- భూ సర్వే చేపట్టేందుకు నివేదికలు సిద్ధం చేస్తున్న కాంగ్రెస్
- పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అన్నీ భూ వివాదాలే
- రికార్డుల్లో ఉన్న భూమికి..కొలతలలో వస్తున్న తేడాలు
- డిజిటల్ భూ సర్వే కోసం 2021లో రూ.83.85 కోట్లు కేటాయించిన కేంద్రం
- రూ.2.65 కోట్లు మాత్రమే ఖర్చు చేసిన కేసీఆర్ సర్కార్
- ప్రతి అంగుళం భూమిని కొలుస్తామన్న నాటి సీఎం కేసీఆర్
- కొత్తగా భూ రికార్డులు రూపొందించే యోచనలో కాంగ్రెస్
- 14 అంకెలతో కూడిన భూ ఆధార్ నంబరు కేటాయింపు
- కాంగ్రెస్ చొరవతో కొలిక్కి రానున్న భూ వివాదాలు
T.Congress government thinking land re survey process with degital records:
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో భూములపరంగా క్షేత్ర స్థాయిలో ఉన్న హద్దు రాళ్ల పరంగా తీవ్ర వివాదాలు నెలకొని ఉన్నాయి. రికార్డులలో చూపే భూమి కొలతల వద్దకు వచ్చేసరికి తేడాలొస్తున్నాయి. దీనితో కొనుగోలు, అమ్మకం దారుల మధ్య వివాదాలు నెలకొంటున్నాయి. వాస్తవానికి పట్టా, ప్రభుత్వ, దేవాదాయ, అటవీ, వక్ఫ్ బోర్డు, భూదాన్ భూములు ఎన్నెన్ని ఉన్నాయి అనే వివరాలు రికార్డుల్లో నమోదై ఉంటాయి. కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం వీటికి సంబంధించిన హద్దులుగానీ, మ్యాపులు గానీ లేవు. దాని ఫలితంగా లక్షల సంఖ్యలో భూవివాదాలు సంవత్సరాల తరబడి పెండింగ్ లోనే ఉండిపోయాయి. ముందు ఈ సమస్యలన్నీ సమగ్రంగా పరిశీలించి కొత్తగా రికార్డులు రూపొందిస్తేనే భూవివాదాలు పరిష్కారం అవుతాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
బీఆర్ఎస్ హయాంలో పట్టాలెక్కని భూ సర్వే
కేంద్ర ప్రభుత్వం భూ సర్వేకు సంబంధించి ఆయా రాష్ట్రాల సర్వే సెటిల్మెంట్ ల్యాండ్ రికార్డ్ కమిషనర్‌లతో ఇటీవలే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఒక్కో రాష్ట్రంలో చేపట్టిన పురోగతిని కేంద్రం అడిగి తెలుసుకుంది. తెలంగాణ రాష్ట్రంలోనైతే ఈ కార్యక్రమం ఇంకా పట్టాలెక్కలేదు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం భూ సర్వేపై హడావుడి చేసి మధ్యలోనే వదిలేసింది. 2017 ఆగస్టు 18న అప్పటి సీఎం కేసీఆర్ ‘తెలంగాణలో ప్రతి అంగుళం భూమిని కొలుస్తాం. కొలిచిన భూమికి డిజిటల్ మ్యాప్ ఆఫ్ తెలంగాణను తయారు చేస్తాం’ అని చెప్పారు. 2020 సెప్టెంబరు 9న మరోమారు భూముల సర్వే కోసం టెండర్లు పిలవాల్సి ఉందని, సభలో బిల్లులకు ఆమోదం తెలిపిన వెంటనే సర్వే కోసం ముందుకు వెళ్తామని కేసీఆర్ చెప్పారు.
