– తెలంగాణ ఎన్నికల ప్రచారానికి దూరంగా సినీ తారలు
– రోజురోజుకీ తగ్గిపోతున్న సినీ గ్లామర్
– వాడుకుని వదిలేస్తున్నారని భావనలో ఉన్నారా?
– ఏపీలో యాక్టివ్‌గా బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, రోజా
– తెలంగాణలో పెద్దగా ప్రభావం చూపని సినీ తారల ప్రచారం
– కొన్నాళ్లుగా సైలెంట్‌గా విజయశాంతి
– పార్టీలన్నీ చుట్టేస్తున్న బాబూ మోహన్
No Cinema Stars campaign in T.Politics Not Interested :ఒకప్పుడు దక్షిణాదిలో ఎంజీఆర్, ఎన్టీఆర్ రాజకీయాలను శాసించారు. ఆ తర్వాత పార్టీలు పెట్టి ప్రజలలోకి వెళదామనుకున్న సినీ నటులంతా దాదాపు ఫెయిల్ అయ్యారు. కానీ, సినీ తారలతో ప్రచారం కొందరికి కలిసొచ్చింది. క్రమంగా ప్రచారాలు వెగటు పుట్టాయి. సినిమా వాళ్లు కూడా రాజకీయ నాయకులు తమని వాడుకుని వదిలేస్తున్నారనే భావనలో ఉన్నారనే టాక్ ఉంది. అందుకేనేమో ఈసారి తెలంగాణ ఎన్నికలలో సినీ సందడి ఎక్కడా కనిపించడం లేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక, రాజకీయాల్లో సినీ తారల సందడి తగ్గుతూ వస్తోంది. విజయశాంతి, బాబూ మోహన్ లాంటి ఒకరిద్దరు యాక్టివ్ పాలిటిక్స్‌లో ఉన్నా, తెర ముందుకు వచ్చి వాళ్లు చేస్తున్నది అంతంత మాత్రంగానే ఉంది. బండ్ల గణేష్ లాంటి వాళ్లు పరోక్ష రాజకీయాలతో వార్తల్లో నిలుస్తున్నప్పటికీ వాళ్ల ప్రభావం కూడా అంతగా లేదనే చర్చ ఉంది.
రాజకీయాల్లో రాణించని వారెందరో!
2014లో బాబూ మోహన్ ఆందోల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచినప్పటికీ 2018లో ఓటమిపాలయ్యారు. 2023 ఎన్నికలో బీజేపీ తరపున పోటీ చేసి కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహ చేతిలో ఓడిపోయారు. విజయశాంతి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కానీ, బయటకు రావడం లేదు. 2018లో వైరా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సినీ నటి రేష్మా రాథోడ్ నోటా కంటే తక్కువ ఓట్లను పొంది ఓటమిపాలయ్యారు. 2009లో జయసుధ సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ టిక్కెట్‌పై పోటీ చేసి శాసనసభకు ఎన్నికయ్యారు. అదే సమయంలో జయప్రద ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి సమాజ్‌వాదీ పార్టీ టిక్కెట్‌పై ఎన్నికయ్యారు. తర్వాత వీళ్లిద్దరూ ఓటమి పాలయ్యారు. రాజకీయాల్లో యాక్టివ్‌గా లేరు. మెగాస్టార్ చిరంజీవి సహా ఇంకొందరు నేతలు రాజకీయాల్లో రాణించాలనుకున్నా వర్కవుట్ కాలేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల విషయానికి వస్తే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీలో బాలకృష్ణ, వైఎస్సార్‌సీపీలో ఆర్కే రోజా వంటి సినీతారలు మాత్రమే బరిలో ఉన్నారు.
ప్రచారానికా.. మేం రాలేము!
ఒకప్పుడు తారలు ప్రచారం చేస్తే ఓట్లు రాలేవన్న నమ్మకం నడిచేది. కొంతమంది లీడర్లు కూడా వీరిని ప్రచారానికి తెగ వాడేవారు. కానీ, తెలంగాణలో ఇప్పుడు రాజకీయ నాయకుల కోసం ప్రచారం చేసే నటులు కరువైపోయారు. మొన్నటి అసెంబ్లీ, ఇప్పటి లోక్ సభ ఎన్నికలకు సినీతారలంతా రాజకీయ ప్రచారాలకు దూరంగా ఉన్నారు. అయితే, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు మాత్రం ఆ లోటును కాస్తో కూస్తో భర్తీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, వారి ప్రభావం కూడా తక్కువే. దీనికి చక్కటి ఉదాహరణ బీఆర్ఎస్. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ వీరిని గట్టిగా వాడేసింది. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఎక్కువగా ఉన్నవారిని ఎంపిక చేసుకుని ప్రచారం చేసింది. అయినా, ఓటమి తప్పలేదు.