Telangana Political leaders Descendants step back: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలొచ్చిన జస్ట్ మూడే మూడు నెలల్లో తెలంగాణను తొమ్మిదిన్నర ఏళ్ల పాటు ఏలిన బీఆర్ఎస్ పార్టీ కుదేలైపోతోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టిక్కెట్ల కోసం బారులు దీరిన నేతలెవరూ ఇప్పుడు ఆ పార్టీ సమావేశాలకే డుమ్మా కొడుతున్నారు. గత ఎన్నికల వేళ కొడుకులను ఎమ్మెల్యేలుగా చూసుకోవాలని, టికెట్ కోసం గులాబీ బాస్ చుట్టూ తిరిగిన నేతల పిల్లలకు లోక్‌సభ సీటిస్తామని పార్టీ ఆఫర్ ఇస్తున్నా వద్దు వద్దంటూ తప్పుకుంటున్నారు. కనుచూపు మేరలో గెలుపు అవకాశం కనిపించిన ఈ వాతావరణంలో మొహమాటానికి పోయి సీటు తీసుకుంటే తమ వారసుల రాజకీయ భవిష్యత్తు సమాధి అయిపోక తప్పదని గులాబీ సీనియర్లు సైడైపోతున్నారు. ఉద్యమపార్టీగా తెలంగాణ రాజకీయాలను శాసించిన బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన మూడు నెలలకే ఇలా అవుతుందని ఊహించని సదరు వారసులంతా లోక్‌సభ ప్రచారానికీ మొహం చాటేసి, తమ తమ వ్యాపకాల్లో బిజీగా ఉండిపోతున్నారు.
గత ఎన్నికల వేళ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తనకు బదులుగా డీసీసీబీ చైర్మన్‌గా ఉన్న తన కుమారుడు భాస్కర్ రెడ్డిని బరిలో దింపాలని చూశారు. నిజామాబాద్ రూరల్ నుంచి ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్‌రెడ్డి కుమారుడు, జడ్పీటీసీ సభ్యుడు జగన్ సైతం అసెంబ్లీ ఎన్నికల వేళపోటీకి తహతహలాడారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం కుమారుడు అజయ్, షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఇద్దరు కుమారులు కూడా అవకాశమిస్తే తామూ సత్తా చాటగలమని పలు కార్యక్రమాలు చేపట్టారు.
అటు కొత్తగూడెంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవేంద్ర, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు కుమారుడు విద్యుత్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మంత్రి సబిత ఇంద్రారెడ్డి విశ్రాంతి కుమారుడు కార్తీక్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కుమారుడు ప్రశాంత్, తలసాని శ్రీనివాస్ యాదవ్ వారసుడు సాయి, జోగు రామన్న కొడుకు మహేందర్ పేర్లు కూడా వారసుల జాబితాలో బరిలో దిగనున్నారనే వార్తలు వచ్చాయి.
సికింద్రాబాద్ ఎమ్మెల్యే కుమారుడు రామేశ్వర్ గౌడ్, ముషీరాబాద్‌లో ముఠాగోపాల్ కుమారుడు జైసింహ పేర్లు కూడా ఆ ఎన్నికలకు ముందు మీడియాలో చక్కర్లు కొట్టాయి. అటు నిర్మల్ నుంచి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, హోంమంత్రి మహమూద్ అలీ సైతం తమ వారసులను తెరమీదకు తెచ్చేందుకు గట్టి ప్రయత్నాలే చేశారు. కానీ, గత ఎన్నికల్లో గులాబీ పార్టీ ఘోర పరాజయం తర్వాత సీనియర్లంతా మౌన వ్రతం చేపట్టారు. ఎప్పటిలా చురుగ్గా కార్యక్రమాల్లో పాల్గొంటే తమ వారసులకు టికెట్ ఆఫర్ చేస్తారనే భయంతో వీరు పార్టీ కార్యకలాపాల్లో అంటీ ముట్టనట్లుగా ఉండటమే గాక తమ వారసుల ప్రస్తావన చేయటానికి ఇష్టపడటం లేదు.
ఇక.. వరంగల్ ఎంపీ బరిలో కడియం శ్రీహరి కుమార్తె కావ్య పేరు వినిపిస్తున్నా, ఆమె బరిలో దిగేదాక చెప్పలేమని లోకల్ పార్టీ కేడర్ చెబుతోంది. మరోవైపు తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తన కుమారుడు భద్రారెడ్డిని మల్కాజ్ గిరి ఎంపీ బరిలో నిలుపుతానని గతంలో ప్రకటించిన మాజీమంత్రి మల్లారెడ్డి సైతం తాజాగా తన కుమారుడు పోటీలో లేడని నేరుగా కేటీఆర్‌కు చెప్పటం విశేషం. నిన్నటిదాకా తన వద్ద చేతులు కట్టుకుని నిలబడిన నేతలెవరూ ముఖం చూపించకపోవటంతో గులాబీ బాస్, ఇన్నాళ్లుగా సదరు నాయకుల కుమారులను ప్రోత్సహిస్తూ వచ్చిన కేటీఆర్‌కు తాజా పరిణామాలు మింగుడు పడని రీతిలో పరిణమిస్తు్న్నాయి.