– శోభాయమానంగా సీతారాముల కల్యాణం
– భద్రాద్రికి తరలివచ్చిన అశేష జనం
– ఎన్నికల కోడ్ వల్ల హాజరుకాని సీఎం దంపతులు
– పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించిన సీఎస్ శాంతికుమారి
– కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు
– 12.06 నిమిషాలకు మాంగల్యధారణ మహోత్సవం
– వైష్ణవ సంప్రదాయానుసారం జరిగిన రామయ్య కల్యాణం
– శ్రీరామ స్మరణతో మార్మోగిన ఆలయ ప్రాంగణం
Sri Sita Rama Kalyana Mahotsavam : భద్రాద్రి సీతారాముల కల్యాణం చూతము రారండి అంటూ భక్తులు మురిసిపోయారు. రాముడి గుడి లేని ఊరు లేదు తెలుగు రాష్ట్రాలలో. రాముడి ఫొటో లేని హిందూ కుటుంబం కూడా ఎక్కడా ఉండదు. తమ మనసుల్లో అంతటి దేవదేవుని కల్యాణోత్సవాన్ని భద్రాచలంలో ప్రత్యక్ష వీక్షణమే కాదు తెలుగు రాష్ట్రాలలో ఉన్న భక్తకోటి టీవీ లైవ్‌లో చూసుకుని సంబరపడిపోతారు. ఈసారి కల్యాణానికి రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం భద్రాచలానికి తరలివచ్చారు భక్తులు. జై శ్రీరామ్, జై సీతారామ్ అంటూ ఓ పక్క భక్త జనం మరో పక్క వేద పండితులు సీతారాముల కల్యాణ తంతును అభివర్ణిస్తూ మరింత శోభాయమానం చేశారు. ఇంకో వైపు మంగళ వాయిద్యాలతో నాటి మిథిలాపురిని తలపించింది భద్రాద్రి.
పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎస్ శాంతికుమారి
ఎలక్షన్ కోడ్ కారణంగా సీఎం రేవంత్ రెడ్డి దంపతులు ఈ కార్యక్రమానికి వెళ్లలేకపోయారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎస్ శాంతి కుమారి దంపతులు స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం మండపంలోని భక్తులకు దేవస్థానం స్థానాచార్యులు శ్రీమాన్ స్థల సాయి కల్యాణ ప్రాసస్థ్యం వివరించారు. సరిగ్గా 12 గంటలకు భక్తుల జయ జయ ధ్వానాల మధ్య అభిజిత్ లగ్నంలో వధూవరుల శిరస్సుపై జీలకర్ర బెల్లం ఉంచారు. దశరధ మహారాజు, జనక మహారాజు, భక్త రామదాసు చేయించిన మూడు మంగళసూత్రాలను భక్తులకు అర్చకస్వాములు చూపించి సరిగ్గా 12.06 నిమిషాలకు మాంగల్యధారణ గావించారు. అనంతరం నూతన వధూవరులకు ఆండాళ్లమ్మ, శ్రీరంగనాధుని ప్రబోధంతో వైష్ణవ సంప్రదాయంగా బంతులాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ తరువాత తలంబ్రాల కార్యక్రమాన్ని 12.15కి కన్నుల పండువగా నిర్వహించి అష్టోత్తర హారతిని స్వామి వారికి సమర్పించి కల్యాణ తంతును ముగించారు. చిన జీయర్ స్వామి పర్యవేక్షణలో కల్యాణోత్సవం జరుగగా, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, కలెక్టర్ ప్రియాంక ఆలా, ఎస్పీ రోహిత్ రాజ్, ఈఓ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
తరతరాల సంప్రదాయం
భద్రాచలం పుర వీధులు శ్రీ రామనామస్మరణతో మార్మోగాయి. స్వామివారి కల్యాణానికి తరలివచ్చిన యాత్రికులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు..ఎండ దృష్ట్యా ఆలయ పరిసరాల్లో చలువ పందిళ్లు, కూలర్ల ఏర్పాటు చేశారు. భద్రాద్రిలో కల్యాణం త్రేతాయుగంలో సీతారాముల మనువును కళ్లముందు నిలుపుతుంది. తొలుత మూల విరాట్టుకి కల్యాణం నిర్వహించారు. మంగళవాద్యాల మధ్య సీతారాముల విగ్రహాలు పల్లకీలో కల్యాణ మండపానికి వేంచేశాయి. ఆ మూర్తులకు శరణాగతులం కావడమే ఆత్మనివేదనగా అభివర్ణిస్తారు. శ్రీరామచంద్రుడికి జానకమ్మే తగిన వధువంటూ పెద్దలంతా నిర్ణయించారు. సీతమ్మకి యోక్త్రధారణ నిర్వహించి రాముడికి యజ్ఞోపవీత ధారణ చేసి ప్రవరను పఠించారు. తర్వాత వధూవరుల గోత్రనామాలూ కల్యాణవైభవాన్ని చాటి చెప్పే చూర్ణికనూ పఠించారు. మంగళవాద్యాలు మార్మోగుతుండగా వేద మంత్రాల మధ్య అభిజిత్ లగ్నం సమీపించగానే జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని సీతారాముల శిరస్సులమీద ఉంచారు.
మూడు మంగళసూత్రాల విశిష్టత
రామయ్య పెళ్లిలో పుట్టింటివారూ అత్తింటివారితోపాటు పితృవాత్సల్యంతో భక్త రామదాసు చేయించిన మంగళపతకాన్ని కలిపి మూడు మంగళ సూత్రాలను ధరింపజేయడం క్షేత్ర ఆనవాయితీ. కొత్త దంపతులను ఆశీర్వదించడంతో కల్యాణ క్రతువు ముగిసింది. ఆ తర్వాత స్వామి దేవాలయానికి చేరుకున్నారు. అక్కడ రాజభోగం ఆరాధన నిర్వహించారు. కన్నులపండువగా జరిగే సీతారాముల కల్యాణాన్నీ మర్నాడు జరిగే పట్టాభిషేకాన్నీ చూసిన సంతృప్తితో భక్తులు ఇళ్లకు బయల్దేరతారు. ఆసక్తి ఉన్నవాళ్లు వనవాసంలో రెండున్నరేళ్లు సీతారాములు నివసించారని చెప్పే పర్ణశాలనీ, జటాయు రెక్క తెగిపడిన ప్రాంతంగా భావించే ఎటపాకనీ, రామబాణంతో ఏర్పడిన ఉష్ణగుండాలనీ, గోదావరి కరకట్టపై వనవాసం నుంచి పట్టాభిషేకం వరకూ ఉన్న విగ్రహాలనీ, పాపికొండల అందాలనీ చూసి వెనుతిరుగుతారు.