మరో పక్షం రోజుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తి కావస్తోంది. అమరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ ఈ పదేళ్ల కాలంలో చెప్పుకోదగ్గ విజయాలను సాధించిందనేది ఎవరూ కాదనలేని వాస్తవం. కానీ, ఈ దశాబ్ద కాలంలో తెలంగాణ కోల్పోయినవీ ఉన్నాయి. ఈ పది వసంతాల కాలంలో తెలంగాణ అస్తిత్వం రాజకీయంగా బందీ అయిందనీ, ఈ కారణంగానే అది బహుముఖీయంగా ప్రకటితం కాలేకపోయిందని తెలంగాణలోని ఆలోచనాపరులను బాధిస్తోంది. స్వరాష్ట్రం ఆవిర్భావం తర్వాత ఇక్కడి పౌర సమాజంలో చైతన్యం తగ్గటమే ఈ పరిస్థితికి కారణమనేది వారు చెబుతున్న మాట. తెలంగాణ పౌరసమాజంలోని అనేక నేపథ్యాల నుంచి వచ్చిన మేధావులు, సామాజిక ఉద్యమకారులు, కళాకారులు, రచయితలు, హక్కుల కార్యకర్తలు, పర్యావరణవేత్తలలో మెజారిటీ వర్గం ఈ పదేళ్ల కాలంలో ఎందుకో ఒక రాజకీయ దృక్పథానికి తెలియకుండానే బందీ అయిపోయారనీ, కానీ పరిస్థితులు చేజారి పోతున్న పరిస్థితిని గమనించి ఎట్టకేలకు గత అసెంబ్లీ ఎన్నికల నాటికి వీరు ప్రజాగళాన్ని బలంగా వినిపించటం మూలంగానే ప్రజల ఆలోచనలో మార్పు సాధ్యమైందనేది కాదనలేని వాస్తవం.
ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు అన్ని ప్రాంతాల పట్ల సమదృష్టిని ప్రదర్శించలేకపోగా, దీనిని విమర్శించిన గొంతులనూ అణిచివేశారు. సమన్యాయం స్థానంలలో కనీస న్యాయం కోరిన వారి మాటనూ తృణీకరించిన సందర్భమది. ఈ క్రమంలో తెలంగాణ సంస్కృతి, భాష, వారసత్వం, వాఙ్మయం, ఆహారపుటలవాట్ల వంటి అనేక అంశాలు చిన్నచూపుకు లోనయ్యాయి. అదే సయమంలో రాష్ట్రంలో పలు ప్రాంతాల మధ్య ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక పరమైన అసమానతలు కొనసాగాయి. ఆ సమయంలో ఇక్కడి పౌరసమాజం ఈ వివక్షను గుర్తించి, విశ్లేషించి, తెలంగాణ సమాజం ముందు చర్చకు పెట్టి ప్రజలను చైతన్య పరచింది. ప్రజలకు ప్రశ్నించే స్వభావాన్ని అలవరచి, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో భాగస్వాములయ్యేలా వారిని సిద్ధం చేసిందీ ఈ పౌర సమాజమే. ఉద్యమ ప్రారంభం, సమయానుగుణంగా అనుసరించాల్సిన వ్యూహాల రూపకల్పన, కార్యాచరణ మొదలు స్వరాష్ట్ర సాధన వరకు ప్రతి దశలోనూ ఈ పౌర సమాజం అలుపెరగక కృషి చేసి, నిర్ణయాత్మక పాత్రను పోషించింది.
