- మహిళా ఓటర్లకు జై కొడుతున్న పార్టీలు
- మహిళా సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ ముందంజ
- డ్వాక్రా బృందాల ఓట్లన్నీ హస్తానికేనా?
- కాంగ్రెస్ పథకాల్లో మహిలకు పెద్దపీట
- ఈ ఎంపీ ఎన్నికల్లో మహిళా ఓటర్లే కీలకం
- తెలంగాణలో మహిళా ఓటర్లు 1,65,87,134
- ప్రతి ఎన్నికలోనూ మహిళల ఓటింగే ఎక్కువ
- ఓటు వేయడానికి బద్దకిస్తున్న పురుషులు
- గ్రామీణ ప్రచారంలోనూ మహిళా కార్యకర్తలు
Telangana Women voters prefers congress welfare schemes:
రాష్ట్రంలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో మహిళా ఓటర్లు కీలకంగా మారనున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలన్నీ మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. ఇప్పటికే నామినేషన్ల పర్వం పూర్తికావటంతో రానున్న పదిరోజుల్లో ప్రధాన పార్టీలన్నీ ప్రచారం మీద దృష్టి పెట్టనున్నాయి. దీంతో ఆయా నియోజక వర్గాల్లోని మహిళా ఓటర్ల వివరాలను సేకరిస్తున్నాయి. పరిశీలకుల అంచనా ప్రకారం గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి ఎన్నికలోనూ పురుష ఓటర్లతో పోల్చితే మహిళా ఓటర్లే విధిగా తమ ఓటును వినియోగించుకుంటున్న సంగతి తెలిసిందే.
పోటెత్తిన మహిళా చైతన్యం
తెలంగాణలో 1,64,10,227 మంది పురుష ఓటర్లుండగా, మహిళా ఓటర్ల సంఖ్య 1,65,87,134. అంటే ప్రతి వెయ్యిమంది పురుష ఓటర్లకు 1,011 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. పైగా ఓటు హక్కు విషయంలో మహిళలే ముందుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇది నిజమైంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో మెజారిటీ మహిళా కేంద్రంగా ఉండటం ఈసారి ఎన్నికల్లో హస్తం పార్టీకి కలిసొచ్చేలా ఉంది. దీంతో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో మహిళలకు వర్తించే పథకాలను ఈ పదిరోజుల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని నేతలు భావిస్తున్నారు. ఉచిత ఆర్టీసీ ప్రయాణం, రూ.500కే వంట గ్యాస్ సిలిండర్, ప్రభుత్వ పాఠశాలల యూనిఫామ్‌లు కుట్టే పని డ్వాక్రా సంఘాలకు అప్పగించటం, వడ్డీ లేని రుణాలు.. తదితర పథకాల ప్రచారాన్ని ఇంటింటికీ చేర్చేందుకు కాంగ్రెస్ అనుబంధ సంఘాల కార్యకర్తలు గ్రామాల్లో ఇప్పటికే ప్రచార క్యాంపెయిన్‌కు శ్రీకారం చుట్టారు.
సోనియా గాంధీ మాట మేరకే..
గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన సోనియా గాంధీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, 100 రోజుల్లోనే తాము ప్రకటించిన పథకాల అమలుకు చొరవ తీసుకుంటామని ప్రకటించారు. ఆ మాట మేరకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించారు. ఆ వెంటనే గ్యాస్ సిలిండర్, ఆరోగ్య శ్రీ పరిధి పెంపు వంటి నిర్ణయాలను అమలు చేస్తూ., ఆరవదైన రైతు రుణమాఫీకి తాజగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. మేనిఫెస్టోలో ప్రకటించినవన్నీ ప్రజలకు అందిస్తూ భరోసా కల్పిస్తున్న కాంగ్రెస్, ఇటీవల పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన సభలోనూ ముందు వరుసల్లో జిల్లాల నుంచి తరలి వచ్చిన డ్వాక్రా గ్రూపుల మహిళలు కూర్చునేలా చొరవ తీసుకుంది.
అమ్మ ఆదర్శ పాఠశాల
పరేడ్ గ్రౌండ్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. వడ్డీలేని రుణాలను అందిస్తామని, ప్రభుత్వ స్కూళ్ల యూనిఫామ్స్ కుట్టే పనిని డ్వాక్రా సంఘాలకే ఇస్తామని మాట ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సౌకర్యాల కల్పనలోనూ మహిళలకే పెద్దపీట వేసేందుకు ‘అమ్మ ఆదర్శ పాఠశాల’ పేరుతో కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. పాఠశాలల్లోని సౌకర్యాలను మెరుగుపర్చడానికి ఏర్పడే కమిటీలో డ్వాక్రా మహిళలతో బాటు విద్యార్థుల తల్లులకు స్థానం కల్పించారు.
గ్రామాలలో కట్టుదిట్టమైన ప్రచారం
అసెంబ్లీ ఎన్నికలకు భిన్నంగా ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో పెద్దసంఖ్యలో మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు గ్రామాల్లో పార్టీ ప్రచారం చేస్తున్నారు. వీరంతా ఇంటింటికీ వెళ్లి, కాంగ్రెస్ పథకాల కరపత్రాలు పంచుతూ, ఓటర్లకు పథకాల ప్రత్యేకతను వివరించి, మహిళా ఓటర్లంతా పోలింగ్ రోజున ఓటింగ్‌కు కదిలొచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఒకవైపు ఎన్ఎస్‌యూఐ, మరోవైపు యూత్ కాంగ్రెస్, కిసాన్ సెల్, వికలాంగుల విభాగాల యాక్టివిస్టులు ప్రచారం చేస్తుండగా మహిళా కాంగ్రెస్ సైతం గ్రామాల్లో క్యాంపెయిన్‌ను యాక్టివ్ చేసింది.