Weather Update: రానున్న 24 గంటల్లో కేరళ తీరానికి నైరుతి రుతుపవనాలు తాకుతాయని కేంద్ర వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. కేరళ తీరాన్ని తాకడానికి పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది. అరేబియా సముద్రంలో బలమైన గాలులు, వాతావరణంలో తేమ శాతం పెరగడం, ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఏర్పడ్డ అస్థిరత వంటి పలు పర్యావరణ అంశాలు ఇందుకు దోహదం చేస్తున్నాయని ఐఎండీ తెలిపింది. కేరళను తాకిన నాలుగైదు రోజుల్లో ఈ రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా విస్తరించే అవకాశాలు ఉన్నాయి. నైరుతి రుతుపవనాలతో ఈ సారి విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. ఈ ఏడాది వానాకాలంలో సాధారణంగా కంటే అధికంగా వర్షపాతం ఉంటుందని అంచనాలు వచ్చాయి.
మే 31వ తేదీన రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని ఇది వరకే ఐఎండీ అంచనా వేసింది. గతేడాది జూన్ 8వ తేదీన రుతువపనాలు వచ్చాయి. దీంతో గతంలో కంటే ఈ సారి ముందుగానే వస్తాయన్న అంచనాలు ఉన్నాయి. జూన్ తొలి రోజుల్లో సాధారణంగా రుతుపవనాలు మన దేశంలోకి ప్రవేశిస్తాయి. ఈ సారి మాత్రం మే నెలలోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. చివరిసారి 2022లో మే నెలలో రుతుపనాలు వచ్చాయి. అప్పుడు మే 29వ తేదీనే రుతువపనాలు కేరళ తీరాన్ని తాకాయి.
ఢిల్లీ చరిత్రలోనే అత్యధికం.. 52.3 డిగ్రీలు
దేశ రాజధాని ఢిల్లీలో గరిష్టంగా 52.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఢిల్లీలో ఈ స్థాయి ఉష్ణోగ్రతలు ఎప్పుడూ నమోదు కాలేదు. బుధవారం తొలిసారిగా ఈ స్థాయిలో ఎండలు కాసినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. వాయవ్య ఢిల్లీలోని ముంగేష్‌పూర్‌లో ఈ రికార్డు టెంపరేచర్ బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు నమోదైంది. అంతకు ముందు రోజు ఇదే ముంగేష్‌పూర్‌లో 49.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. ఢిల్లీలో చాలా చోట్ల అంతకు ముందటి రికార్డులను బ్రేక్ చేస్తూ టెంపరేచర్లు నమోదయ్యాయి. మధ్యాహ్నం ఎండలు మాడు పగులగొట్టేలా పడితే.. సాయంత్రం మాత్రం వాతావరణం అకాస్మాత్తుగా మారిపోయింది. ఎన్సీఆర్‌లో వర్షం కురుస్తుందని, 20 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ వెల్లడించింది.