Telangana : అసెంబ్లీ ఎన్నికల్లో తీర్పు ఇచ్చిన తెలంగాణ ఓటర్ల చేతి వేలిపై సిరా మరక పూర్తిగా చెరగకముందే రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల హడావుడి మొదలైంది. త్వరలో జరగబోయే దేశ సార్వత్రిక ఎన్నికలు రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలకు రెఫరెండంగా మారనున్నాయి. ఈ క్రమంలోనే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే ఎంపి అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు అనంతరం దేశవ్యాప్తంగా ఉన్న 36 స్థానాల అభ్యర్థులను పార్టీ ప్రకటించింది. దీనిలో తెలంగాణ నుంచి జహీరాబాద్ లోక్‌సభ స్థానానికి సురేష్ షెట్కర్, మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానానికి వంశీచంద్‌రెడ్డి, నల్గొండ స్థానానికి కుందూరు రఘువీర్‌రెడ్డి, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానానికి బలరాంనాయక్ పేర్లను ఏఐసిసి ప్రకటించింది. అయితే ఈ నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ బలం అధికంగా ఉండటం, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల బలం నామమాత్రం కావటంతో ఈ 4 సీట్లూ కాంగ్రెస్ ఖాతాలోకి పోవటం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి.
మానుకోట
2009లో నియోజక వర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పడిన ఈ స్థానంలలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇల్లందు, భద్రాద్రి కొత్తగూడెం, భద్రాచలం నియోజకవర్గాలు, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట, డోర్నకల్, మహబూబాబాద్, ములుగు అసెంబ్లీ స్థానాలున్నాయి. 2024 ఎంపీ ఎన్నికల కోసం ఇక్కడ కాంగ్రెస్ టికెట్ కోసం ఏకంగా 48 దరఖాస్తులు రాగా, మాజీ ఎంపీ బలరాం నాయక్ పేరును పార్టీ ప్రకటించింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎంపీ సీటు పరిధిలోని 7 సెగ్మెంట్లలో భద్రాచలం తప్ప అన్నిచోట్లా కాంగ్రెస్ గెలవటం, భద్రాచలంలో మాస్వల్ప ఓట్ల తేడాతో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి కాంగ్రెస్ గూటికి చేరటం, గత ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కలిపి బీఆర్ఎస్కంటే కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ 2,93,445 ఎక్కువ ఓట్లు రావటంతో కాంగ్రెస్ సీటు దక్కిన వ్యక్తి ఇక పార్లమెంటుకు వెళ్లినట్లేననే వాతావరణం నెలకొంది. 2009లో ఈ స్థానంలో కాంగ్రెస్ ఎంపీగా గెలిచిన బలరాం నాయక్ కేంద్ర సామాజిక శాఖ మంత్రిగా పనిచేశారు. 2014, 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్అభ్యర్థులే ఇక్కడ గెలిచినా, బలరాం నాయక్ మాత్రం పార్టీకి విధేయుడిగా ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ, నేతలతో మంచి సంబంధాలు నెరుపుతూ వచ్చారు. క్షేత్రస్థాయిలోనూ ఆయన పట్ల సానుకూల భావన ఉంది. లెప్ట్ పార్టీల మద్దతూ కాంగ్రెస్‌కే ఉండటం,
జహీరాబాద్
ఈసారి జహీరాబాద్ ఎంపీ బరిలో కాంగ్రెస్ పార్టీ సురేశ్ షెట్కార్‌ను దించనుంది. నారాయణఖేడ్‌కు చెందిన సురేశ్‌కు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఫామ్ ఇచ్చింది. కానీ, టికెట్ కోసం పోటీపడిన మరోనేత పట్లోళ్ల సంజీవరెడ్డి కోసం సురేష్ తన బీఫామ్‌ను త్యాగం చేశారు. ఆ సమయంలోనే ఎంపీగా అవకాశం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ ఆయనకు హామీ ఇచ్చినట్లు సమాచారం. అనుకున్నట్లుగానే తొలిజాబితాలో ఆయన పేరును పార్టీ ప్రకటించింది. ఈ ఎంపీ సీటు పరిధిలోని జుక్కల్, ఎల్లారెడ్డి, ఆందోల్, నారాయణఖేడ్ స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే గెలిచారు. కామారెడ్డిలో బీజేపీ, జహీరాబాద్, బాన్స్‌వాడలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలున్నారు. 2009లో తొలిసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సురేశ్ షెట్కార్ బీఆర్ఎస్ అభ్యర్థి యూసుఫ్ అలీ మీద 17,407 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2014లో కాంగ్రెస్ నుంచి బరిలో దిగిన సురేశ్ షెట్కార్ మీద బీఆర్ఎస్ అభ్యర్థి బీబీ పాటిల్ 1.44 లక్షల భారీ మెజార్టీతో విజయం సాధించారు. కానీ 2019లో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి మదనమోహన్ రావు మీద బీఆర్ఎస్ తరపున బీబీ పాటిల్ కేవలం 6,229 ఓట్లతో గెలిచారు. ఈ సీటు నుంచి బీజేపీ తరపున సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ బరిలో ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఇంకా తేలలేదు. బీజేపీ నుంచి బరిలో ఉన్న బీబీ పాటిల్ పట్ల వ్యతిరేకత బాగా ఉండటం, బీఆర్ఎస్ తరపున బరిలో నిలిచేందుకు ఎవరూ ముందుకు రాకపోవటం, ఎంపీ సీటు పరిధిలోని 4 అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ చేతిలో ఉండటం ఇక్కడ కాంగ్రెస్ గెలుపును సులభతరం చేయనున్నాయని విశ్లేషకుల అంచనా.
