Sukhesh Chandrasekhar letter to kejriwal(Today’s breaking news in India): మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన, ఆర్థిక నేరస్తుడు సుఖేష్ చంద్రశేఖర్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా ఆయన మండోలి జైలు నుంచి అరవింద్ కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్, కైలాష్ గెహ్లాట్‌లను ఉద్దేశించి ఓ లేఖ విడుదల చేశారు. వారి జైళ్ల శాఖ మంత్రి కైలాష్ గెహ్లాట్‌తో అరవింద్ కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్‌లు తిహార్ జైలులో సంతృప్తిగా ఉన్నారని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. తనపై మాత్రం జైళ్ల శాఖ అధికారులతో ఒత్తిడి తెస్తున్నారని, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కానీ, తాను భయపడనని, స్టేట్‌మెంట్లు ఇవ్వడాన్ని ఆపనని స్పష్టం చేశారు. ప్రతి విషయాన్ని బయటపెడతానని తెలిపారు.
సూపరింటెండెంట్, ఇతర జైలు అధికారుల ద్వారా కైలాష్ గెహ్లాట్ ఎలాంటి ఒత్తిడి తెచ్చినా విషయాలన్నీ బయటపెడతానని హెచ్చరించారు. ‘కేజ్రీవాల్ జీ మీరు నాకు రాజ్యసభ సీటు ఇస్తా అన్నారు. అందుకోసం రూ. 50 కోట్లు తీసుకున్నారు’ అని ఆరోపించారు. కేజ్రీవాల్ సూచన మేరకు ఆయన ఫామ్ హౌజ్‌లో డబ్బులు డెలివరీ చేశానని, అందుకు సంబంధించిన వాట్సాప్ చాట్‌లు అన్నీ భద్రంగా ఉన్నాయని వివరించారు.
Also Read: రిమాండ్ రిపోర్టులో మరోసారి బీఆర్ఎస్ సుప్రీమో
గత మూడు నాలుగు రోజులుగా జైలు అధికారుల ద్వారా ఆప్ ప్రభుత్వం తనపై ఒత్తిడి తెచ్చిందని, బెదిరించిందని సుఖేష్ చంద్రశేఖర్ ఆరోపించారు. వీటిపై హోం శాఖ, సీబీఐతో దర్యాప్తు చేస్తారు అని తెలిపారు. రాబోయే రోజుల్లో కేజ్రీవాల్, తాను, సత్యేంద్ర జైన్, జైలు అధికారుల మధ్య జరిగిన వాట్సాప్ చాట్‌లు భద్రంగా ఉన్నాయని, ఈ చాట్‌ల ట్రైలర్‌ను విడుదల చేస్తానని హెచ్చరించారు. ఇక తిహార్ జైలుకు మరో ముగ్గురు కేజ్రీవాల్ మిత్రులు వస్తారని జోస్యం చెప్పారు. తిహార్ క్లబ్‌లో మరో మూడు స్లాట్లు సిద్ధంగా ఉంచాలని సూచించారు. ముగ్గురు మిత్రులను తిహార్ జైలుకు వస్తారని తెలిపారు. వారికి ప్లాటినం సభ్యత్వం సిద్ధంగా ఉంచండి అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశారు. విచారణ సమయంలో త్వరలోనే కలుద్దాం పేర్కొన్నారు. అంతేకాదు, కేజ్రీవాల్ బరువు తగ్గుతున్నారని ప్రజలను మోసం చేయడం మానుకోవాలని, సలాడ్‌లు, పాలక్ పనీర్లతో విలాసవంతంగా ఆస్వాదిస్తున్నాడని లేఖలో వివరించారు.