హైదరాబాద్ రాష్ట్రం, ఆంధ్రరాష్ట్రంలో విలీనమైన నాటి నుంచే తెలంగాణ పౌర సమాజపు నిరసన ఏదో ఒక రూపంలో వినిపిస్తూనే వచ్చింది. తొలిదశ ఉద్యమం నాటి పాలకుల పదవీకాంక్షకు బలైపోగా, మలి దశలోనైనా స్వరాష్ట్ర ఆకాంక్షను నిజం చేసుకోవాలనే పట్టుదల పౌరసమాజంలో బలంగా ఏర్పడింది. కానీ, మలిదశ ఉద్యమంలోనూ ఉద్యమ నాయకత్వాన్ని అన్ని స్థాయిల్లోనూ ప్రశ్నించలేకపోవటంతో రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన కీలక నిర్ణయాల్లో పౌర సమాజపు పాత్ర పరిమితమవుతూ వచ్చింది. నిరంకుశ విధానాల స్థానంలో ప్రజాస్వామ్యం వెల్లివిరుస్తుందని భావించిన ప్రజలకు ఆదిలోనే అపశకునాలు కనిపించినా, తెలంగాణ పునర్నిర్మాణమనే మాటను నమ్మి మౌనాన్ని ఆశ్రయించారు. దోపిడి, పెత్తందారీ పోకడల నుంచి ప్రజల మౌలిక విముక్తి దిశగా అడుగులు పడకపోగా, ప్రజల కనీస ఆకాంక్షలను నాటి పాలకుడు గాలికొదిలేయటం మొదలైంది. తెలంగాణ సమాజపు ఆకాంక్షల స్థానంలో పాలకుడి వ్యక్తిగత ఆసక్తులు, ప్రాధాన్యాలు తెరమీదికొచ్చాయి. ప్రభుత్వ యంత్రాంగం, ఇతర వ్యవస్థలన్నీ ఒక్క మనిషి ఆదేశాలకై ఎదురుచూడాల్సిన పరిస్థితి దాపురించింది. అలవిమాలిన వాగ్దానాలు ఆచరణలో సాధ్యమా అని నిలదీసిన వారు తెలంగాణ ద్రోహులుగా చిత్రీకరించబడ్డారు. ‘ఇలా చేస్తే బాగుంటుందేమో’ అని సలహాలివ్వటానికి ప్రయత్నించిన వారికి అదే ఆయన చివరి ప్రత్యక్ష దర్శనం అయింది. తెలంగాణలోని మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం, ప్రాచీన తెలుగు కేంద్రం నెల్లూరుకు తరలింపు నిర్ణయాల్లో పాలకుడికి ఎవరి సలహా తీసుకోవాలని అనిపించలేదు. తద్వారా తెలంగాణ భౌతిక అస్తిత్వం ప్రశ్నార్థకమైంది. నాటి పౌర సమాజపు నిరసన పాలకుడికి చేరలేనంత అగాధం అప్పటికే ఏర్పడిపోయింది.
Also Read: PM Modi: గాజా యుద్ధాన్ని కూడా ఆపాను
ఉద్యమనేత దశాబ్దకాలపు పాలనలో పౌర సమాజం నిర్వీర్యం కావటానికి, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నిజం కాకపోవటానికి అనేక ఇతర కారణాలూ దోహదపడ్డాయి. నూతన రాష్ట్రం ఆవిర్భావం తర్వాత తెలంగాణలో ఆదినుంచీ ఆధిపత్య ధోరణులను అనుసరిస్తూ వచ్చిన భూస్వామ్య వర్గం, ప్రపంచీకరణ ప్రభావంతో ఆర్థికంగా నిలదొక్కుకున్న అగ్రవర్ణేతర సమూహాలు నూతన పాలక వర్గంలో భాగస్వాములయ్యారు. దీంతో అక్కడ ఒక నయా పెట్టుబడిదారీ వర్గం స్థిరపడిపోయింది. ఈ వర్గం గ్రామాల్లో సామాజిక సాధికారతను ప్రోత్సహించటానికి సిద్ధపడకపోగా, అణచివేతకు పూనుకొంది. ఈ క్రమంలోనే పురోగామి శక్తులు, ఉద్యమకారుల పాత్ర పరిమితమై, తెలంగాణ అస్తిత్వం ఒక రాజకీయ పార్టీకి, ఒక నాయకుడికే పరిమితమైపోయాయి. పాలకుడి ఆకర్షణీయమైన సంక్షేమ పథకాలు, లక్షల కోట్ల వ్యయంతో రూపొందించిన భారీ ప్రాజెక్టుల ప్రచార హోరుకు ఆలోచనాపరులు సైతం ఒక తెలియని నిస్సయాతకు లోనయ్యారు. ఈ ప్రాజెక్టుల అమలు బాధ్యతలు అనుయాయులైన పెట్టుబడిదారులకు దక్కగా, సామాన్య ప్రజలంతా చిన్నచిన్న సంక్షేమాలకే పరిమితం కావాల్సి వచ్చింది. పౌర సమాజపు సందిగ్ధాన్ని విజయవంతంగా కొనసాగించేందుకు ఉద్యమకాలంలో ప్రజా సంఘాలలో కోవర్టులుగా వ్యవహరించిన వారంతా ప్రభుత్వ సలహాదారులుగానో లేక మరో పదవుల్లోనో చక్కగా స్థిరపడిపోయారు.
