Taiwan Earthquake: చైనాతో వివాదం కారణంగా తరుచూ వార్తల్లో కనిపించే తైవాన్ దేశం ఇప్పుడు వణికిపోతున్నది. ఈ దేశం రెండు టెక్టోనిక్ ప్లేట్ల మధ్య ఉండటంతో ఎక్కువ భూకంపాలకు కేంద్రంగా మారుతున్నది. 1999లో ఈ దేశంలో సంభవించిన భూకంపంతో యావత్ ప్రపంచం ఉలిక్కిపడింది. అప్పుడు సుమారు 24 వేల మంది ఈ ప్రకృతి విలయానికి బలయ్యారు. అక్కడ 1999 భూకంపం తర్వాత అంటే.. 25 ఏళ్ల అనంతరం మరోసారి బలమైన భూకంపం సంభవించింది. బుధవారం ఉదయం మరోసారి తైవాన్ దేశం భయంతో వణికిపోయింది.
ఉన్నట్టుండి భూమి కంపించింది. పెద్ద పెద్ద భవనాలు ధ్వంసమయ్యాయి. చాలా వరకు ఒకవైపు ఒరిగిపోయాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.4గా నమోదైంది. ఈ తీవ్రతతో సునామీ వచ్చే ముప్పు ఉన్నదనీ చాలా మంది భయపడ్డారు. భూకంప తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఇది వరకే ఇక్కడ సునామీ హెచ్చరికలు జారీ చేశారు. 1999లో భూకంప తీవ్రత 7.6గా రికార్డ్ కావడం గమనార్హం. ఇదే ఆ దేశ చరిత్రలో అత్యంత భీకర, ప్రాణాంతక భూకంపంగా మిగిలిపోయింది.
బుధవారం స్థానిక సమయం 8 గంటలకు ఇక్కడ భూమి కంపించింది. హులియన్ నగరానికి 18 కిలోమీటర్ల దూరంలో 34.8 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించారు. ఈ భూకంపం కారణంగా ఒకరు మరణించినట్టు అనుమానిస్తున్నారు. కనీసం 60 మంది గాయపడినట్టు తెలుస్తున్నది. భూకంపం కేంద్రం చాలా సమీపంగా ఉన్నట్టు తోచిందని తైపేయి సెంట్రల్ వెదర్ అడ్మినిస్ట్రేషన్‌కు చెందిన సెస్మాలజీ సెంటర్ డైరెక్టర్ వు చిన్ ఫు పేర్కొన్నారు. ఈ భూకంప తీవ్రత తైవాన్ దేశవ్యాప్తంగా, సమీపంలోని ఇతర దీవుల్లోనూ కనిపించిందని వివరించారు.
స్థానిక టీవీ చానెళ్లలో విస్మయకర దృశ్యాలు కనిపించాయి. చాలా భవంతులు ఒక వైపు ఒరిగి, ధ్వంసమై కనిపించాయి. ఆస్తి నష్టం గణనీయంగా సంభవించినట్టు తెలుస్తున్నది. తైవాన్‌తోపాటు జపాన్, ఫిలిప్పీన్స్ అధికారులూ సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తైవాన్‌కు సహాయం చేయడానికి, అవసరమైతే విపత్తు సహాయక సేవలు అందిస్తామని చైనా తెలిపింది.
సోషల్ మీడియాలోనూ తైవాన్ భూకంపానికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.