– తెలంగాణలో మూతపడనున్న 450 థియేటర్స్
– నష్టాల తగ్గించుకునేందుకే అంటున్నయాజమాన్యాలు
Telangana Single Theaters To Be Closed For Ten Days Due To Poor Occupancy: వేసవి సెలవుల్లో సినిమా ప్రియులకు షాక్.. తెలంగాణలోని సుమారు 450 సింగిల్ స్క్రీన్ థియేటర్స్ పదిరోజుల పాటు మూతబడనున్నాయి. మంచి సినిమాలేవీ లేకపోవటం, ఎన్నికల హడావుడి, వేసవి కారణంగా తగ్గిన ప్రేక్షకులు, పెరిగిన విద్యుత్ బిల్లులతో వస్తున్న నష్టాలను కొంతైనా తగ్గించుకోవటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు థియేటర్స్ యజమానులు తెలిపారు. దీంతో ఈ శుక్రవారం నుంచి రాజధాని హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లోని సింగిల్ స్క్రీన్ థియేటర్లు పది రోజు పాటు మూతపడనున్నాయి.
మల్టీఫ్లెక్స్‌ల రాకతో కుదేలైన సింగల్ స్క్రీన్ థియేటర్లకు ప్రేక్షకులు రావటం బాగా తగ్గిపోయింది. కొవిడ్ సంక్షోభం తర్వాత కూడా సింగిల్ థియేటర్లకు జనం రావటానికి ఆసక్తి చూపకపోవటంతో ఈ థియేటర్స్‌కి ఆదాయం బొత్తిగా తగ్గిపోయింది. ఇదే సమయంలో ఖర్చులు మాత్రం రోజురోజుకూ పెరుగుతూనే పోతున్నాయి. ప్రస్తుతం పెద్ద హీరోల సినిమాలు లేకపోవటం, వేసవి సెలవుల్లో పట్ణణ, నగరాల నుంచి లక్షలాది మంది యువత పల్లెటూళ్లకు చేరటం, తెలుగు రాష్ట్రాల్లోని ఎన్నికల వాతావరణంతో గత రెండు నెలలుగా థియేటర్లన్నీ బోసిపోయాయి. మరోవైపు మల్టీఫ్లెక్స్‌లలో మెరుగైన సౌకర్యాలు, మెరుగైన స్క్రీనింగ్, విశాలమైన పార్కింగ్, షాపింగ్ సదుపాయం, చిన్నారులకు గేమింగ్ సదుపాయాలు ఫ్రీగా ఉండటంతో ప్రేక్షకులు మల్టీఫ్లెక్స్‌లకే మొగ్గు చూపుతున్నారు. ఇదే సమయంలో పదిమంది ప్రేక్షకులు వచ్చినా సింగిల్ స్క్రీన్ థియేటర్స్‌లో వాళ్ళ కోసం ఏసీ వేయాల్సిందేనని, ఆదాయం లేకున్నా సౌకర్యాలకయ్యే ఖర్చు బాగా పెరిగి, నష్టాలు మూటకట్టుకుంటున్నామని సింగిల్ థియేటర్స్ నడిపేవారు వాపోతున్నారు. ఇకనైనా నిర్మాతలు తమ అద్దెలు పెంచి, తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
Also Read:పొట్టి డ్రెస్‌లో మతిపోగొడుతున్న నటి రష్మిక
‘తెలంగాణలోని సుమారు 450 సింగిల్ స్క్రీన్ థియేటర్స్‌ని 10 రోజుల పాటు మూసివేయాలని నిర్ణయించుకున్నాం. సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఈ సీజన్‌లో సరిగ్గా నడవటం లేదు, సినిమా వేస్తే రూ.6,000 నష్టం వస్తోంది. అదే… థియేటర్ మూసేస్తే ఆ నష్టం రూ.4,000కే పరిమితమవుతుంది. అందుకనే థియేటర్స్‌ని 10 రోజుల పాటు మూసేస్తున్నాం’ – విజయేందర్ రెడ్డి, అధ్యక్షులు, తెలంగాణ సింగిల్ స్క్రీన్ థియేటర్ ఓనర్స్ అసోసియేషన్
‘ ఐపీఎల్, ఎన్నికలు, వేసవికి తోడు మంచి సినిమాలు లేకపోవటంతో ప్రేక్షకులు థియేటర్స్ కి రావటం లేదు. ఏదో ఒక సినిమా వేసి థియేటర్ నడుపుదామంటే.. కరెంట్ బిల్లులు, నిర్వహణ ఖర్చులు బాగా పెరిగిపోయాయి. దీంతో కొన్నాళ్లైనా థియేటర్ మూసేస్తే, ఎంతోకొంత నష్టమైనా తగ్గుతుందని ఈ నిర్ణయం తీసుకున్నాం’ – శ్రీధర్ వంకా, ఉపాధ్యక్షులు, తెలంగాణ, ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్