– అవతరణ వేడుకకు ‘హస్తం’ నేతల ఏర్పాట్లు
– గ్రామగ్రామానా ఆవిర్భావ వేడుకలు
– 6 గ్యారంటీలపై వినూత్న ప్రచారం
-పెరేడ్ గ్రౌండ్ సభలో ఉద్యమకారులకు సన్మానం
Sonia Gandhi Was The Chief Guest At The Inauguration Ceremony: ప్రత్యేక రాష్ట్రం ఇచ్చి పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ.. తమ ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు సమాయత్తమౌతోంది. పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి ‘తెలంగాణను ఇచ్చిందీ తెచ్చిందీ కాంగ్రెస్ పార్టీయే’నంటూ వివరణ ఇచ్చుకున్న పార్టీ.. ఇదే విషయాన్ని మరొకసారి ఎలుగెత్తి చాటేందుకు సిద్ధమౌతోంది. గతేడాది దశాబ్ది ఉత్సవాల సందర్భంగా టీపీసీసీ వినూత్న పాదయాత్రకు శ్రీకారం చుట్టగా.. ఈయేడు ప్రభుత్వం వచ్చిన ఉత్సాహంతో మరింత ఉత్తేజభరిత వాతావరణంలో అవతరణ దినోత్సవాలను జరపాలని నిశ్చయించింది. ఈ వేడుకలకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ముఖ్య అతిథురాలిగా తెలంగాణకు ఆహ్వానించటంతో బాటు ఆరు గ్యారంటీల అమలు, ఈ ఆరు నెలల సుపరిపాలన, ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా పలు కార్యక్రమాల ఏర్పాటుకు సర్కారు సిద్ధమవుతోంది.
గతేడాది దశాబ్ది ఉత్సవాల సందర్భంగా బీఆర్‌ఎస్ సర్కారు వైఫల్యాలపై ఎక్కుపెట్టిన కాంగ్రెస్ పార్టీ.. వివిధ కార్యక్రమాలతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు యత్నించింది. దశాబ్దకాలం దగా పేరిట ఉత్సవాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. బీఆర్‌ఎస్ సర్కారు హయాంలో జరిగిన అభివృద్ధి పనుల్లో భారీఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయనే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లింది. టీపీసీసీ ఆధ్వర్యంలో చేపట్టిన నాటి దశాబ్ది ఉత్సవాలకు మొదట సోనియా లేదా రాహుల్ గాంధీని ఆహ్వానించి తెలంగాణ సెంటిమెంట్‌ను తట్టిలేపాలని భావించినా పలు కారణాల రీత్యా లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ హాజరయ్యారు. తదనంతరం వరుస డిక్లరేషన్లు, గర్జనలు నిర్వహించిన కాంగ్రెస్ నాయకత్వం తెలంగాణలో ప్రజాదరణ పొంది, పదేళ్ల నిరీక్షణకు తెరదించుతూ కాంగ్రెస్ సర్కారును కొలువుదీర్చింది. ఈ నేపథ్యంలో వచ్చే నెల జూన్ 2న తెలంగాణ అవతరణ వేడుకలను అత్యంత ప్రతిష్టాత్మకంగా కొనసాగించాలని భావిస్తున్న కాంగ్రెస్ సర్కార్.. గ్రామగ్రామానా ప్రభుత్వ పనితీరును వివరించేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. తెలంగాణను ఇచ్చిందీ, తెచ్చిందీ కాంగ్రెస్సేనంటూ మరొకసారి ఎలుగెత్తి చాటేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధమైంది. ఎన్నికల్లో ఆదరించిన తెలంగాణ ప్రజల తరపున రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీని ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆహ్వానించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, మావోలు హతం
సర్కారు సన్నాహాలు
రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు (జూన్ 2) నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని ఇప్పటికే అధికార పార్టీ ఈసీకి లేఖ రాసినా, దానిపై ఈసీ స్పందించలేదు. జూన్ 1న ఎన్నికల కోడ్ ముగియనుందున రెండవ తేదీ వేడుకలకు ఈసీ అభ్యంతరం తెలపకపోవచ్చని అధికారులు భావిస్తున్నప్పటికీ, చివరి నిమిషం వరకు అనుమతి ఇవ్వకపోతే, బహిరంగ సభ నిర్వహణ కష్టమవుతుందనే కోణంలోనూ వారు ఆలోచిస్తున్నారు. దీనిపై మరోసారి ఈసీని కలిసి, కాస్త ముందుగానే క్లియరెన్స్ పొందాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. గ్రీన్ సిగ్నల్ వస్తే పరేడ్ గ్రౌండ్‌లో భారీ స్థాయిలో సభ, వేడుకలు నిర్వహించి, తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు, నిపుణులకు ఆ వేదికపై సోనియా గాంధీ చేతుల మీదగా సన్మానం చేయించాలని ప్రభుత్వం భావిస్తోంది. అదే వేదికపై రాష్ట్ర గీతం, రాష్ట్ర చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహ నమూనాను ఆవిష్కరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అలాగే ప్రొటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలకు ఆహ్వానాలు పంపే ఏర్పాట్ల మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది.
కేసీఆర్ సైతం రెడీ..
గత పదేళ్లుగా యావత్ తెలంగాణ సెంటిమెంట్ సొంతం చేసుకుని, తెలంగాణ అంటే తానేననే భావనను వ్యాపింపజేసిన కేసీఆర్, ప్రభుత్వం వేడుకలకు పోటీగా తెలంగాణ భవన్‌లో వేడుకలు నిర్వహించనున్నారు. ఈసీ అనుమతిస్తే, బహిరంగ సభ ఏర్పాటు చేయాలనే ఆలోచనా చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు, ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీ ఎలా వస్తారంటూ కొత్త చర్చకూ తెరలేపారు. జూన్ 2న తెలంగాణ ఉద్యమ ఘట్టాలను వివరించేలా గొప్ప ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి, తానే తెలంగాణ సాధకుడిననే సందేశాన్ని జనంలోకి తీసుకెళ్లేందుకు కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని, దీనిపై ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ రానుందని సమాచారం.