నామమాత్రపు నిధులు
2021 జూన్ 7న మంత్రివర్గ సమావేశంలో సమగ్ర భూ సర్వేపై చర్చించారు. జూన్ 9న డిజిటల్ సర్వే కోసం కొన్ని గ్రామాలను ఫైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసినట్లు ప్రకటించారు. డిజిటల్ భూ సర్వే చేపట్టేందుకు 29 ఏజన్సీలు ముందుకొచ్చినా అడుగు కూడా ముందుకు పడలేదు. డిజిటల్ భూ సర్వే ప్రక్రియ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.83.85 కోట్లు కూడా మంజూరు చేసింది. ఈ నిధుల్లో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.2.65 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. తర్వాత ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌లలో కూడా ఈ కార్యక్రమానికి నిధులు కేటాయించినా నామమాత్రంగానే ఖర్చు చేశారు. తాజాగా ఇదే విషయాన్ని సర్వే సెటిల్మెంట్ ల్యాండ్ రికార్డ్ కమిషనర్ కేంద్రానికి వివరించారు. దీంతో 2025-26 మార్చి 31 నాటికి సమగ్ర భూ సర్వే కార్యక్రమం పూర్తి చేయాలని కేంద్రం గడువు విధించింది. గత ప్రభుత్వంలో మంజూరు చేసిన నిధులకు యుటిలైజేషన్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంది. ఈ సర్టిఫికెట్ ఇస్తే ప్రతిపాదించిన నిధులు మొత్తం కేంద్రం మంజూరు చేసే అవకాశం కూడా ఉంది.
ప్రణాళికల రూపకల్పనలో అధికారులు
సర్వే చేపడితే ప్రధానంగా ఇద్దరి వ్యక్తుల మధ్యన, దాయాదుల మధ్యన నెలకొన్న భూవివాదాలు పరిష్కారం అవుతాయి. క్షేత్రస్థాయిలో ఉన్న భూమి విస్తీర్ణం, రికార్డుల్లో నమోదు చేసిన వివరాలకు సమానంగా ఉంటే భూమికి సంబంధించిన సమస్యలే తలెత్తవు. సర్వే నిర్వహిస్తే రికార్డుల అప్‌డేట్ కూడా జరిగిపోతుంది. ఏళ్ల తరబడి కోర్టులో కొనసాగుతున్న పలు భూ వివాద కేసులు కూడా తగ్గిపోతాయి. అంతే కాకుండా అటవీ, రెవెన్యూ శాఖల సరిహద్దుల్లోని భూముల వివాదాలకు పరిష్కారం దొరుకుంది. రాష్ట్రాల సరిహద్దుల వివాదాలు, గ్రామాలు, జిల్లాల మధ్యన నెలకొన్న సరిహద్దు వివాదాలు పరిష్కారమవుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర భూ సర్వేపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇందుకు సర్వే సెటిల్మెంట్ ల్యాండ్ రికార్డు కమిషనర్ కార్యాలయం అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. భూ సర్వే పూర్తి చేసేందుకు ఎన్ని నిధులు కావాలి? ఎంత మంది సిబ్బంది అవసరం? ఎన్ని రోజుల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయొచ్చు? సర్వే ద్వారా రైతులకు, ఇతర యజమానులకు కలిగే ప్రయోజనం ఎంత? సర్వే చేపట్టేటప్పుడు క్షేత్రస్థాయిలో నెలకొనే ఇబ్బందులేమిటి? తదితర అంశాలను అంచనా వేస్తూ, సమగ్ర నివేదికను తయారు చేస్తున్నారు.
రికార్డుల అప్ డేట్ కోసం రూ.300 కోట్లు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. సర్వే సెటిల్మెంట్ ల్యాండ్ రికార్డ్ కమిషనర్‌తో సమావేశమయ్యారు. భూ సర్వే చేపట్టేందుకు నివేదికలు రూపొందించాలంటూ ఆ విభాగాన్ని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో భూ సర్వే చేపట్టి భూ రికార్డులను అప్‌డేట్ చేసేందుకు డీఐఎల్‌ఆర్‌ఎంపీ (డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డు మోడ్రనైజేషన్) కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. అందులో భాగంగా ఆయా రాష్ట్రాలు కోరిన నిధులు కూడా మంజూరు చేస్తోంది.భూ సమగ్ర సర్వే ద్వారానే నిధులు సమకూర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు భూ సర్వే కోసం సిబ్బంది, అత్యాధునిక పరికరాలు, రికార్డుల అప్‌డేట్, తదితర అవసరాల కోసం రూ.300 కోట్లు కేటాయిస్తే, సర్వే పూర్తి చేసి రికార్డులు అప్‌డేట్ చేస్తామని చెప్పేందుకు సర్కారు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. భూములు సర్వే చేసిన అనంతరం సంబంధిత యజమానికి 14 అంకెలతో కూడిన భూ ఆధార్ నంబరును జారీ చేస్తారు. ఈ నంబరు ద్వారా ఆ భూమికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ నంబరును ఆన్‌లైన్‌లో కొడితే యజమాని పేరు, భూమి విస్తీర్ణం, భూమి స్వభావం, అక్షాంశాలు, రేఖాంశాల సహితంగా హద్దులు తెలుస్తాయి.