిమిలా మారింది. నగరంలోని 6 ప్రాంతాలలో మధ్యాహ్నానికి 42 డిగ్రీల సెల్సియస్‌కు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ పర్యవేక్షణ కేంద్రం అధికారులు వెల్లడించారు. అత్యధికంగా మియాపూర్‌లో 42.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా, బోరబండలో 42.5, షేక్‌పేట 42.4, కుత్బుల్లాపూర్‌లోని ఆదర్శ్ నగర్‌లో 42.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో 42 డిగ్రీల సెల్సియస్ నమోదైందని తెలిపారు.
Also Read: సెంటి‘మంటల్’ పాలిటిక్స్
రేపు పలు జిల్లాలకు ఎల్లో ఎలర్ట్
ఏప్రిల్ 28న నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలకు వడగాలులు వీస్తాయంటూ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మెదక్, కామారెడ్డి జిల్లాలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈనెల 28, 29వ తేదీనా నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిలాల్లో అధికంగా వడగాల్పులు విచే అవకాశం ఉండడంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఇదే కారణం
2023లో మొదలైన ఎల్‌నినో ప్రభావమే ఈ ఎండలకు కారణమని వాతావరణ శాఖ చెబుతోంది. మండే ఎండలకు తోడు ఈసారి విచిత్రమైన వాతావరణ పరిస్థితి ఏర్పడింది. గత కొన్ని రోజులుగా నమోదవుతున్న ఉష్ణోగ్రతల కంటే ఎండ వేడిమి ఎక్కువగా ఉంటోంది. దీనినే వాతావరణ శాస్త్రవేత్తలు ‘ఫీల్ లైక్ టెంపరేచర్’ అంటారు. గాలిలో తేమ శాతం పెరగడమే దీనికి కారణం. దీని వల్ల ఉక్కపోత ఎక్కువగా ఉంటోంది. రాబోయే రోజుల్లో ఈ ఎండలు మరింత పెరిగే ప్రమాదముందని, మధ్యాహ్నం అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. రాబోయే మూడు రోజుల్లో రామగుండం, భద్రాచలం పరిధిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని, వృద్ధులు గర్భీణీలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే తలపై టోపీ లేదా గొడుగు పెట్టుకోవాలని సూచిస్తున్నారు.