– విచారణకు సహకరిస్తే.. అరెస్టులు వద్దు
– పీఎంఎల్ చట్టంలో సెక్షన్ 19 అధికారాలపై స్పష్టత
– అరెస్ట్ వారెంట్ జారీ విషయంలో కీలక ఆదేశాలు
Supreme Court: కేంద్రంలోని ప్రభుత్వం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ ప్రత్యర్థులను వేధిస్తోందన్న ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నవేళ.. బాధితులకు ఊరటగా ఉండేలా సుప్రీంకోర్టు గురువారం చరిత్రాత్మక తీర్పునిచ్చింది. ఒకవేళ నిందితుడు ప్రత్యేక న్యాయస్థానం జారీచేసిన సమన్లకు స్పందించి, విచారణకు హాజరైతే సదరు నిందితుడిని ఈడీ అరెస్టు చేయటం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ నిందితుడిని అరెస్టు చేయటం అత్యంత అవసరమని ఈడీ భావిస్తే, అందుకు ముందుగా న్యాయస్థానం అనుమతి తీసుకుని తీరాలని ఆదేశించింది.
‘సమన్లకు హాజరై సమాధానం ఇచ్చిన తర్వాత నిందితుడ్ని కస్టడీలోకి తీసుకోవాలని భావిస్తే అందుకోసం ప్రత్యేక కోర్టుకు దరఖాస్తు చేయాలి. సదరు కేసులో కస్టోడియల్ విచారణ అనివార్యం అని కోర్టు నమ్మితే, అందుకు అనుమతిస్తుంది. సీపీసీ సెక్షన్ 70 ప్రకారం నిందితుడు సమన్లకు సమాధానం ఇవ్వడంలో విఫలమైనప్పుడు మాత్రమే దర్యాప్తు ఏజెన్సీ అరెస్ట్ వారెంట్ జారీచేయాలి’ అని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భయన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఇకపై.. దర్యాప్తు సంస్థ ఫిర్యాదు(ఎఫ్‌ఐఆర్) నమోదు చేసే సమయానికి నిందితుడిని అరెస్టు చేయకపోతే, ఆ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకుపోవాలి తప్ప నేరుగా అరెస్టు వారెంటు ఈడీ జారీ చేయటం కుదరదు. తాజా తీర్పుతో ఈడీ ఏకపక్ష అరెస్టుల నుంచి బాధితులకు రక్షణ లభించినట్లయింది. ఈడీ వైఖరి మీద దాఖలైన పిటిషన్ మీద విచారణను ఏప్రిల్ 30న పూర్తి చేసిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేయగా, గురువారం ఆ తీర్పును వెలువరించారు.
Also Read: Rahul Gandhi: ఆలోచింపజేస్తున్న ‘ఒక్క ఓటు’
దేశ ఆర్థిక వ్యవస్థను ఛిద్రం చేసే అవకాశమున్న మనీలాండరింగ్ కేసుల్లో దర్యాప్తుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు ఉన్న విస్తృత అధికారాలను సమీక్ష చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను గతంలో సుప్రీంకోర్టు కొట్టివేసింది. తీవ్ర ఆర్థిక నేరాలను విచారించే విషయంలో ఆ ఏజెన్సీకి ఆ మాత్రం అధికారం ఉండాల్సిందేనని గతంలో కోర్టు అభిప్రాయ పడింది. కానీ, తాజా తీర్పుతో ఈడీ దూకుడుకు కొంతమేర అడ్డుకట్ట పడినట్లయింది.