- పార్లమెంట్ ఎన్నికలలో కీలక భూమిక పోషిస్తున్న మైనారిటీ ముస్లింలు
- 43 శాతం ముస్లింలు ఉండేది హైదరాబాద్ లోనే
- బీజేపీకి వ్యతిరేకత తెచ్చిన ముస్లిం రిజర్వేషన్ వ్యాఖ్యలు
- కమలం తో తమకు కష్టాలే అని భావిస్తున్న మైనారిటీ ముస్లింలు
- బీఆర్ఎస్ హయాంలో అటకెక్కిన 12 శాతం ముస్లిం రిజర్వేషన్లు
- ముస్లింలకు అమలు కాని హామీలు
- కాంగ్రెస్ పార్టీతోనే తమకు రక్షణ అని భావిస్తున్న ముస్లిం సంఘాలు
- దేశంలోనే కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్న ముస్లిం మైనారిటీలు
- రాజకీయ విశ్లేషకుల సర్వేలో బయలపడ్డ ఆసక్తికరమైన అంశాలు
Telangana Muslim Minority support to congress Lok Sabha:
తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పటిదాకా అన్ని పార్టీలు ఎవరి లెక్కలు వారివి వేసుకుంటూ గెలుపు ధీమాతో ఉన్నారు. అయితే తెలంగాణలో ఈ సారి మైనారిటీ ముస్లిం ఓట్లే కీలకం కానున్నాయి. కొన్ని చోట్ల ఫలితాలను తారుమారు చేసే స్థాయిలో ఉన్నారు మైనారిటీ ముస్లింలు. సాధారణంగా పాతబస్తీ ఎంఐఎం ఓటర్ల మద్దతు ఎవరికిస్తారో వాళ్లే ఇప్పటిదాకా గెలుస్తూ వచ్చారు. అయితే లోక్ సభ బరితో ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మూడూ హోరాహోరీ తలపడనున్నాయి. బీజేపీని ముస్లింలు ఎవరూ నమ్మే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ మధ్య ఆ పార్టీ పెద్దలే ముస్లిం రిజర్వేషన్లు ఎత్తివేస్తామంటూ ప్రచారం చేయడం ఆ పార్టీకి మైనారిటీల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురుకానుంది. ఇక బీఆర్ఎస్ పదేళ్లుగా చెబుతూ వస్తున్న ముస్లిం రిజర్వేషన్లు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ఇక కొద్దో గొప్పో కాంగ్రెస్ వైపే మైనారిటీలు మొగ్గు చూపుతున్నారని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.
6-8 నియోజకవర్గాలలో మైనారిటీల ప్రభావం
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని ఎంఐఎం ప్రాతినిధ్యం వహిస్తున్న పాతబస్తీ మినహాయిస్తే రాష్టంలోని 6 నుంచి 8 నియోజకవర్గాలలో ముస్లిం మైనారిటీ ఓటర్లు అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో ఉన్నారు. హైదరాబాద్‌లో అత్యధికంగా సుమారు 43 శాతం ముస్లిం మైనారిటీలు ఉంటే ఆదిలాబాద్‌లో దాదాపు 38 శాతం, కరీంనగర్‌లో 21 శాతం, ఖమ్మంలో 16 శాతం, మహబూబ్‌నగర్‌లో 34 శాతం, నల్గొండలో 20 శాతం, నిజామాబాద్‌లో 38 శాతం, వరంగల్‌లో 26 శాతం ముస్లింలు ఉన్నారు. వీరు ఎన్నికల్లో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 8 పార్లమెంట్ స్థానాలలో ముస్లిం మైనారిటీ జనాభా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంది. 5 నియోజకవర్గాల్లో 10 శాతం కంటే ఎక్కువ ముస్లిం మైనారిటీలు ఉన్నారు. అందుకే రాజకీయ పార్టీలు ముస్లింలను ఆకట్టుకోడానికి విశ్వయత్నాలు చేస్తున్నాయి.
మైనారిటీ ఓట్లు కీలకం కానున్న నియోజకవర్గాలు
రాష్ట్రంలో మైనారిటీలు అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే ప్రాంతాల్లో జూబ్లీ హిల్స్, రాజేంద్ర నగర్, ఖైరతాబాద్, శేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్, ముషీరాబాద్, అంబర్‌పేట, సికిందరాబాద్, సనత్‌నగర్, కంటోన్మెంట్, ఎల్‌బి నగర్, నిజామాబాద్ అర్బన్, బోధన్, ముధోల్ , మహబూబ్ నగర్, ఆదిలాబాద్, వరంగల్ ఈస్ట్, నిర్మల్, భాన్సువాడ, కరీంనగర్, జహీరాబాద్, వికారాబాద్, ఖానాపూర్, కామారెడ్డి, ఖమ్మం, మహేశ్వరం, సంగారెడ్డి, తాండూరు, గోషా మహల్ ఉన్నాయి.
ముస్లిం ఓట్ల కోసం కాంగ్రెస్ గాలం
రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ వాతావరణంలో కాంగ్రెస్ ముస్లిం మైనారిటీ ఓటర్లను ఆకట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ముస్లిం డిక్లరేషన్ ప్రకటించి ముస్లిం మైనారిటీలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ హామీలను ముస్లింలు ఎంతవరకు నమ్ముతారనేది ప్రశ్నగా మిగిలింది. దీనికి ప్రధాన కారణం కాంగ్రెస్, అధికారంలో ఉన్నపుడు ఉమ్మడి రాష్ట్రంలో మైనారిటీ బడ్జెట్ నామమాత్రంగా ఉండేది. అది కూడా ఖర్చు అయ్యేది కాదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2013-14లో 23 జిల్లాలకు రాష్ట్ర బడ్జెట్‌లో మైనారిటీలకు కేటాయించింది మాత్రం కేవలం రూ.501.38 కోట్లు మాత్రమే. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014-15లో కేవలం 10 జిల్లాలకు రూ.1,030 కోట్లు కేటాయించారు. 2023-24 బడ్జెట్ నాటికి మైనారిటీ సంక్షేమానికి బిఆర్‌ఎస్ ప్రభుత్వం కేటాయింపులు 2,200 కోట్లకు చేరాయి. కాకపోతే బీజేపీని గద్దె దించితేనే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని…అప్పుడు ముస్లింలకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని భావించి ఈ సారి ముస్లిం ఓటు బ్యాంకు కాంగ్రెస్ కే లభించేలా ఉందని రాజకీయ పండితుల అంచనా.