Telangana Farmers Suicide EX cm KCR Crocodile Tears Says: ఇటీవల జనగాం జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేసిన యాత్రలో చాలా చోట్ల రైతుల ఆత్మహత్యల గురించి విని ఆయన కన్నీటి పర్యంతమైనట్లు పలు పత్రికల్లో కథనాలు వచ్చాయి. అయితే, పదేళ్ల తన పాలనలో రాజధాని నడిబొడ్డున ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రగతి భవన్‌లోకి, నగర శివారులో ఆయన నిర్మించుకున్న ఫామ్‌హౌస్ దరిదాపుల్లోకి మనుషులనే గాక కనీసం కుక్కలను కూడా రానివ్వని రీతిలో ఆయన నియంతృత్వ పాలన సాగింది. కేసీఆర్ పాలనాకాలంలో తీసుకున్న నిర్ణయాల వల్ల కుడిఎడమ దగాకు గురైన రైతులు, కవులు, రైతుకూలీలు, నిరుద్యోగుల వంటి ఎన్నో వర్గాల ప్రజలు ఆ పాడుకాలపు జ్ఞాపకాలను ఇంకా మర్చిపోలేదు. తాజా యాత్రలో విపక్ష నేతగా మారిన కేసీఆర్.. ఎన్నికలను చేజిక్కించుకునేందుకు గుంటనక్క మాదిరిగా చనిపోయిన రైతుల మృతదేహాలను చూసి కన్నీటి పర్యంతం కావటం చూసి తెలంగాణ ప్రజలు ఆశ్చర్యపోయి, ముక్కున వేలేసుకుంటున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కేవలం 120 రోజులు మాత్రమే అయింది. అటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం పదవి నుంచి తప్పుకున్న రోజు నుంచే రైతుల ఆత్మహత్యలను లెక్కించే పనిలో పడ్డారు. తన బిడ్డ కవిత మద్యం కుంభకోణంలో తీహార్ జైలులో ఉన్నప్పటికీ, ఆమెను పరామర్శించటానికి ఢిల్లీ వెళ్లకుండా కేసీఆర్ చనిపోయిన రైతుల కుటుంబాల సభ్యులను పరామర్శించటానికి పర్యటన చేపట్టటం చాలా మంచి నిర్ణయమే. అయితే, కాలం కలిసి రానప్పుడు తాడే పామై కరచినట్లుగా, ఫోన్ టాపింగ్ వ్యవహారం బయటకి వచ్చింది. దీని విచారణలో తవ్విన కొద్దీ బిత్తరపోయే వాస్తవాలు బయటికొస్తున్నాయి. తీగ లాగితే డొంక కదిలినట్లు నాటి పోలీసు అధికారుల మనీ లాండరింగ్ బాగోతాలు, విపక్ష నేతలు, సినీనటులు, వ్యాపారులు, కార్పొరేట్ సంస్థల యజమానులను ఖాకీలు వేధించిన తీరు, ఊహకందని దుర్మార్గాలు బయటకి రావటంతో ‘బంగారు తెలంగాణ’లో మనకు తెలియకుండా ఇన్ని జరిగాయా అనుకుని ప్రజలు బిత్తరపోతున్నారు. నాటి సీఎం సొంత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులే ఈ మొత్తం వ్యవహారంలో నిందితులుగా ఉండటం అనుకోకుండా జరిగిన పరిణామేమీ కాదు. ‘మా వాడు’ అంటూ పదవీ విరమణ చేసినా, తమను ఏరికోరి ఎంపిక చేసిన పెద్దసార్ వెనకుండబట్టే ఇన్ని పనులు చేయగలిగామని నిందితులు తాజాగా జరుగుతున్న విచారణలో అసలు నిజాలు వెల్లడిస్తున్నారు. ఇంత జరుగుతున్నా.. ఈ వ్యవహారంతో తనకు గానీ, పదేళ్ల పాటు అన్నీ తానై వ్యవహరించిన తన కుమారుడికి గానీ ఏ సంబంధమూ లేదని మళ్లీ పార్లమెంటు ఎన్నికల ప్రచారం పేరుతో కేసీఆర్ జనాల్ని మభ్యపెట్టి ఓట్లు దండుకునేందుకు మళ్లీ రైతు మంత్రం జపిస్తూ, పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు సరికొత్త రాజకీయ వ్యూహాలు రచిస్తున్నారు.
