Somanath Chits: హనుమకొండ జిల్లా పరకాలలో సోమనాథ్ చిట్స్ యజమాని దుమాల బాబురావు ఆత్మహత్యాయత్నం సంచలనంగా మారింది. బీఆర్ఎస్ నాయకులు తనను మోసం చేశారని, బెదిరింపులకు పాల్పడ్డారని, దాడికి కూడా దిగారని బాబురావు ఆరోపించారు. కొందరు మిత్రులు, ప్రజా ప్రతినిధులు, ప్రముఖల పేర్లను పేర్కొంటూ ఆడియో రికార్డును వాట్సాప్‌లో పోస్టు చేశారు.
బీఆర్ఎస్ నేత నాగూర్ల వెంకటేశ్వర్లు, నాగరాజులే తన చావుకు కారణం అంటూ దుమాల బాబురావు లెటర్ రాశాడు. ఆడియో రికార్డులోనూ పేర్కొన్నారు. నాగుర్ల వెంకటేశ్వర్లు తనను మోసం చేయడంతోపాటు దాడి చేసి గాయపరిచాడని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకుడి అనుచరుల బెదిరింపు ఆడియోలనూ వాట్సాప్‌లో పెట్టారు. ఇతర సోషల్ మీడియాలోనూ బాబురావు ఆడియోలు వైరల్ అవుతున్నాయి. వీటిని వాట్సాప్‌లోపెట్టి దుమాల బాబురావు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు.
Also Read: తిహార్ జైలులో కవితను ప్రశ్నించనున్న సీబీఐ
వెంటనే ఆయనను పరకాలలోనే ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ ఇప్పుడు చికిత్స అందిస్తున్నారు. దుమాల బాబురావు ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నది. ఇందుకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.
జీరో పెట్టుబడితో సోమనాథ్ చిట్స్ చైర్మన్‌గా నాగుర్ల వెంకటేశ్వర్లు ఉన్నట్టు బాబురావు తెలిపారు. నాగుర్ల వెంకటేశ్వర్ల నుంచి తనకు సుమారు ఒక కోటి 93 వేల రూపాయలు రావాల్సి ఉన్నదని ఆరోపించారు. కానీ, నాగుర్ల వెంకటేశ్వర్లు తననే బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ బాధలు తాళలేకే పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డట్టు చెబుతున్నారు. ఈ ఘటన జిల్లాలో సంచలనంగా మారింది. నాగుర్ల వెంకటేశ్వర్లు దీనిపై ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉన్నది.