– ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం
– అమల్లోకి 48 గంటల సైలెన్స్ పిరియడ్
– రేపు ఉ.8 గంటల నుంచి సా.4 గంటల వరకు పోలింగ్
– 605 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
Telangana Graduate MLC Election Campaign Ends: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సమయం దగ్గర పడుతోంది. శనివారం ప్రచారానికి తెర పడింది. దీంతో 48 గంటల సైలెన్స్ పిరియడ్ అమల్లోకి వచ్చింది. రేపు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు.
మొత్తం 4,63,839 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉండగా, 605 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. ఈ ఎన్నికల పోరులో 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాలలో గ్రాడ్యుయేట్లు ఉన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధికంగా 1,73,406 మంది ఉండగా, ఉమ్మడి ఖమ్మం జిల్లా 1,23,985 మంది, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1,66,448 మంది పట్టభద్రులకు ఓట్లు ఉన్నాయి. ప్రచారంలో పార్టీల అభ్యర్థులు విస్తృతంగా తిరిగారు. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడం కోసం బీఆర్ఎస్ తెగ ప్రయత్నిస్తోంది.
ప్రచారంలో పాల్గొన్న కేటీఆర్, హరీశ్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, బాల్క సుమన్ సహా పలువురు ముఖ్యనేతలు తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని అభ్యర్థించారు. అలాగే, అధికార కాంగ్రెస్ ఈ స్థానాన్ని దక్కించుకునే ప్రయత్నాల్లో ఉంది. ఇటు బీజేపీ కూడా గట్టి నమ్మకంతో కనిపిస్తోంది.
మొత్తంగా ఎవరికి వారు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ రోజు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని పోలీసులు తెలిపారు. అలాగే, మూడు జిల్లాల్లో ఆ రోజున ప్రత్యేక సెలవు ప్రకటించారు ఆయా జిల్లాల కలెక్టర్లు.