మహబూబ్ నగర్
ఈసారి పాలమూరు ఎంపీ సీటును సీడబ్ల్యూసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి దక్కించుకున్నారు. గత ఎన్నికల్లో కల్వకుర్తి ఎమ్మెల్యే సీటును వదులుకున్న ఈయన అభ్యర్థిత్వానికి క్షేత్ర స్థాయిలో అందరి మద్దతూ ఉంది. అటు అధిష్ఠానం వద్ద కూడా ఆయనకు మంచి పలుకుబడి ఉంది. టికెట్ ప్రకటనకు ముందే వంశీచంద్ రెడ్డి ఫిబ్రవరిలో మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణ మండలం నుంచి న్యాయ యాత్ర చేపట్టారు. ఇప్పటికే ఎంపీ సీటు పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో యాత్రచేసారు. యాత్ర ముగింపు సభకు సీఎంగా రేవంత్ రెడ్డి హాజరై ఎంపీ ఎన్నికల్లో ఒక్క కొడంగల్ అసెంబ్లీ సీటు నుంచే 50 వేల మెజారిటీ లక్ష్యమని ప్రకటించటం, స్వయంగా సీఎం వంశీని అభ్యర్థిగా ప్రకటించటంతో ఇక్కడ కాంగ్రెస్ జెండా పాతటం ఖాయమైందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ ఎంపీ సీటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉండటం, ఉమ్మడి పాలమూరులో కాంగ్రెస్ మంచి జోరుమీద ఉండటంతో బాటు బీజేపీ సీటు కోసం సాగుతున్న వర్గపోరు, బీఆర్ఎస్ తరపున బరిలో నిలిచేందుకు ఎవరూ ముందుకు రాకపోవటంతో ఇక్కడ కాంగ్రెస్ మెజారిటీ గురించే చర్చ జరుగుతోంది.
నల్గొండ
ఈసారి నల్గొండ ఎంపీగా మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కుందూరు జానారెడ్డి పెద్ద కుమారుడు కుందూరు రఘువీర్‌రెడ్డి పేరును అధిష్ఠానం ప్రకటించింది. డిగ్రీ పూర్తి చేసిన రఘువీర్‌కు భార్య లక్ష్మి, కుమార్తె ఈశ్వాన్వి, కుమారుడు గౌతమ్‌రెడ్డి ఉన్నారు. వ్యాపారాలు చేస్తూనే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. 2014, 2018లో పీసీసీ సభ్యుడిగా పనిచేయగా, 2021 నుంచి పీసీసీ జనరల్ సెక్రటరీగా పార్టీలో కొనసాగుతున్నారు. 2014లో మిర్యాలగూడ అసెంబ్లీ సీటును ఆశించినా దానిని నల్లమోతు భాస్కరరావు కు, 2018లో ఆర్ కృష్ణయ్యకు టికెట్ కేటాయించినా పార్టీ నిర్ణయాన్ని గౌరవించి పార్టీ కోసం పనిచేశారు. నల్గొండ ఎంపీ పరిధిలోని సూర్యాపేట అసెంబ్లీ సెగ్మెంట్ తప్ప మిగిలిన 6 సీట్లూ కాంగ్రెస్ చేతిలో ఉండటంతో, ఈ 6 సీట్లలో గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 3 లక్షలకు పైగా మెజారిటీ రావటం, ఇద్దరు మంత్రులు ఇక్కడి నుంచే ఉండటంతో ఈయన గెలుపు నల్లేరు మీద నడకగానే ఉంది. ఈ స్థానంలో అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ నామమాత్రపు పోటీకే పరిమితం కానున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి.