Rahul Gandhi: దక్షిణాది ప్రజలు తమ కట్టుబాట్లు, తమదైన చరిత్ర, వేష భాషలు, ఆహారం, వంటి వాటిపై కొంత నిక్కచ్చిగా ఉంటారు. అస్తిత్వంతో ముడిపడే అంశాలపై రాజీపడరు. ఈ క్రమంలోనే వాటి ఆధారంగానే వారిని ఆకట్టుకోవాలని రాజకీయ నాయకులు ప్రయత్నాలు చేస్తుంటారు. అందుకే నాయకులు స్థానిక ప్రజల వేషదారణలో కనిపిస్తుంటారు. వారి భాషలో ఉచ్చరించేందుకు ప్రయత్నిస్తారు. ఈ క్రమంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరో అడుగు ముందుకు వేసి తినే ఆహారం గురించి మాట్లాడారు. తమిళనాడులో ఓ చోట మోడీ తనకు దోసెలు తినడం ఇష్టం అని తెలిపారు.
రాహుల్ గాంధీ కేరళలో ఈ విషయాన్ని గుర్తు చేసి ప్రధాని మోడీపై విమర్శలు చేశారు. కన్నూరులో ఓ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ దోసెలను హాట్ టాపిక్‌గా మార్చారు. ‘కేరళ తరహాలోనే తమిళనాడులో కూడా అద్భుతమైన కవులు ఉన్నారు. ఆ రాష్ట్రంలోనూ ఇక్కడి వలె ఘనమైన చరిత్ర, పోరాటాలు, ప్రజా త్యాగాలు ఉన్నాయి. ఇంతటి ఘన చరిత్ర కలిగిన తమిళనాడుకు వెళ్లి నరేంద్ర మోడీ ఏమంటున్నారు? ఆయనకు దోసెలు ఇష్టమంటా. బ్రదర్, దోసెలు అంటే నాకు కూడా ఇష్టమే. అందరికీ ఇష్టమే. ముందు అక్కడి ప్రజల చరిత్రపై అవగాహన పెంచుకోండి. రాష్ట్ర చరిత్ర, సాంప్రదాయాలు, భాష వంటి విషయాలను ముందు అర్థం చేసుకోండి’ అని రాహుల్ అన్నారు.
Also Read: కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్
ఇక్కడే మీకు మరో విషయం కూడా అవగాహనలోకి వస్తుంది. తమిళనాడు దోసె, కేరళ దోసె రెండూ వేరని తెలుస్తుంది. అంతేకాదు, కేరళలోని ఒక దోసె, అదే కేరళలోని ఇతర దోసెలకు భిన్నంగా ఉంటుంది. ఇదే మన దేశ డీఎన్ఏ. ఇదే మన వైవిధ్యత. అందుకే మన దేశం గొప్పది. కానీ, మీరు ఈ వైవిధ్యాన్ని మార్చాలని చూస్తున్నారు. అది అసాధ్యం. మీరు సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. అలాగే.. దేశ ప్రజల శక్తి సామర్థ్యాలను, సమయాన్ని వృథా చేస్తున్నారు. మీరు సామరస్యాన్ని దెబ్బ తీస్తున్నారు. ఇది కోట్లాది ప్రజల జీవితాలను గాయపరుస్తుంది’ అని రాహుల్ గాంధీ అన్నారు. మొత్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తావించిన దోసె అనే మాటతో రాహుల్ గాంధీ భారత దేశ వైవిధ్యతను, బహుళత్వాన్ని వివరించారు.