– గెలుపుగుర్రాన్ని ఎంపిక చేసిన అధిష్ఠానం
– సర్వే ద్వారా అభ్యర్థి పేరు ఖరారు
– సామాజిక సమీకరణాలే ప్లస్
– గెలిచి తీరాలనే దిశగా కాంగ్రెస్ వ్యూహాలు
– అభ్యర్థి వేటలో విపక్షాలు
Telangana Politics Cantonment Congress Candidate Sriganesh: లోక్‌సభ ఎన్నికలతో బాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీటుకు జరగనున్న ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ నారాయణన్ శ్రీగణేష్ పేరును ఖరారు చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచిన దివంగత గద్దర్ కుమార్తె వెన్నెల కేవలం 16 శాతం ఓట్లతో మూడో స్థానానికే పరిమితం కావటంతో కొత్త అభ్యర్థి ఎంపిక అనివార్యంగా మారింది. తొలుత సాయన్న కుమార్తె నివేదితను కాంగ్రెస్ తరపున బరిలో దించాలని భావించిన కాంగ్రెస్, ఆ తర్వాత ఆ ప్రతిపాదనను విరమించుకుంది. ఈ క్రమంలోనే బీజేపీ నేత శ్రీగణేశ్‌ను పార్టీలో చేర్చుకుంది. శ్రీగణేష్‌తో బాటు కాంగ్రెస్ నేతలు అద్దంకి దయాకర్, పిడమర్తి రవి,సర్వే సత్యనారాయణ, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత పేర్లు కూడా పరిశీలించిన అధిష్ఠానం ఇక్కడ సర్వే ద్వారా అభ్యర్థిని ఖరారు చేసింది. ఈ స్థానంలో అరవ మాల సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉన్నాయని, కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు టీం చేపట్టిన నాలుగు సర్వేల్లోనూ అదే సామాజిక వర్గానికి చెందిన శ్రీగణేష్‌కే ఎక్కువ విజయావకాశాలున్నట్లు తేలటంతో కాంగ్రెస్ ఆయన పేరును ప్రకటించింది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన శ్రీగణేష్ ఏకంగా 42 వేల ఓట్లు సాధించి రెండవ స్థానంలో నిలిచారు. 2018లోనూ ఆయన ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా నిలవటం, అటు బీజేపీ మద్దతుదారుల ఓట్లనూ పొందే అవకాశం ఉండటం, స్థానికంగా నివాసముంటూ, అత్యంత సాదాసీదా జీవనశైలితో జనంతో మమేకమవ్వటం ఆయనకు అదనంగా కలిసొచ్చే అంశాలుగా కాంగ్రెస్ భావించింది. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతితో కంటోన్మెంట్ స్థానం ఖాళీ అయిన కారణంగా వచ్చిన ఈ ఉపఎన్నికలో ఎట్టి పరిస్థితిలో విజయం సాధిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించటం, క్షేత్రస్థాయిలోని కీలక నేతలంతా కలిసి కట్టుగా పనిచేయాలని సూచించటాన్ని బట్టి ఈ స్థానంలో గెలుపును కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: ఆ రావు.. ఈ రావు.. రాజీ.. రాగాలు..!
కంటోన్మెంట్‌లో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికే తాను పార్టీ మారానని, కాంగ్రెస్ అధిష్ఠానం తనపై నమ్మకముంచి సీటు కేటాయించినందుకు శ్రీగణేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ స్థానంలో కాంగ్రెస్ విజయం, మల్కాజ్‌గిరి ఎంపీ సీటునూ కైవశం చేసుకునేందుకు దోహదం చేయనుందని ఆయన అభిప్రాయపడ్డారు. అటు బీఆర్ఎస్ కూడా దీటైన అభ్యర్థి అన్వేషణలో ఉంది. ఈ క్రమంలో ఈ సీటుకోసం గజ్జెల నాగేశ్, ఎర్రోళ్ల శ్రీనివాస్, మన్నె కృషాంక్‌లు పోటీ పడుతుండగా, సర్వే ద్వారా అభ్యర్థిని చేపట్టేదిశగా ఆ పార్టీ అడుగులు వేస్తోంది. దశాబ్దానికి పైగా పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న శ్రీగణేష్ కాంగ్రెస్‌లో చేరి ఏకంగా అభ్యర్థిగా బరిలో దిగటంతో బిత్తరపోయిన బీజేపీ, ఈ స్థానంలో కొత్త అభ్యర్థిని వెతుక్కునే పనిలో పడింది.