AAP: ఆప్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్‌కు ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బెయిల్ మంజూరైంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తా, పీబీ వరాలేలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం సంజయ్ సింగ్‌కు బెయిల్ మంజూరు చేసింది. సంజయ్ సింగ్‌ను ఇంకా విచారించాల్సిన అవసరం ఉన్నదా? ఆయన బెయిల్ మంజూరుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు అభ్యంతరాలు ఏవైనా ఉన్నాయా? అని త్రిసభ్య ధర్మాసనం ప్రశ్నించింది. సంజయ్ సింగ్‌కు బెయిల్ మంజూరు చేయడంపై తమకు అభ్యంతరం లేదని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు తెలిపారు.
ఎంపీ సంజయ్ సింగ్‌కు ధర్మాసనం బెయిల్ మంజూరు చేయడమే కాదు.. ఈ బెయిల్ కాలంలో ఆయన రాజకీయ కార్యకలాపాలు చేపట్టుకోవడానికి కూడా అనుమతి ఇచ్చింది. లోక్ సభ ఎన్నికలు సమీపించిన వేళ ఈ అవకాశంతో సంజయ్ సింగ్‌కు బెయిల్ లభించడం గమనార్హం. ఢిల్లీ లిక్కర్ స్కాంలో రెగ్యులర్ బెయిల్ పొందిన తొలి సీనియర్ ఆప్ నాయకుడు ఈయనే. ఇప్పటికీ ఈ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, మాజీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్‌లు జైలులోనే ఉన్నారు.
ఢిల్లీలోని సంజయ్ సింగ్ నివాసంలో ఈడీ సోదాలు జరిపింది. ఆ తర్వాత 2023 అక్టోబర్ 4వ తేదీన సంజయ్ సింగ్‌ను ఈడీ అరెస్టు చేసింది. బిజినెస్ మ్యాన్ దినేశ్ అరోరా ఉద్యోగి ఒకరు రూ. 2 కోట్లు సంజయ్ సింగ్‌కు రెండు పర్యాయాల్లో అందించినట్టు ఈడీ ఆరోపించింది. ఈడీ, సీబీఐ కేసుల్లో అప్రూవర్‌గా మారిన దినేశ్ అరోరా ఆరోపణల ఆధారంగా ఈడీ సంజయ్ సింగ్‌ను అరెస్టు చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా రౌస్ అవెన్యూ కోర్టులో బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పిటిషన్ విచారణను కోర్టు ఈ నెల 4వ తేదీకి వాయిదా వేసింది. ఇదే కేసులో ఇప్పుడు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌కు బెయిల్ లభించడంతో ఇతర నిందితులకు కూడా బెయిల్ లభించే ఆస్కారం ఉన్నదా? అనే ఆసక్తి నెలకొంది. కానీ, సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం సంజయ్ సింగ్‌కు బెయిల్ మంజూరు చేస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. సంజయ్ సింగ్‌కు బెయిల్ మంజూరు అంశాన్ని ఇతర నిందితులకు బెయిల్ వాదనలకు ఉపయోగించరాదని స్పష్టం చేసింది. ఈ బెయిల్ ఆర్డర్‌ను ప్రిసిడెంట్‌గా చూడరాదని పేర్కొంది. దీంతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ వాదనల్లో సంజయ్ సింగ్ బెయిల్ ఆర్డర్‌ను ఉటంకించే అవకాశం లేకుండా పోయింది.
ఢిల్లీ ప్రభుత్వం లిక్కర్ పాలసీలో లిక్కర్ లైసెన్స్ హోల్డర్లకు అనుకూలంగా మార్పులు చేశారని ఆరోపణలు ఉన్నాయి. 2021-22 కాలంలో ఈ పాలసీని అమలు చేశారు. ఆ తర్వాత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఫిర్యాదుతో ఈ కేసు విచారణను సీబీఐ ప్రారంభించింది. ఇందులో మనీలాండరింగ్ కోణాలు బయటికి రావడంతో ఈడీ రంగంలోకి దిగింది.