Arvind Kejriwal Bail News(Political news in Telugu): ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఈడీ కేసులో ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 1వ తేదీ వరకు ఆయనకు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఎన్నికల ప్రచారం చేసుకోవడానికి అంగీకరించింది. కేజ్రీవాల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను ఈడీ వ్యతిరేకించింది. కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేయరాదని వాదించింది.
అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారం చేసుకోవడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. అరవింద్ కేజ్రీవాల్ సీరియల్ అఫెండర్ కాదని, అలాంటప్పుడు కేవలం ఎన్నికల ప్రచారానికి ఆయనకు అనుమతి ఇస్తే తప్పేమున్నదని సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే, అరవింద్ కేజ్రీవాల్ తన బెయిల్ ను అధికార కార్యకలాపాలకు వినియోగించరాదని స్పష్టం చేసింది. అధికారాన్ని ఉపయోగించుకోరాదని షరతు విధించింది. ఆప్ అధినేతగా ఎన్నికల ప్రచారం చేసుకోవాలని తెలిపింది. జూన్ 1వ తేదీ వరకు అరవింద్ కేజ్రీవాల్‌కు న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాల ధర్మాసనం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తిరిగి జూన్ 2వ తేదీన తిహార్ జైలులో లొంగిపోవాలని ఆదేశించింది.
Also Read: వివేకా హత్య కేసులో భారతి రెడ్డి పాత్ర? బిగ్ టీవీతో వైఎస్ షర్మిల ఇంటర్వ్యూ
ఏడు విడతల పోలింగ్ ముగిసిన తర్వాత ఫలితాలు 4వ తేదీన వెలువడనున్నాయి. కాబట్టి, ఫలితాలు వెలువడే వరకు బెయిల్ మంజూరు చేయాలని అరవింద్ కేజ్రీవాల్ తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కోరారు. కానీ, సుప్రీం ధర్మాసనం అందుకు అంగీకరించలేదు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మార్చి 21వ తేదీన ఈడీ అధికారులు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఆ తర్వాత విచారించారు. ప్రస్తుతం తిహార్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. ఆయన బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టులోనూ దరఖాస్తు చేసుకున్నారు. కానీ, ఢిల్లీ హైకోర్టు సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా, సుప్రీంకోర్టులో ఆయనకు ఊరట లభించింది.
కవిత బెయిల్‌పై విచారణ వాయిదా
ఈడీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ఈ రోజు హైకోర్టులో విచారణకు వచ్చింది. కవితకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసే అంశాన్ని పరిశీలిస్తామని, విచారణ అనంతరం నిర్ణయం వెల్లడిస్తామని తెలిపింది. కవిత బెయిల్ పిటిషన్ పై వాదనలు వినిపించడానికి సమయం కావాలని ఈడీ కోరింది. దీంతో కవిత బెయిల్ పిటిషన్ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. విచారణను మే 24వ తేదీకి వాయిదా వేసింది. ఇంతలోపు ఈడీ తన స్పందనను తెలియజేయాలని ఆదేశించింది.
Read Also: కమలానికి ‘రామ’సాయం
మొదట రౌస్ అవెన్యూ కోర్టులో కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ, అక్కడ ఆమెకు చుక్కెదురైంది. కవిత బెయిల్ పిటిషన్‌ను రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. ఆ తర్వాత ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
ఇదిలా ఉండగా, సీబీఐ కేసులోనూ బెయిల్ కోసం ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉన్నది.