‘నీళ్లు..నిధులు.. నియమాకాలు’ అనే నినాదం పాలకుల మరుపుకు లోనైంది. పాలకుల నయా ఉదారవాద ఆర్థిక వ్యూహాలతో లక్షలాది ఉద్యోగాలు పోయాయి. మూతపడిన పరిశ్రమలను తిరిగి ప్రారంభించటం పాలకులకు నష్టదాయకంగా తోచింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పాలకుల నిర్లక్ష్యంతో పదేపదే అపహాస్యం పాలైంది. వందేండ్ల నాటి ఉస్మానియా, 30 ఏండ్ల నాటి గాంధీ, ఏనాడో నిర్మించిన నిమ్స్ ఆసుపత్రులు సైతం కనీస సౌకర్యాలకు నోచుకోలేకపోయాయి. ప్రభుత్వ విధానాల మీద నిర్మాణాత్మకమైన విమర్శ పెట్టి, ప్రజల అభివృద్ధిలో భాగం కావాల్సిన యువత గత పదేళ్ల కాలంలో మత్తులో పడిపోయింది. 30 ఏండ్లలోపే తాగుడుకు బానిసలై మరణిస్తున్న వారి సంఖ్య అధికంగా ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ ముందువరుసలో నిలిచింది. ప్రభుత్వ బడులు నీస సౌకర్యాలకు నోచుకోలేకపోయాయి. ఉన్నత విద్య పేదలకు దూరమైంది. నాణ్యమైన బోధన లేక ఉన్నత విద్య పడకేసింది. యూనివర్సిటీలకు ప్రభుత్వం బ్లాక్ గ్రాంట్‌ను నిలిపి వేసింది. ఆర్భాటంగా ప్రకటించిన కేజీ టు పీజీ ఉచిత విద్య నినాదానికే పరిమితమైంది. తెలంగాణ అస్తిత్వాన్ని ఆట, పాట రూపాల్లో తట్టలేపిన బహుజన, దళిత కళాకారులను తెలంగాణ సాంస్కృతిక సారధులంటూ పాలకులు బందీలుగా మార్చేసి, వారి సృజన, మేధస్సును ప్రభుత్వ పథకాల ప్రచారానికి పరిమితం చేసేశారు. భూమి విలువలు ఆకాశానికి పెంచేసి అభివృద్ధి అంటే ఆకాశాన్నంటే భవనాలు, మనిషి మనిషికి కానరాని గేటెడ్ కమ్యూనిటీ విల్లాలని నమ్మబలికే ప్రచారం ఊపందుకునేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలూ తెరవెనక జరిగాయి. మానవ సంబంధాల కంటే మార్కెట్ వ్యూహాలే ముఖ్యమనే వాతావరణం తెలంగాణలో సాక్షాత్కరించింది. ఉమ్మడి పాలనలోనూ లేనంతగా ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలపై గడచిన దశాబ్దకాలంలో పాలకులు ఉక్కుపాదం మోపారు. తమ దారికి రాని మీడియా సంస్థలను అనతి కాలంలోనే అనుయాయుల చేత కొనుగోలు చేయించారు. పాదాక్రాంతమైన మీడియా సంస్థలైతే ప్రభుత్వ సానుకూల ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్స్ అయ్యారు. ఎందరో నిబద్ధత గల పాత్రికేయులూ పరిమిత స్వేచ్ఛకే పరిమితం కావాల్సివచ్చింది.
నాయకులు ప్రజలకు అందుబాటులో లేకపోవడం, సామాన్య జనానికి పాలకుల దర్శనమే కరువైపోవటం జరిగిపోయాయి. తొమ్మిదేళ్ళ పాటు అహంతో ప్రభుత్వం అనుసరించిన ఈ విధి విధానాలు పాలనపట్ల కంటే పాలకుల పట్ల వ్యతిరేకతకు దారితీశాయి. పాలకుడికి, ప్రజలకు మధ్య ఏర్పడిన ఈ అగాథంలోకి విపక్షాలు ప్రవేశించటం, అతి తక్కువ సమయంలో పౌర సమాజపు మద్దతును కూడగట్టుకోవటం జరిగిపోయాయి. పౌర సమాజపు చొరవ ఉద్యోగులు, రైతాంగం, బహుజన, దళిత, ఆదివాసీ, నిరుద్యోగ వర్గాలను కదిలించటం, ఈ వర్గాలన్నీ ఓటు హక్కును చైతన్యవంతంగా వినియోగించుకోవటంతో తెలంగాణలో కొత్త పాలకవర్గం కొలువుదీరటానికి మార్గం సుగమమైంది. ఈ సానుకూల మార్పుకు కారణమైన పౌరసమాజం గత దశాబ్ద కాలపు అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన సమయమిది. నూతన ప్రభుత్వానికి నూతన దశ, దిశలను తమ పరిమితుల మేరకు నిర్దేశిస్తూ, ప్రజలు ఆకాంక్షించిన రీతిలో తెలంగాణ పునర్మిర్మాణం జరిగేందుకు పౌర సమాజం పనిచేస్తేనే పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణకు అర్థం, పరమార్థం చేకూరతాయి.
గోరంట్ల శివరామకృష్ణ, సీనియర్ జర్నలిస్టు