Revanth Reddy: భారత దేశ గర్వించదగ్గ దర్శకుల్లో రామ్ గోపాల్ వర్మ ఒకరు అని తరుచూ చెప్పేవారు. ఆయన సినిమాలు అలా ఉండేవి. కానీ, ఇప్పుడు టైంపాస్ సినిమాలు చేస్తున్నారు. సినిమా వస్తువుగా రాజకీయ విషయాలను ఎంచుకోవడంతో ఆయనపై సహజంగానే విమర్శలు పెరిగాయి. అలాగని ఫ్యాన్స్ ఏం తక్కువ లేరు. నిజానికి ఆయన సినిమాల కంటే ఆయన వ్యక్తిత్వాన్ని ఇష్టపడేవారు ఎక్కువ. రియల్ లైఫ్‌లో డేరింగ్ పర్సనాలిటీ అని ఫ్యాన్స్ మెచ్చుకుంటారు. తన సినిమా పోస్టర్ చూడండి, ట్రైలర్ చూడండి, నచ్చితే సినిమా చూడండి లేదంటే మీ ఇష్టం అని ముక్కుసూటిగా చెప్పేస్తుంటారు. ఇప్పుడు ఇదే డైలాగ్ రాజకీయాల్లో కూడా వినిపిస్తుంది. మా పాలన నచ్చితే ఓటేయండి. లేదంటే ఆలోచించుకోండి అంటూ అధినాయకులే డేరింగ్ డైలాగ్ కొట్టడం తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తిదాయకంగా మారింది. సరే.. ఆర్జీవీ కొంత తలబిరుసుతో అని ఉండవచ్చు. కానీ, మన ముఖ్యమంత్రులు మాత్రం సుపరిపాలన లక్ష్యంగా ఈ డైలాగ్ వాడారు.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ముఖ్యంగా విద్య కేంద్రంగా ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై చాలా మందిలో సదభిప్రాయం ఉన్నది. అదే వారి బలం కూడా. ఆ పార్టీ ఎంత నమ్మకంగా ఉన్నదంటే.. తాము శాయశక్తులా కష్టపడి ప్రజల కోసం పని చేశామని, ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంతో తమ వంతు పాత్ర కచ్చితంగా పోషించామని బలంగతా నమ్ముతున్నది. అదే తమను గెలిపిస్తుందనీ వందశాతం నమ్మకంతో ఉన్నది. అందుకే వైసీపీ అధినేత, సీఎం జగన్ సహా ఆ పార్టీ ముఖ్య నాయకులు ధైర్యంగా తమ పాలననే లిట్మస్ పరీక్షకు పెడుతున్నారు. తమ పాలన నచ్చితేనే.. తమ పాలనలో జీవితాల్లో మార్పు వచ్చినట్టు అనిపిస్తేనే తమకు ఓటు వేయాలని డేరింగ్ అండ్ డ్యాషింగ్‌గా అడుగుతున్నారు.
Also Read: నన్ను ఇరికించే కుట్ర .. జైలుకైనా పోతా.. : మాజీ మంత్రి ఎర్రబెల్లి సంచలనం
ఇది ఏపీకే పరిమితం కాలేదు. గత డిసెంబర్‌లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ డైలాగ్ అంటున్నది. సీఎం రేవంత్ రెడ్డి తుక్కుగూడ సభలో ఇదే ధైర్యాన్ని ప్రదర్శించారు. అధికారంలోకి వచ్చి నాలుగు నెలలే అవుతున్నా సాహసోపేతంగా మాట్లాడారు. ఈ వంద రోజుల్లో తాము మంచి పాలన అందించామని భావిస్తే తమ ఎంపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని, లేనిపక్షంలో ఓటు వేయాలో లేదో ఆలోచించుకోవాలని సూచించారు.
Also Read: మాజీ సీఎం కేసీఆర్ రైతుల వద్ద ఉంటే.. సీఎం రేవంత్ ఐపీఎల్ మ్యాచ్ వద్ద..: కేటీఆర్
ఇది శుభపరిణామమే. రాజకీయాల్లో తరుచూ బురద జల్లుకోవడం.. ప్రత్యర్థిని టార్గెట్ చేసుకుని రాజకీయాలు చేయడానికి పరిమితం కావడం కంటే.. ప్రజలకు సుపరిపాలన అందించి దాన్నే రెఫరెండంగా పెట్టడం అందరికీ మంచిది. స్వల్ప సమయం లోనే కాంగ్రెస్ ఇలాంటి ధైర్యవంతమైన కామెంట్ చేయడం హర్షణీయమే. ఇక మీదటా సుపరిపాలనే లక్ష్యంగా కొనసాగితే మళ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీని ఎవరు కాదంటారు?