Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళలో రాహుల్ గాంధీ తరఫున ప్రచారం చేస్తున్నారు. వయనాడ్ లోక్ సభ ఎన్నిక కోసం ఆయన క్యాంపెయిన్ చేస్తున్నారు. తన రెండో రోజు ప్రచారంలో రైతుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రాహుల్ గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయాలని విజ్ఞప్తి చేశామని, కానీ, ఆయన తెలంగాణను కాదని వయనాడ్‌ను ఎంచుకున్నారని వివరించారు. ఆయన వయనాడ్ నుంచి గెలవడం ఖాయం అని, ఆయనకు ప్రజలు ఇచ్చే మద్దతును స్వయంగా వీక్షించాలనే తాను తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చినట్టు తెలిపారు.
గత లోక్ సభ ఎన్నికల్లో 65 శాతం ఓట్లతో రాహుల్ గాంధీని వయనాడ్ ప్రజలు గెలిపించారని, ఈ ఎన్నికల్లో 75 శాతం ఓట్లతో గెలిపించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పిలుపు ఇచ్చారు. వయనాడ్ ప్రజలు గెలిపించేది కేవలం ఒక ఎంపీని కాదని, ఈ దేశానికి కాబోయే ప్రధానిని గెలిపిస్తున్నారని అన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని, జూన్ 9వ తేదీన రాహుల్ గాంధీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తారని వివరించారు.
Also Read: ‘స్టార్’ క్యాంపెయినర్.. రేవంత్ రెడ్డి
‘మోడీ దుష్పరిపాలనకు వ్యతిరేకంగా మనం పోరాటం చేస్తున్నాం. ఇప్పుడు వారణాసికి, వయనాడ్‌కు మధ్య పోరు ఉన్నది. దేశంలో రెండు పరివార్‌ల మధ్య పోరాటం జరుగుతున్నది. మోడీ కుటుంబంలో ఈడీ, ఈవీఎంలు, సీబీఐ, ఇన్‌కం ట్యాక్స్, అదానీ, అంబానీలు ఉన్నారు. మరోవైపు ఇండియా పరివార్ ఉన్నది. ఇందులో ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, వయనాడ్ కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలు దేశం కోసం ప్రాణ త్యాగం చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రధాని పదవిని వదులుకున్నారు’ అని రేవంత్ రెడ్డి అన్నారు.
ఇక కేరళ సీఎం పినరయి విజయన్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. కేరళ ప్రజలు కష్టపడేవారని, వారి శ్రమ వల్ల దుబాయ్ లాంటి దేశాలు అభివృద్ధి చెందాయని, కానీ, కేరళ అభివృద్ధి కాలేదని వాపోయారు. కేరళ సీఎం పినరయి, ఆయన కుటుంబ సభ్యులు అవినీతిలో మునిగిపోయారని, బంగారం స్మగ్లింగ్ వ్యవహారంలో పినరయి విజయన్ కుటుంబ సభ్యుల పాత్ర ఉండటం ఆశ్చర్యాన్ని కలిగించిందని వివరించారు. విజయన్‌కు మోడీకి మధ్య రహస్య ఒప్పందం ఉన్నదని, అందుకే విజయన్ పై కేసులున్నా మోడీ యాక్షన్ తీసుకోవడం లేదని ఆరోపించారు. వయనాడ్‌లో విజయన్ బీజేపీ అభ్యర్థి సురేంద్రన్‌కు మద్దతు ఇస్తున్నారని, సీపీఎం ముఖ్యమంత్రిగా, కమ్యూనిస్టు నాయకుడిగా కనిపిస్తున్న పినరయి విజయన్ వాస్తవానికి కమ్యూనిస్టు కాదని, కమ్యూనలిస్టు అని తీవ్ర ఆరోపణలు చేశారు.