SSC result 2024 telangana(Telangana news today): తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. బాలికల్లో ఉత్తీర్ణతా శాతం 93.23 ఉండగా.. బాలురు 89.42 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి రెగ్యులర్ పరీక్షల్లో 91.31 శాతం ఉత్తీర్ణత నమోదైంది. పదో తరగతి విద్యార్థులు తమ ఫలితాల కోసం ఈ లింక్ https://results.bsetelangana.org/ లేదా https://results.bse.telangana.gov.in/ పై క్లిక్ చేసి రూల్ నెంబర్ ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు.
ఎస్ఎస్‌సీ పరీక్షలకు ఈ ఏడాది మొత్తం(రెగ్యులర్, ప్రైవేటు) 5,05,813 మంది విద్యార్థులు హాజరయ్యారు. గతేడాది ఈ సంఖ్య 4,91,862గా ఉన్నది. బాలుర కంటే బాలికలు 3.81 శాతం అధికంగా ఉత్తీర్ణులయ్యారు. ఇక రాష్ట్రంలో 3927 పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఆరు స్కూల్స్ మాత్రం జీరో పర్సెంట్ సాధించాయి. ఈ ఆరు పాఠశాల్లో నాలుగు ప్రైవేట్, రెండు ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయి. తెలంగాణ గురుకుల పాఠశాలలు తమ సత్తా చాటాయి. 98.71 శాతం ఉత్తీర్ణతతో భళా అనిపించాయి. టీఎస్ రెసిడెన్షియల్, బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, మైనారిటీ రెసిడెన్షియల్, మోడల్ స్కూల్స్, కేజీబీవీ పాఠశాలలు కూడా రాష్ట్ర సగటు ఉత్తీర్ణత శాతం కంటే అధికంగా సాధించడం గమనార్హం.
మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. తెలుగు మీడియం విద్యార్థుల కంటే ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఎక్కువగా ఉత్తీర్ణులయ్యారు. తెలుగు మీడియం విద్యార్థులు 84790 మంది పరీక్ష రాశారు. ఇందులో 80.71 శాతం మంది పాస్ అయ్యారు. 4,01,458 మంది ఆంగ్ల మాధ్యమ విద్యార్థులు పరీక్షలు రాయగా.. 93.74 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. 7508 మంది ఉర్దూ మీడియం విద్యార్థులు పరీక్ష రాయగా 6119 మంది పాస్ అయ్యారు.
Also Read: ఛత్తీస్‌గడ్ అడవుల్లో మరోసారి పేలిన తూటా.. ఏడుగురు మావోయిస్టులు మృతి
ప్రథమ భాషలో విద్యార్థులు 97.12 శాతం ఉత్తీర్ణత సాధించగా.. కనిష్టంగా సామాన్య శాస్త్రంలో 96.60 శాతం, గణితంలో 96.46 శాతం ఉత్తీర్ణత సాధించారు.
ఫెయిలైన వారికి సూచన:
పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు 03.06.2024 నుంచి 13.06.2024 మధ్య జరుగును. ఫలితాలు వెలువడ్డ స్వల్ప కాలంలోనే ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఫెయిలైన విద్యార్థులు తమ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాల కోసం ఎదురుచూడకుండా.. ఈ పరీక్షలు రాయడం ఉత్తమం. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాలు రావడానికి ముందే ఈ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి.