- నిరుద్యోగమే వారి ప్రధాన సమస్య
- 18-39 మధ్య 1,28,83,205 యూత్ ఓట్లు
- కేసీఆర్ హయాంలో వారికి తీరని అన్యాయం
- పదేళ్లలో ఇచ్చింది 46 వేల ఉద్యోగాలే
- కాంగ్రెస్ రాగానే గ్రూప్స్, డీఎస్‌సీ నోటిఫికేషన్స్
- కోడ్ తర్వాత 50 వేల పోస్టుల భర్తీకి రంగం సిద్ధం
- హస్తం పార్టీ వైపే యువత ఆశలు
- ఓట్లూ అటేనంటున్న రాజకీయ విశ్లేషకులు
Congress target youth voters jobs notifications: లోక్‌సభ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంటోంది. ఈ క్రమంలోనే పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ప్రధాన పార్టీల అగ్రనేతలంతా వరసబెట్టి రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయా పార్టీలన్నీ ఈ ఎన్నికల్లో తమకు అండగా నిలచే వర్గాలేమిటని ఆరా తీస్తున్నాయి. ముఖ్యంగా యువత మనసు గెలవగలిగితే గెలుపు సాధ్యమేనని భావిస్తూ, అందుకు తగిన ఎన్నికల హామీలిస్తున్నాయి. తెలంగాణలో మొత్తం 3. 30 కోట్ల ఓటర్లున్నారు. వీరిలో తొలిసారి ఓటు నమోదు చేసుకున్న వారి సంఖ్య 8 లక్షలు. మిగిలిన ఓటర్లలో 18 నుంచి 39 మధ్య వయసున్న వారి సంఖ్య 1,28,83,205. వీరిలో యువకులు 64,89,502 కాగా యువతుల సంఖ్య 63,93,703. దీంతో ఆయా నియోజక వర్గాల వారీగా ఉన్న యువత సమస్యలు తెలుసుకునేందుకు అభ్యర్థులు యువ సమ్మేళనాలు, నిరుద్యోగ, విద్యార్థి సంఘాల సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రతి సమావేశంలోనూ వారి సమస్యలను ప్రస్తావిస్తూ, వారికి న్యాయం చేస్తామని హామీ ఇస్తున్నారు. తమ పార్టీలకు చెందిన యువజన విభాగాల నేతలకు పంపి వారికి అండగా నిలుస్తామని అభయమిస్తున్నారు.
దశాబ్ద కాలంగా దగా
‘నీళ్లు, నిధులు, నియామకాలు’ అనే నినాదంతోనే తెలంగాణ యువతకు న్యాయం జరుగుతుందనీ, తాము అధికారంలోకి వస్తే లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేస్తామని, ఇక కాంట్రాక్ట్, ఔట్ సోర్స్ ఉద్యోగాలనేవే ఉండవని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అప్పట్లో పదేపదే యువతను మురిపించారు. 2014 ఎన్నికలయ్యాక జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాల్లో లక్షా 7 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని వెంటనే భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రం ఆవిర్భావించే నాటికి తెలంగాణలో ఖాళీగా ఉన్న పోస్టులు, ఆ తర్వాత ఏటా పదవీ విరమణలతో ఖాళీ అయిన ఉద్యోగాలు కలిపి.. మొత్తం దాదాపు.. 3 లక్షలు. 2021 ఏప్రిల్ నాటికి.. అంటే.. 7 ఏళ్లలో టీఎస్పీఎస్సీ 110 నోటిఫికేషన్లు విడుదల చేసి, భర్తీ చేసిన ఉద్యోగాల సంఖ్య 35,724. మరోవైపు 2021 ఏప్రిల్ నాటికే రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల మంది నిరుద్యోగులు టీఎస్పీఎస్సీ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో 85% శాతం స్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారే. 2021 ఏప్రిల్ నాటికే ప్రభుత్వంలోని అన్ని శాఖలతో కలిపి 1,91,126 ఉద్యోగాలున్నాయని అప్పటి పీఆర్సీ నివేదిక వెల్లడించింది. టీఎస్పీఎస్సీలో రిజిస్టర్ చేసుకొని, నోటిఫికేషన్లు రాక వయసు దాటిపోయిన వారి సంఖ్యతో కలిపి 2024 నాటికి వీరి సంఖ్య 35 లక్షలకు చేరింది.
