Kishan Reddy: తెలంగాణలో జరిగిన లోక్ సభ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 13న జరిగిన ఎన్నికల్లో బీజేపీకి బ్రహ్మాండమైన ఫలితాలు రాబోతున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం రాబోతున్నదని, ఫలితాలు అందరూ ఆశ్చర్యపడేలా ఉంటాయని వివరించారు. మోదీ మళ్లీ ప్రధాని కావాలనే కాంక్ష గ్రామాల్లోనూ కనిపించిందని, ఈసారి బీజేపీ గ్రామాల్లోకి కూడా చొచ్చుకుపోయిందని తెలిపారు.
తెలంగాణలో డబుల్ డిజిట్ సాధిస్తామని, ఫలితాల తర్వాత రాష్ట్రంలో ఒక నూతన అధ్యాయం ప్రారంభం అవుతుందని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు సరైన ప్రత్యామ్నాయంగా బీజేపీ ఏర్పడుతుందని, ఈ సారి ఏకపక్షంగా ప్రజలు బీజేపీకి ఓటేశారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అస్తిత్వం కోల్పోనుందని జోస్యం చెప్పారు. తెలంగాణలో కమల వికాసం ఖాయం అని అన్నారు.
రిజర్వేషన్లకు ఢోకా లేదు:
తమపై కాంగ్రెస్, బీజేపీ దుష్ప్రచారం చేసినా.. రాజ్యాంగం మారుస్తారని, రిజర్వేషన్లు ఎత్తేస్తారని ఆరోపించినా ప్రజలు బీజేపీపై విశ్వాసాన్ని పోగొట్టుకోలేదని, వారి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టారని కిషన్ రెడ్డి అన్నారు. రిజర్వేషన్లు ఎత్తేసే శక్తి ఎవరికీ లేదని, రేవంత్ మాటలు విని ప్రజలు నవ్వుకున్నారని ఎద్దేవా చేశారు. అలవిగాని గ్యారంటీలు ఇచ్చి రేవంత్ ప్రభుత్వం అమలు చేసిందేమీ లేదని అన్నారు. పాలనే మొదలు పెట్టని రేవంత్ రెడ్డి.. తమ పాలనే రెఫరెండం అని చెప్పుకున్నాడని వివరించారు. సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి ఆగస్టుకు వాయిదా వేశారని, కాంగ్రెస్ ఇష్టారీతిన హామీలు ప్రకటించారని అన్నారు. ఫలితంగా తెలంగాణలో ఆర్థిక సంక్షోభం ఏర్పడే ముప్పు ఉన్నదని, తెలంగాణ భవిష్యత్ గురించి ఆలోచన చేయకుండా అనవసర ఖర్చులు చేస్తున్నారని మండిపడ్డారు.
Also Read: BRS Party: లీడర్ ఓ వైపు.. క్యాడర్ ఓ వైపు?
ఏపీలో కూటమే:
ఏపీ ఎన్నికలపై కిషన్ రెడ్డి స్పందిస్తూ అక్కడ ఎన్డీయే కూటమి గెలుస్తుందని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అన్నారు. కొందరు నిరాశ, నిస్పృహలో ఉండొచ్చని, అందుకే అల్లర్లు జరుగుతున్నాయేమో అని తెలిపారు. ప్రజల్లో మార్పు రావడం వల్ల అభ్యర్థులు గొడవకు దిగుతున్నారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఎన్డీయే 400 సీట్లు గెలుచుకోవడం ఖాయం అని అన్నారు.