EVM: మన దేశ ప్రజాస్వామ్యానికి పండుగ పర్వంగా ఎన్నికలను పేర్కొంటారు. ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకుని, తద్వార ప్రభుత్వాన్ని ఎంచుకునే అధికారాన్ని ఎన్నికల ద్వారా ఉపయోగించుకుంటారు. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజల పండుగ. ఎన్నికల ప్రక్రియ మన దేశంలోనూ అప్‌డేట్ అయింది. ఒకప్పుడు బ్యాలెట్ విధానం ఉండగా.. ఇప్పుడు ఈవీఎం విధానం అమలవుతున్నది. ఈవీఎం విధానంపై పలు రాజకీయ పార్టీలు, ప్రముఖులు అనుమానం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా, ఇలా దాఖలైన మూడు పిటిషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.
ఈవీఎంలో క్యాస్ అయిన ప్రతి ఓటుతో వీవీప్యాట్ స్లిప్‌లను సరిపోల్చాలని, తద్వార ప్రతి వీవీప్యాట్ స్లిప్‌ను లెక్కించేలా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును నివేదించారు. ఈ పిటిషన్లపై వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఏప్రిల్ 18నే తీర్పును రిజర్వ్‌లో పెట్టగా ఈ రోజు వెలువరించింది. ఈవీఎం ఓట్లతో ప్రతి వీవీప్యాట్ స్లిప్‌ను లెక్కించాలన్న అభ్యర్థనను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం తోసిపుచ్చింది. ఈవీఎంలకు బదులు బ్యాలెట్ విధానాన్ని కోరిన వారి పిటిషన్లను కొట్టివేసింది. పిటిషనర్లపై అసహనం కూడా వ్యక్తం చేసింది.
Also Read: కొందరికే దేశ సంపద.. దగ్గరుండి లూటీ చేయిస్తున్న మోదీ
‘పేపర్ బ్యాలెట్ ఓటింగ్, ఈవీఎ-వీవీప్యాట్‌ల సంపూర్ణ వెరిఫికేషన్, వీవీప్యాట్ స్లిప్‌ల ఫిజికల్ డిపాజిట్ అభ్యర్థనలను తిరస్కరించినట్టు సుప్రీంకోర్టు తన ఆర్డర్‌లో పేర్కొంది. అంతేకాదు, విశ్వాసయుత వాతావరణాన్ని అభివృద్ధి చేసుకోవాలని, అదే ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని సూచించింది. సంతులన దృక్పథం చాలా ముఖ్యమని, గుడ్డిగా ఒక వ్యవస్థను అనుమానించడం సరికాదని మొట్టికాయలు వేసింది. అది న్యాయవ్యవస్థ అయినా, శాసన వ్యవస్థ అయినా అర్థవంతమైన విమర్శలు అవసరం అని తెలిపింది. సామరస్యాన్ని కాపాడుతూ అన్ని వ్యవస్థల మధ్య నమ్మకాన్ని కలిగి ఉండటమే ప్రజాస్వామ్యం అని వివరించింది. విశ్వాసం, సమన్వయం వాతావరణాన్ని పెంచుకుంటే.. ప్రజాస్వామ్య వాణిని బలోపేతం చేయగలమని తెలిపింది.
ఈవీఎంలతో వీవీప్యాట్ స్లిప్‌లను పోల్చాలనే అంశం చాలా కాలంగా చర్చలో ఉన్నది. 2019 లోక్ సభ ఎన్నికలకు పూర్వం 21 ప్రతిపక్ష పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించి కనీసం 50 శాతం ఈవీఎంలనైనా వీవీప్యాట్‌లతో వెరిఫై చేయాలని కోరాయి. అప్పుడు ఎన్నికల సంఘం ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఒక ఈవీఎంను వీవీప్యాట్‌తో పరిశీలన చేసేది. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఈ సంఖ్యను ఒకటి నుంచి ఐదు ఈవీఎంలకు పెంచింది. 2019లో ఏప్రిల్ 18న సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత అన్ని ఈవీఎంలను వీవీప్యాట్‌లతో క్రాస్ చెక్ చేయాలని కొందరు టెక్నోక్రాట్‌లు పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.