– మల్లారెడ్డి ఇంకా మంత్రి అనుకుంటున్నారు
– నోరు ఉంది కదా అని వాగితే ఊరుకోం
– సర్వే నెంబర్ 82లో 600 గజాల భూమిని 2015లోనే కొన్నా
– సుధామ దగ్గర నుంచి నాతోపాటు ఆరుగురు సేల్ డీడ్ చేసుకున్నాం
– నా భూమిని శ్రీనివాస్ రెడ్డికి అమ్మేశాను
– వివాదాన్ని సెటిల్ చేయమని గతంలోనే మల్లారెడ్డిని కోరాం
– వారికి సంబంధం లేకపోయినా భూమిని కబ్జా చేయాలని చూశారన్న అడ్లూరి లక్ష్మణ్
Mallareddy: జీడిమెట్ల సుచిత్రలో సర్వే నెంబర్ 82 ల్యాండ్‌కు సంబంధించి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ విషయంపై స్పందించిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ బిగ్ టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ల్యాండ్‌కు సంబంధించిన కీలక అంశాలను వివరించారు.
దౌర్జన్యంగా భూకబ్జా
‘జీడిమెట్ల పరిధిలోని సుచిత్ర ప్రాంతంలో 2015లో సర్వే నెంబర్ 82/ఈ లో 600 గజాల ల్యాండ్‌ను కొనుగోలు చేశాను. నాతోపాటు ఆరు మంది కలిసి సుధామ నుండి సేల్ డీడ్ చేసుకున్నాం. అమ్మినవారిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, మరికొందరు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. మాకు సేల్ డీడ్ చేసిన సుధామ 2000 సంవత్సరంలోనే ఆ ల్యాండ్‌ను కొనుగోలు చేశారు. అతని నుండి మేము కొనుగోలు చేశాం. సర్వే చేయమని అధికారులను కోరితే అప్పటి మంత్రిగా ఉన్న మల్లారెడ్డి అడ్డుకున్నారు. మేము శ్రీనివాస్ రెడ్డికి ఆ ల్యాండ్‌ను అమ్మేశాం. కలెక్టర్ ఇచ్చిన రికార్డ్స్ ఆధారంగా భూమి కొనుగోలు జరిగింది. ఇందుకు సంబంధించి మాకు 2016 నుండి హైకోర్టు ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఉంది. అయితే, అప్పట్లో మాజీ మంత్రి మల్లారెడ్డి తన అధికారాన్ని ఉపయోగించి ఎన్నో రోజులు దౌర్జన్యం చేశారు’ అని అన్నారు లక్ష్మణ్.
మల్లారెడ్డి నోరు పెద్దది చేస్తే ఎవరూ భయపడరు
మల్లారెడ్డి గత ప్రభుత్వం ఉన్నప్పుడు గుండాయిజం చేశారని మండిపడ్డారు. ఇందులో కేవలం 600 గజాలు మాత్రమే తనకు ఉందని, మల్లారెడ్డి నోరు పెద్దదిగా చేస్తే ఎవరూ భయపడరని స్పష్టం చేశారు. ల్యాండ్‌లోకి పోవద్దని ఇంజక్షన్ ఆర్డర్‌లో ఉన్నప్పటికీ మల్లారెడ్డి లెక్క చేయలేదని మండిపడ్డారు. భూమిలోకి దౌర్జన్యంగా వెళ్ళారని, సర్వే ప్రకారం తమ ల్యాండ్ తమకు వస్తుందని ఆశిస్తున్నామన్నారు. ‘మాకు మిగతా ల్యాండ్‌తో అనవసరం. కాంగ్రెస్ పార్టీ మీద నా మీద బురద చల్లడం కరెక్ట్ కాదు. 2015లో ఈ ల్యాండ్ సర్వే అవసరం లేదని మల్లారెడ్డి అడ్డుకున్నారు. మా దగ్గర ఉన్న డాక్యుమెంట్లు కరెక్ట్ కాకపోతే ఈ భూమి వదిలిపెడతాం. ల్యాండ్ విషయంలో కోర్టు నోటీసులు జారీ చేసినా మల్లారెడ్డి ఎందుకు లెక్క చేయడం లేదు. త్వరలో ఆయన దొంగతనం, బండారం బయటపడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం ప్రకారం పోతుంది. మల్లారెడ్డి ఇంకా మంత్రి పదవిలో ఉన్నట్టు ఊహించుకుంటున్నారు. మేము చట్టాన్ని గౌరవిస్తాం. మల్లారెడ్డిలాగా వ్యతిరేకించం. ఈ విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి మల్లారెడ్డి అరాచకాలను తీసుకెళదాం అనుకుంటున్నాం. ఆయన కాంగ్రెస్ పార్టీపై నోరు ఉంది కదా అని తప్పడు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే వివాదాస్పదంగా ఉన్న ఈ ల్యాండ్ వివాదంలో అనేకసార్లు మల్లారెడ్డిని, రాజశేఖర్ రెడ్డిని కలిసి సెటిల్ చేయమని అడిగాను. అసలు వాళ్లకు అక్కడ ల్యాండే లేనప్పుటికీ దౌర్జన్యంగా కబ్జా చేస్తున్నారు’ అని విమర్శలు చేశారు అడ్లూరి లక్ష్మణ్.