– కేసీఆర్ పాలనలో ఏం జరిగింది?
– కాంగ్రెస్ హయాంలో ఏం జరుగుతోంది?
– ప్రజలకు నిజానిజాలు తెలియాలి
– తక్కువ సమయంలోనే రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడిపిస్తున్నాం
– ప్రజా పాలనపై తప్పుడు ప్రచారం తగదు
– బీఆర్ఎస్, బీజేపీపై భట్టి ఫైర్
Telangana Deputy Cm Bhatti Fire On BRS, BJP Parties: ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పులపాలు చేశారని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్‌లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ఆర్ధిక పరిపాలన అంశాలపై అన్ని విషయాలను ప్రజలకు తెలపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. రాష్ట్రంలో లేనిపోని తప్పుడు వ్యాఖ్యల కారణంగా అభివృద్ధి, సంస్థల మనుగడకు ప్రమాదమని వ్యాఖ్యానించారు.
ఆర్బీఐ స్టేట్మెంట్ ప్రకారం డిసెంబర్ 7న ప్రభుత్వ ఖజానాలో మైనస్ 3,960 కోట్ల రూపాయలు మిగిల్చి రాష్ట్రాన్ని అప్పజెప్పారని అన్నారు. రైతుబంధుకు కేటాయించామని చెప్పిన 7 వేల కోట్ల రూపాయలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, ఆశా వర్కర్లకు జీతాలు, మధ్యాహ్న భోజన పథకం సిబ్బంది వేతనాలు, సంక్షేమ హాస్టళ్లకు నిధులను సమాకురుస్తూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను సైతం అమలు చేస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా వాళ్లు మిగిల్చిన అప్పులకు ప్రతి నెలా రూపాయలు 26,374 కోట్ల వడ్డీ కడుతున్నామని చెప్పారు.
Also Read:దమ్ముంటే..టచ్ చెయ్..! కేసీఆర్‌కు మాస్ వార్నింగ్
రాష్ట్రంలో రైతుబంధు 93 శాతం రైతులకు అందించామన్నారు భట్టి. అలాగే, మహాలక్ష్మి పథకానికి సంబంధించి 1,125 కోట్లు విడుదల చేసి ఆర్టీసీకి నిధులను మంజూరు చేశామని చెప్పారు. రానున్న రోజుల్లో అవసరమైన విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికలు రూపొందించామన్నారు. రాష్ట్రంలో ఎక్కడా కరెంట్ అంతరాయం లేదని చెప్పారు. అతి తక్కువ సమయంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడిపిస్తున్నామని, కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చిందనే వారు ఇవన్నీ గమనించాలని చురకలంటించారు. రాష్ట్రంలో ప్రజలను తాగునీటి సరఫరాపై తప్పుడు వ్యాఖ్యలతో భయాందోళనకు గురిచేస్తున్నారని, రాష్ట్రంలో 5 సంవత్సరాలు ప్రజా ప్రభుత్వం సేవలందిస్తుందని స్పష్టం చేశారు భట్టి విక్రమార్క.