- ఈసీ ఎన్నికల నిషేధంపై స్పందించిన కేసీఆర్
- మాండలికం అర్థం చేసుకోలేకపోయిన ఈసీ
- ఇదే తెలంగాణ భాష అంటూ కవరింగ్
- అప్పట్లో సీఎం హోదాలోనూ విపక్షాలపై విరుచుకు పడ్డ కేసీఆర్
- ఇది మా యాస అంటూ సెంటిమెంట్ పూత
- అధికారం లేకున్నా అహంకారం చావని నేత
- సీఎం రేవంత రెడ్డి పై ఎదురు దాడి
- సీఎం హోదాలో ఉన్న రేవంత్ భాషపై కేసీఆర్ సెటైర్లు
KCR explanation to E.C.action Telangana slang:
కేపీఆర్ ఎన్నికల ప్రచారాన్ని 48 గంటల పాటు నిలిపియాలని ఈసీ జారీ చేసిన ఆదేశాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. ‘‘నా మాటలను అధికారులు సరిగా అర్థం చేసుకోలేదు. స్థానిక మాండలికాన్ని పూర్తిగా తెలుసుకోలేకపోయారు. కాంగ్రెస్ నేతలు కొన్ని వ్యాఖ్యలను ఎంపిక చేసుకొని వాటిపై ఫిర్యాదు చేశారు. నా వ్యాఖ్యలకు ఆంగ్ల అనువాదం సరికాదు. కాంగ్రెస్ విధానాలు, హామీల అమల్లో వైఫల్యాన్నే ప్రస్తావించా. నా మాటలను కాంగ్రెస్ నేతలు ట్విస్ట్ చేశారు’’అని కేసీఆర్ తెలిపారు. మాండలికం గురించి శుద్ధులు చెబుతున్న కేసీఆర్ తన నోటినుండి వచ్చే బూతులనే మాండలికం అని సమర్థించుకుంటున్నారంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
అంతా మా ఇష్టం
బేకూబ్ గాళ్లు.. పనికిమాలిన దద్దమ్మలు.. సన్నాసులు.. ముండమోపులు.. నా కొడుకులు.. ఇలా చెప్పుకుంటూ పోతే బీఆర్ ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నోటి నుంచి జాలువారే పదాలు చాలానే ఉంటాయి. . బీఆర్ఎస్ అధికారంలో ఉన్నసమయంలో ఒకానొక దశలో ఇదే తెలంగాణ భాష అన్నట్లుగా సీఎం హోదాలో కేసీఆర్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. గత పదేళ్ల కాలంలో బీఆర్ ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్ మీటింగ్ అంటే మీడియాలో రాయలేనిపదాలతో సైతం ప్రతిపక్షాలపై విరుచుకుపడేవారు. ప్రతిపక్షాలు ఆయన భాషపై అభ్యంతరం చెబితే.. చావు నోట్లో తలకాయపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాను.. నాకే ఎదురు చెబుతారా అంటూ మళ్లీ ప్రతిపక్షాలపైనే విరుచుకుపడేవారు. వరుసగా రెండు సార్లు అధికారం రావడంతో కేసీఆర్, బీఆర్ ఎస్ నేతలు తాము ఏం మాట్లాడినా చెల్లబాటు అవుతుందనే స్థాయికి వెళ్లిపోయారు.
ఇదే మా భాష, యాస..
ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది. పదేళ్ల కేసీఆర్ పాలనలో అనేక ఇబ్బందులు పడ్డ ప్రజలు.. ఆయన్ను గద్దెదించారు. మరి కొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి వరుసగా బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో రేవంత్ వాడుతున్న పదజాలంపై కేసీఆర్ గగ్గోలు పెడుతున్నారు. అయితే కేసీఆర్ గతాన్ని మర్చిపోయి.. రేవంత్ అలా మాట్లాడుతున్నారు.. .. తాను ముఖ్యమంత్రిగా ఉండగా ఒక్క పొల్లుమాటైనా నా నోట వచ్చిందా అంటుండటం గమనార్హం. కత్తితో కోసినట్లుగా ఉండే మాటలు.. సిగ్గుతో తల ఎత్తుకోలేని విధంగా ఉండేలా భాష.. తన రాజకీయ ప్రయోజనంకోసం ఎవరినైనా సరే బండకేసి బాదినట్లుగా మాటలతో బాదేయగల సత్తా కేసీఆర్‌ది. మోడీ సర్కార్ పై కోపం వస్తే కమలనాథులను కసిగా తిట్టేవారు.. కాంగ్రెస్ నేతలనైతే ఇక చెప్పటానికి వీల్లేదు. . కేసీఆర్ కు ఆవేశం వచ్చినా.. ఆక్రోశం వచ్చినా ఆయన నోటి నుంచి జాలువారే పదాలు తెలంగాణ సమాజం తలదించుకునేలా ఉండేవి.. అదేం భాష అని ప్రశ్నించిన వారిపైకూడా ఎదురుదాడికి దిగేవారు.. మరో అడుగు ముందుకేసి ఇదే తెలంగాణ భాష అంటూ సర్టిఫికెట్లు సైతం ఇచ్చుకున్న ఘనత కేసీఆర్‌ది అంటున్నాయి విపక్షాలు.
తీరు మారని కేసీఆర్
తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన సమయంలో కేసీఆర్ ఏం మాట్లాడినా చెల్లింది. కానీ, అధికారంలోకి వచ్చిన తరువాత గడిచిన పదేళ్ల కాలంలో కేసీఆర్ భాష తీరులో మార్పు రాలేదు. దీంతో ముల్లును ముల్లుతోనే తీయాలన్న సామెతను వంటబట్టించుకున్న ప్రతిపక్ష పార్టీల్లోని ఇద్దరుముగ్గురు నేతలు కేసీఆర్ కు ఆయన భాషలోనే సమాధానం చెప్పేవారు. దీంతో.. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తనపై, సీఎం ఇలా మాట్లాడటం ఏమిటంటూ కేసీఆర్ మళ్లీ తనదైన రీతిలో పదజాలాన్ని వినియోగిస్తూ విమర్శలు చేసేవారు. కేసీఆర్ అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలోనూ ఇదే తంతు కొనసాగింది. ఉన్నట్లుండి కేసీఆర్ కు జ్ఞానోదయం అయినట్లుంది. ప్రతిపక్షంలోకి వచ్చిన తరువాత ఆయన గతాన్ని మర్చిపోయినట్లుగా ప్రవర్తిస్తున్నారు అని ప్రతిపక్షాలు అంటున్నాయి. మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ కీలక సమయంలో కేసీఆర్ పై 48 గంటల పాటు నిషేధం విధించిన ఈసీ చర్యలను కూడా సానుభూతి గా మలుచుకో వడానికి ప్రయత్నిస్తారా కేసీఆర్ అని విపక్షాలు అంటున్నాయి. ఏది ఏమైనా దుర్భాషకు మాండలికంతో ముడిపెట్టి సమర్థించుకోవడం కేసీఆర్ కే చెల్లింది. ఇక్కడ కూడా తెలంగాణ సెంటిమెంటు వదలని కేసీఆర్ తీరు చూసి జనం ఆశ్చర్యపోతున్నారు.