TS BJP : వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 400 లోక్‌సభ సీట్లు సాధించి ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని భావిస్తున్న బీజేపీ తెలంగాణ మీద ప్రత్యేక దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. వారం రోజుల నాడు విడుదలైన జాబితాలో తెలంగాణలోని 17 సీట్లలో 9 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసి దూకుడు ప్రదర్శించింది. ఆ జాబితాలో ఇప్పటికే ఉన్న నలుగురు సిట్టింగుల్లో ముగ్గురికి సీటు ఖరారు చేసిన బీజేపీ పెద్దలు, ఆదిలాబాదు సీటును పెండింగ్‌లో ఉంచారు. తొలి జాబితాలో హైదరాబాద్ నుంచి డాక్టర్ మాధవీలత, భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్, నాగర్ కర్నూల్ నుంచి పి. భరత్, మల్కాజిగిరి నుంచి ఈటల రాజేందర్, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర రెడ్డి, జహీరాబాద్ నుంచి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్‌కి చోటు లభించింది.
రెండో జాబితాలో మిగిలిన 8 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలా? లేక కొన్ని స్థానాలకే ప్రకటించాలా? అనే సందిగ్ధంలో ఆ పార్టీ ఉన్నట్లు సమాచారం. వరంగల్, నల్గొండ, మహబూబాబాద్, ఖమ్మం, పెద్దపల్లి స్థానాల్లో పార్టీ చాలా బలహీనంగా ఉండటంతో, అక్కడ బలమైన అభ్యర్థులను నిలపలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఈ స్థానాల్లో వేరే పార్టీల నేతలకు గాలం వేసి వారికి టికెట్లు కేటాయించాలని భావిస్తోంది. అయితే ఆ పార్టీలో చేరేందుకు నేతలు పెద్దగా ఆసక్తి ప్రదర్శించకపోవటంతో ప్రస్తుతానికి మరో నాలుగు సీట్లకు అభ్యర్థులను ప్రకటించి, మూడవ జాబితాలో బలహీనంగా ఉన్న నియోజకవర్గాలను ప్రకటించే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇక ఆదిలాబాద్ సీటు దక్కుతుందా లేదా అని ఎదురుచూస్తున్న సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు, మహబూబ్‌నగర్ సీటును ఆశిస్తున్న డీకే అరుణ, జితేందర్ రెడ్డి, మెదక్ బరిలో నిలుస్తానని ఉత్సాహం చూపుతున్న రఘునందన్ రావు, వరంగల్ బరిలో నిలిచేందుకు సిద్ధమైన మాజీ డీజీపీ కృష్ణప్రసాద్ వంటివారు రెండో జాబితా కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కాగా, నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మనోహర్ రెడ్డికి రెండో జాబితాలో టికెట్ దక్కే అవకాశం ఉంది. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం టికెట్ కోసం ఎస్ కుమార్, మిట్టపల్లి సురేంద్ర పోటీ పడుతున్నారు. వీరితో బాటు ఈసారి తెలంగాణలో బీజేపీ తరపున మందకృష్ణ మాదిగను దించాలని కూడా పార్టీ పెద్దలు నిర్ణయించినట్లు సమాచారం. సోమవారం నాడు ఢిల్లీలో జరిగే పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ తర్వాత ఏ క్షణమైనా అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చేరికలను త్వరగా పూర్తిచేసి.. తెలంగాణలో ఎన్నికల ప్రచారంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని రాష్ట్ర నాయకత్వం ప్రణాళికలు రచిస్తోంది.