Telangana State Watered With Negligence : కరువు బాధిత జిల్లా మహబూబ్ నగర్‌తో బాటు నల్గొండ, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని బీళ్లువారిన నేలకు నీళ్లు పారించేందుకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. అయితే గత బీఆర్ఎస్ సర్కారు నిర్లక్ష్యం కారణంగా అది ఇప్పుడు అటకెక్కే ప్రమాదంలో పడింది. సమాచార హక్కు కింద ఇనగంటి సురేష్ దాఖలు చేసిన పిటిషన్‌కు జవాబిస్తూ కేంద్రమిచ్చిన సమాధానం పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు మీద కమ్ముకుంటున్న నీలినీడలకు సూచనగా కనిపిస్తోంది.
2013లో మహబూబ్ నగర్ జిల్లాలోని 7 లక్షల ఎకరాలకు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో 3 లక్షల ఎకరాలకు సాగునీరుతోపాటు, తాగునీరు అందించేందుకు పూనుకున్నారు. ప్రతిరోజు 2 టీఎంసీల చొప్పున జూరాల ప్రాజెక్టుకు వచ్చే వరద జలాల నుంచి 35 రోజులలో 70 టీఎంసీలు ఎత్తిపోతల పథకాన్ని రూపకల్పన చేశారు. ఈ పథకానికి సుమారు రూ.9 వేల కోట్లు కేటాయిస్తూ పరిపాలన అనుమతి ఇచ్చారు. మహబూబ్ నగర్ జిల్లాలోని 38 మండలాలు, రంగారెడ్డి జిల్లాలో 13, నల్లగొండ జిల్లాలో 2 మండలాల్లో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా రూపొందించారు. ఈ పథకంలో అన్ని లిఫ్టులు పనిచేయడానికి 2,350 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుందని అంచనావేసి ఉమ్మడి రాష్ట్రంలో చివరి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక కేసీఆర్ ఈ పథకాన్ని రీడిజైన్ చేశారు. 2015లో నాటి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ.. 2018లోగా ప్రాజెక్టును పూర్తి చేసి పాలమూరు రైతుల కాళ్లను కడుగుతానని చెప్పారు. కానీ, ఈ స్కీమ్ పూర్తి చేయుటకు నిధులు మాత్రం పూర్తి విడుదల చేయలేదు. గత ఎన్నికల వేళ హడావుడిగా సెప్టెంబరు 13న ఒక పంపును ప్రారంభించి మమ అనిపించారు.
Read More:ఆగని వలసలు..!
అయితే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 2024 జనవరి 4న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కలిసి దీనిని జాతీయ ప్రాజెక్టుగా పరిగణించాలని కోరారు. సీఎం ఇచ్చిన విజ్ఞప్తిని జనవరి 11న జలవనరుల శాఖ ప్రాజెక్టు అనుమతుల విభాగాన్ని ఆరా తీయగా అసలు సంగతి బయటికొచ్చింది. గోదావరి నీటిని కృష్ణాకు మళ్లించాలనే ప్రతిపాదన ట్రిబ్యునల్ పరిశీలనలో ఉన్నందున, గతంలో ఆయా ప్రాజెక్టులకు కేటాయించిన కృష్ణా జలాల కేటాయింపులను పున: పరిశీలించాలని, ఇది పూర్తయిన తర్వాతే నూతన ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపు జరపటం సాధ్యమవుతుందని, ట్రిబ్యునల్ దీనిని విచారిస్తున్నందున ఈ లోపు ఈ విషయంలో వేలు పెట్టలేమని జలవనరుల శాఖకు జవాబు వచ్చింది.
అయితే.. దీనిపై దాఖలైన ఆర్టీఐ పిటిషన్ సందర్భంగా 2015లో శంకుస్థాపన జరిగిన ఈ ప్రాజెక్టు డీపీఆర్‌ను తెలంగాణ ప్రభుత్వం 2022 సెప్టెంబరు 30న కేంద్రానికి పంపిందని తేలింది. నీళ్లు, నిధులు,నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం 2015లోనే కేంద్రానికి డీపీఆర్‌ను పంపి ఉంటే ఈ పాటికి అన్ని రకాల అనుమతులతో బాటు నీటి కేటాయింపులూ జరిగేవి. అంటే.. సుమారు సుమారు ఏడేళ్ల పాటు ఈ ప్రాజెక్టును కేసీఆర్ సర్కారు కావాలనే కేంద్రానికి పంపలేదని అర్థమవుతోంది.
Read More: అది బీజేపీ తరం కాదు: రాహుల్ గాంధీ
దీనికి తోడు 2023 అక్టోబరులో కృష్ణా జలాల పంపిణీ మీద నియమించిన ట్రిబ్యునల్‌కు కేంద్రం ఇచ్చిన ఆదేశాల మేరకు ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకు ప్రాజెక్టు డీపీఆర్‌ను ఆమోదించటం గానీ, నీటి కేటాయింపులు చేయటం గానీ సాధ్యం కాదు. తాజాగా నడుస్తున్న కృష్ణా జలాల వివాదం మీద ట్రిబ్యునల్ తుదతీర్పును కనీసం అయిదారేళ్ల సమయం పట్టేలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు అప్పటివరకు నీటి కేటాయింపులు సాధ్యం కాకపోవచ్చు.