– లిక్కర్ కేసుకు సంబంధించి మరో లేఖ వదిలిన సుఖేష్ చంద్రశేఖర్
– ఈసారి హోంశాఖకు లేఖ రాస్తూ కీలక వ్యాఖ్యలు
– నెయ్యి డబ్బాల కోడ్ ల్యాంగ్వేజ్‌తో చేతులు మారిన డబ్బుపై క్లారిటీ
– వాట్సాప్ స్క్రీన్ షాట్స్ జత చేస్తూ లేఖ
– ‘కవితక్క టీఆర్ఎస్’ పేరుతో ఉన్న చాటింగ్ బయటపెట్టిన సుఖేష్
ఢిల్లీ, స్వేచ్ఛ: కేజ్రీవాల్, కవితకు తలనొప్పిగా తయారయ్యాడు ఆర్థిక నేరస్థుడు సుఖేష్ చంద్రశేఖర్. తాజాగా మండోలి జైలు నుంచి మరో లేఖ విడుదల చేశారు. కేజ్రీవాల్, కవిత, సత్యేంద్ర జైన్‌ల గురించి ప్రస్తావిస్తూ లేఖాస్త్రం సంధించాడు. అంతేకాదు, ముగ్గురి పేర్లను ప్రస్తావిస్తూ కేంద్ర హోంమంత్రికి లేఖ ద్వారా ఫిర్యాదు చేశాడు. గతంలో జరిగిన నెయ్యి డబ్బాల వ్యవహారంపై లేఖలో ప్రస్తావించాడు. నెయ్యి అనే కోడ్ ల్యాంగ్వేజ్‌తో ముడుపులు చేతులు మారినట్లు పేర్కొన్నాడు.
Also Read: కాంగ్రెస్‌కు సీపీఐ సంపూర్ణ మద్దతు.. ‘బీజేపీని నిలువరించడమే లక్ష్యం’
హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్ కార్యాలయం నుంచి నగదును సేకరించినట్లు తెలిపిన సుఖేష్ చంద్రశేఖర్, కవిత సహకారంతోనే ఈ వ్యవహారమంతా జరిగినట్లు అన్ని ఆధారాలు తన దగ్గర ఉన్నాయని చెప్పాడు. కవిత, కేజ్రీవాల్, సతేందర్ జైన్, తన మధ్య జరిగిన వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్లను జత చేసి పంపిస్తున్నానంటూ హోమ్ శాఖకు రాసిన లేఖలో పేర్కొన్నాడు సుఖేష్. కవిత ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న నేపథ్యంలో ఈ స్క్రీన్ షాట్లను జతపరుస్తున్నానని తెలిపాడు. కేజ్రీవాల్, సత్యేందర్ జైన్ నేతృత్వంలోని ఆప్ సిండికేట్‌కు సంబంధించి తన దగ్గర ఉన్న పూర్తి సాక్ష్యాలతో సహకారాన్ని అందిస్తానని స్పష్టం చేశారు. కవితక్క టీఆర్ఎస్ అనే పేరుతో ఉన్న వాట్సాప్ స్క్రీన్ షాట్లను బయటపెట్టాడు సుఖేష్.