Also Read: కాంగ్రెస్ పంచతంత్రం, ఎన్నికల మంత్రం
గత పదేళ్లుగా కేసీఆర్ ఏనాడూ రైతుల కష్టాలను పట్టించుకోలేదు. ఈ దశాబ్దకాలంలో 8 వేలమంది రైతులు అసువులు బాసినా, ఆయన కంట కన్నీటి పొర కానరాలేదు. పండించిన పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసుకుపోగా, అక్కడ అధికారులు క్వింటాలుకు పది కేజీలు దండిగడుతున్నా దొరగారు తమాషా చూశారే తప్ప ఇదేంటని చర్యలకు పూనుకోలేదు. తెలంగాణలోని రైతులందరికీ ఉచిత ఎరువులు అని ప్రచారం చేసుకున్న నాటి పాలకుడు ఒక్క రైతుకైనా చారెడు ఎరువు ఇవ్వలేకపోయాడు. రెండు అసెంబ్లీ ఎన్నికల్లో రైతుల రుణాలను ఒక్క దఫాలో మాఫీ చేస్తానని వాగ్దానం చేసిన ఈ వీరుడు రైతుల అప్పు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నా.. ఏటా కొంత మొత్తం చొప్పున భిక్షం వేసినట్లుగా రైతుల ఖాతాల్లో వేస్తూ వచ్చారు. ఈ వేసిన మొత్తాలను బ్యాంకు అధికారులు అపరాధ రుసుము కింద జమ చేసుకుంటుంటే ఫామ్‌హౌస్‌లో జాతీయ రాజకీయాల గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు. కరోనా మహమ్మారి తెలంగాణను కుదిపేస్తున్న వేళ.. ప్రాణవాయువు అందక, ఉన్నపళాన పల్లెబాట పట్టిన నిరుపేద జనానికి కనీసం ఊరట కలిగించే ఒక్క మాట మాట్లాడకపోగా, జనం హాహాకారాలు మిన్నంటున్న వేళలోనే పాత సచివాలయాన్ని దగ్గరుండి కూలగొట్టించారు. ధరణి పేరుతో పోర్టల్ ఏర్పాటు చేసి లక్షలాది పేద రైతుల భూములను తన సొంత వర్గపు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అప్పగించారని నాడు పత్రికల్లో అనేక కథనాలు వచ్చినా, విపక్ష నేతలు నిలదీసినా ఏనాడూ కేసీఆర్ నోరువిప్పి జవాబివ్వలేదు. ముఖ్యమంత్రిగా తనకు జవాబుదారీతనం ఒకటి ఉండాలని కూడా భావించలేదు. కౌలు రైతులు చనిపోతున్నారని విపక్ష నేతలు అసెంబ్లీలో మొత్తుకున్నా.. కౌలు రైతులను గుర్తించబోమని తెగేసి చెప్పిన మాజీ సీఎం కేసీఆర్‌కు ఈ రోజు రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా అని చనిపోయిన రైతుల కుటుంబాల సభ్యులు ప్రశ్నిస్తున్నారు.
గత తొమ్మిదిన్నర ఏళ్లలో అనేక సందర్భాల్లో ప్రకృతి విపత్తుల కారణంగా రైతులు రోడ్డున పడ్డా, ఏనాడూ పావలా సాయం విదల్చని కేసీఆర్ మళ్లీ నేడు ఏ ముఖం పెట్టుకుని రైతుల పేరుతో పల్లెల్లో పర్యటిస్తున్నారో తెలంగాణ రైతాంగానికి అర్థం కావటం లేదు. మానమర్యాదలను వదిలి, జనం చీదరించుకుంటున్నా ఏమీ ఎరగనట్లుగా కోట్ల రూపాయలు వెదజల్లి ఎన్నికల ప్రచారం పేరుతో రైతు ఎజెండాను తలకెత్తుకోవటం చూసి జనం ఆశ్చర్యపోతున్నారు. నిరుపేద కౌలు రైతులు, నిరుద్యోగులు, పరిశ్రమల్లోని శ్రామిక వర్గం, వెనకబడిన, దళిత, ఆదివాసీలను అడుగడుగునా దగా చేసిన ఈ ఘనుడు.. నేడు నేరమంతా పాలకపక్షం మీద తోసేయటం చూస్తుంటే ఇంతటి బహురూపి మరెక్కడా లేడనిపిస్తోంది. తెలంగాణ వస్తే ‘కేజీ టు పీజీ’ అన్న కేసీఆర్ సీఎం కాగానే తెలంగాణ విద్యారంగాన్ని కార్పొరేట్ సంస్థలకు, తన అనుచరులైన వ్యాపారులకు కట్టబెట్టి పేద వర్గాలకు ఉన్నత విద్యను దూరం చేశాడు. ఇలాంటి వ్యక్తి మళ్లీ రాజకీయం పేరుతో జనాన్ని ఓట్లు అడగటం ఎలా కుదురుతుందని నేడు తెలంగాణ సమాజం నిలదీస్తోంది. జనంలోని ఈ అంసతృప్తిని కనీసం ఆయన సొంత మనుషులైనా ఆయనకు చెప్పి, ఇంటికి పరిమితమయ్యేలా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Also Read:కాంగ్రెస్ పార్టీ పంచతంత్రం, విజయమంత్రం
తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న ప్రజలు సర్వం కోల్పోయారు. తెలియక ఒక దుర్మార్గపు సర్కారును పదేళ్ల పాటు ఏరికోరి నెత్తిన పెట్టుకుని, అన్నీ ఉన్నా పదేళ్లలో ఏమీ లేని వారుగా తెలంగాణ ప్రజలు మిగిలిపోయారు. ఈ విపరీత పరిణామాలకు కారణమైన వ్యక్తిని రాజకీయ రంగం నుండి శాశ్వతంగా సాగనంపాల్సిన సమయం వచ్చింది. దీనివల్ల భవిష్యత్ పాలకులెవరూ కేసీఆర్ మాదిరి దుర్మార్గపు పాలన చేసేందుకు సాహసించరు. ఈ పదేళ్ల కాలంలో దగాపడిన రైతులు, నిరుద్యోగులు, ఇతర కేసీఆర్ పాలనా బాధితులంతా ఒక్కటై అడుగడుగునా ఆయనను నేడు నిలదీయాల్సిన అవసరం ఉంది. ప్రజాధనాన్ని విచ్చలవిడిగా, బాధ్యతారాహిత్యంతో వృధాచేసి, అహంకారంతో పదేళ్లపాటు దుష్టపాలన చేసిన ఇలాంటి అవినీతి పాలకుడికి విదేశాల్లో కఠినమైన శిక్షలు విధించి ఉండేవారు. కానీ, మన దేశంలో ఇలాంటి వారికి తగిన శిక్ష లేకపోవడం నిజంగా దురదృష్టం.
-ప్రొ. కూరపాటి వెంకట నారాయణ (కాకతీయ విశ్వవిద్యాలయం)