నవ్వుల పాలైన నోటిఫికేషన్లు
రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇచ్చిన ఒకే ఒక గ్రూప్ -1 నోటిఫికేషన్, పేపర్ లీకేజీతో నవ్వుల పాలు కావటంతో తమపై బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యం ఉందో అర్థమైంది. రాష్ట్రంలోని నిరుద్యోగులందరికీ నెలకు రూ. 3,016 చెల్లిస్తామని 2018 అసెంబ్లీ ఎన్నికల వేళ కేసీఆర్ ప్రకటించారు. ఈ విషయాన్ని మేనిఫెస్టోలో పెట్టటమే తప్ప, తొలి రెండేళ్లలో దాని ఊసే ఎత్తలేదు. 2019 – 20 బడ్జెట్‌లో రూ.1,810 కోట్లు కేటాయించినా, యువతకు పైసా అందలేదు. ఆ తర్వాతి బడ్జెట్లలో ఆ ఊసే లేకుండా పోయింది. చివరికి ఆయన దిగిపోయే నాటికి ఇచ్చిన మొత్తం ఉద్యోగాల సంఖ్య కేవలం 46 వేలు మాత్రమేనని నిపుణులు లెక్క తేల్చారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాలు అధికారపార్టీ వారికే దక్కాయని రుజువు చేసే అనేక సాక్ష్యాలు జనం ముందుకొచ్చాయి. దీనికి నిరసనగా యువత రోడ్డెక్కినా ప్రభుత్వం తరపున ఓదార్పు గానీ, భరోసాగానీ దక్కకపోగా, బెదిరింపులు, కేసులు ఎదురయ్యాయి. దీంతో గులాబీ పార్టీ తమను సుమారు దశాబ్దం పాటు ఒక పథకం ప్రకారం దగా చేసిందని యువత ఒక నిర్ణయానికొచ్చారు. దీంతో అసెంబ్లీ ఎన్నిలక నాటికి కాంగ్రెస్ మాత్రమే తమ ఆకాంక్షలను తీర్చగలదనే నిర్ణయానికి వారు వచ్చారు.
అండగా నిలిచిన కాంగ్రెస్
శాసన సభ ఎన్నికల్లో తాము అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాల భర్తీతో బాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. జూన్ 2 నాటికి అన్ని శాఖల్లోని ఖాళీలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించి, సెప్టెంబరు 17లోపు నియామకాలు పూర్తి చేయడం, సెంట్రలైజ్డ్ ఆన్‌లైన్ రిజిస్ర్టేషన్ పోర్టల్ ఏర్పాటు, ప్రతి జిల్లాలో ఎంప్లాయిమెంట్ ఎక్చేంజీలు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటు, ప్రభుత్వ రాయితీలు పొందిన ప్రైవేటు కంపెనీల్లో తెలంగాణ యువతకు 75శాతం ఉద్యోగాలు.. ఇలా వివిధ అంశాలతో డిక్లరేషన్ ప్రకటించింది. ‘యువరోషిణి’ కార్యక్రమం కింద స్టార్టప్ లకు రూ.5,000 కోట్ల కార్పస్ ను కేటాయిస్తామనీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ప్రక్షాళన చేస్తామనీ, ఉద్యోగాల భర్తీ వ్యవహారంలో అక్రమాలకు పాల్పడిన వారిని గతంలో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. డిసెంబరు 7న రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచే నిరుద్యోగుల సమస్య మీద దృష్టి సారించింది. 4 నెలలలోనే గ్రూప్-1, మెగా డీఎస్సీ నోటిఫికేషన్లు జారీ చేసింది. ఉద్యోగానికి ఎంపికై, నియామక పత్రాల కోసం ఎదురుచూస్తున్న స్టాఫ్ నర్సులు, కానిస్టేబుల్స్ వంటి ఉద్యోగాలకు నియామక పత్రాలను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా అందించటం, ఎన్నికల కోడ్ తర్వాత మరో 50 వేల ఖాళీలకు నోటిఫికేషన్లు జారీ చేస్తామని హామీ ఇవ్వటమూ నిరుద్యోగుల్లో కాంగ్రెస్ పట్ల సానుకూలతకు కారణమయింది. తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కూడా యువ ఓటర్లను ఆకట్టుకోవడానికి కసరత్తులు చేస్తున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే తమకు న్యాయం చేయగలదనే భావంతో యువత ఉన్నారనీ, ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ యువత ఓటు హస్తానికేనని రాజకీయ పండితులు భావిస్తున్నారు.