– ఎండిన ప్రతి ఎకరాకు రూ.25 వేలు
– 100 రోజుల్లో 200 మంది రైతుల ఆత్మహత్యలు
– కాంగ్రెస్ పాలనలో కరెంటే లేదన్న విపక్ష నేత
– రైతులను ఆదుకోకుంటే నిలదీస్తామని కేసీఆర్ హెచ్చరిక
Telangana Farmers Cm KCR Inspected The Withered Crops In Jangaon District: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం రోజు ప్రతిపక్ష నేత హోదాలో తొలిపర్యటన చేశారు.జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధరావత్ తండాలో ఎండిపోయిన పంటలను పరిశీలించారు. రోడ్డు పక్కనే ఎండిపోయిన వరి పొలాలను పరిశీలించి బాధిత రైతులతో ఆయన మాట్లాడారు. నీటి ఇబ్బందుల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం సూర్యాపేటలో భోజన విరామం అనంతరం కేసీఆర్ సూర్యాపేట పార్టీ ఆఫీస్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ క్రమంలో ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ హయాంలో దేశంలోనే ధాన్యం ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న తెలంగాణ అతి తక్కువ సమయంలో పతనమైందన్నారు. మిషన్ భగీరథను అమలు చేసిన రాష్ట్రంలో మళ్లీ నీళ్ల ట్యాంకర్లు, బిందెలతో రోడ్డెక్కుతున్న మహిళలు కనిపిస్తున్నారని విమర్శించారు.
తాము అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలంలో రూ.35వేలకోట్లు ఖర్చు చేసి.. విద్యుత్ వ్యవస్థను గాడిలో పెట్టామని, నాడు కరెంటు పోతే వార్త అన్నట్లుగా ఉండేదనీ, నేడు కరెంటు ఉంటే వార్త అనేకాడికి వచ్చిందని ప్రభుత్వం మీద సెటైర్లు వేశారు. తమ హయాంలో అన్ని రంగాల్లో తాము నిర్మించిన మెరుగైన వ్యవస్థలను చక్కగా సమన్వయం చేసుకోవటమూ కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకావటం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న ప్రభుత్వ అవివేకం, అవగాహనా రాహిత్యం స్పష్టంగా జనం అర్థం చేసుకుంటున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
Read Also: కాంగ్రెస్ గూటికి కడియం శ్రీహరి, కుమార్తె కావ్య
ఎండిపోయిన పంటలకు ఎకరానికి రూ.25వేల చొప్పున పరిహారం ప్రకటించాలని, లేకుంటే ధర్నాలు చేస్తామని, ఎమ్మెల్యేలను, ఎంపీలను నిలదీస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 100 రోజులలోపే 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారనీ, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. కాంగ్రెస్‌లో చేరుతున్న తమ నేతల గురించి మాట్లాడుతూ అదంతా చిల్లర రాజకీయమని కొట్టిపారేశారు. ఈ పర్యటనలో కేసీఆర్ వెంట మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పొన్నాల లక్ష్మయ్య, పెద్ది సుదర్శన్ రెడ్డి, సత్యవతి రాథోడ్, రెడ్యానాయక్ మాలోత్ కవిత, గండ్ర వెంకటరమణ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి తదితరులు ఉన్నారు.