Lok Sabha Elections: సార్వత్రిక ఎన్నికల్లో ఆరో విడతకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. 58 స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో 889 మంది బరిలో ఉన్నట్టు ఎన్నికల సంఘం శనివారం వెల్లడించింది. మే 25వ తేదీన ఈ లోక్ సభ స్థానాల్లో పోలింగ్ జరగనుంది. ఆరో విడతలో 8 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లోని పలు లోక్ సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఇందులో జమ్ము కశ్మీర్ నుంచి అనంత్‌నార్-రజౌరీ స్థానం కూడా ఉన్నది. మూడో విడతలో ఈ స్థానానికి పోలింగ్ జరగాల్సి ఉండగా.. వాయిదా పడింది.
బిహార్ నుంచి 8 స్థానాలు, హర్యానా నుంచి 10 స్థానాలు, జమ్ము కశ్మీర్ నుంచి ఒక్క స్థానం, జార్ఖండ్ నుంచి 4 స్థానాలు, ఢిల్లీ(ఎన్సీటీ) నుంచి 7 స్థానాలు, ఒడిశా నుంచి 6 స్థానాలు, ఉత్తరప్రదేశ్ నుంచి 14 సీట్లు, పశ్చిమ బెంగాల్ నుంచి 8 సీట్లకు పోలింగ్ జరగనుంది. ఈ స్థానాల్లో మొత్తం 1978 నామినేషన్లు దాఖలయ్యాయి. పరిశీలన, ఉపసంహరణల తర్వాత 889 మంది పోటీ చేస్తున్నారు.
ఇప్పటి వరకు నాలుగు విడతల పోలింగ్ ముగిసింది. తొలి విడతలో 66.14 శాతం పోలింగ్ నమోదవ్వగా.. రెండో విడతలో 66.71 శాతం, మూడో విడతలో 65.68 శాతం పోలింగ్ నమోదైంది. మే 13వ తేదీన జరిగిన నాలుగో విడతలో 66.95 శాతం పోలింగ్ నమోదైంది. ఈ లెక్కన తొలి మూడు విడతల పోలింగ్ శాతం కంటే నాలుగో విడతలో ఎక్కువ ఓటు శాతం రికార్డు అయింది. ఏపీలో పోలింగ్ రసవత్తరంగా జరిగింది. అసెంబ్లీ ఎన్నికలతోపాటు లోక్ సభ ఎన్నికలూ జరగడంతో పెద్ద ఎత్తున ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వలసలు వెళ్లిన వారూ ఓటు కోసం స్వస్థలాలకు వచ్చారు.
నాలుగో విడతలో పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలోని స్థానం మొత్తం కలిపి 96 సీట్లకు పోలింగ్ జరిగింది. ఈ విడతలో ఏపీ, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.